Abn logo
Sep 20 2021 @ 23:28PM

అమ్మఒడిపై కత్తి!
అనర్హుల పేరిట తొలగింపునకు సిద్ధం

జాబితాలో ఆశ, అంగన్‌వాడీ సిబ్బంది పేర్లు

చిరుద్యోగులే బాధితులు

మండిపడుతున్న కార్మిక సంఘాలు

(ఇచ్ఛాపురం రూరల్‌)

అమ్మఒడి పథకంలో లబ్ధిదారుల కోతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆదాయపు పన్ను కడుతున్న వారు, భూములు అధికంగా ఉన్నవారు, కార్లు, ఇతర వాహనాలు ఉన్నవారికి అమ్మఒడి అందుతున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో వందమంది లబ్ధిదారుల అర్హతపై ప్రభుత్వం నమూనా సర్వే నిర్వహించింది. ఇందులో చాలా లోపాలు వెలుగు చూసినట్టు తెలుస్తోంది. అందుకే పథకం తీరుతెన్నులపై సమగ్ర విచారణకు కమిటీలు రూపొందించాలని పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు ఆదేశాలు జారీచేసింది.  జిల్లాలో 2020 జనవరిలో మొదటి విడత అమ్మఒడి కింద 2,39,902 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు రూ. 15 వేల చొప్పున జమచేశారు.  2021 జనవరిలో రెండో విడతగా 2,39,692 లక్షల మందికి పథకాన్ని వర్తింపజేశారు. మొదటి విడత నుంచి రెండో వితకు వచ్చేసరికి లబ్దిదారుల సంఖ్య జిల్లాలో కాస్త తగ్గింది. ఈ ఏడాది జూన్‌లో అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే నిర్వహించారు. అందులో భాగంగా జిల్లాలో పలుచోట్ల అనర్హులు లబ్ధి పొందినట్లు వెలుగు చూసింది. రెండో విడతలో గుర్తించిన అనర్హుల నుంచి నగదు రికవరీ చేస్తారా.. వచ్చే ఏడాది జాబితాలో వారి పేర్లను తొలగింపుతో సరిపెడతారా అనే విషయమై ఉన్నతాధికారులు స్పష్టం చేయడంలేదు. అనర్హులుగా చూపుతున్న వారిలో చాలా మంది చిరుద్యోగుల పిల్లలే ఎక్కువగా ఉన్నారు. ప్రభుత్వ విభాగంలో పనిచేస్తూ నెలకు రూ.10 వేల ఆదాయం మించిన వారందర్నీ అనర్హులుగా చూపిస్తున్నారు. ముఖ్యంగా ఆశ కార్యకర్తలకు పనికి తగ్గ వేతనమే తప్ప జీతాలు ఇవ్వరు. అయినా వారిని కూడా అనర్హులుగా చేర్చడాన్ని విద్యాశాఖ వారే తప్పుపడుతున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగల పిల్లలకు ఈ పథకాన్ని దూరం చేయడంపై ఆ సంఘం నేతలు మండిపడుతున్నారు. 

వీరి మాటేమిటో?

 కొంతమంది పిల్లలకు తల్లిదండ్రులు లేరు. వారికి అమ్మఒడి పథకం కోసం వారి సంరక్షకుల బ్యాంకు ఖాతా నెంబర్లు ఇచ్చారు. సంరక్షకుని రేషన్‌ కార్డుల్లో ఈ పిల్లలు పేర్లు లేవని అనర్హులుగా చూపించారు. వీరి సమస్యపై గతంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లగా ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. ఆధార్‌, బ్యాంకు ఖాతాల నంబర్లు తప్పుగా ఉన్నాయని కొందరికి మొదటి ఏడాది డబ్బులు అందలేదు. ఇలాంటి వారి వివరాలను సరి చేసి పంపించినా వారికీ రెండో విడత లబ్ధి అందకుండా పోయింది. 

అర్హులందరికీ సాయం

 అనర్హులు ఎవరైనా సాయం పొందుతున్నట్లు నిర్థారణ అయితే వెంటనే తొలగించి ప్రభుత్వ ఆదేశాలతో తగు చర్యలు తీసుకుంటాం. అర్హత కలిగిన ఏ ఒక్కరూ నష్టపోకుండా అందరికీ సాయం అందించేలా కృషి చేస్తున్నాం. లబ్ధిదారులు పత్రాలు ఇచ్చేటప్పుడే తప్పులు దొర్లకుండా చూసుకోవాలి. అర్హత కలిగిన వారు నష్టపోకుండా శాఖాపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఏవైనా సమస్యలు ఉంటే తల్లిదండ్రులు పాఠశాల ప్రఽధానోపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలి.

- జి.పగడాలమ్మ, ఇన్‌చార్జి డీఈవో, శ్రీకాకుళం.