Abn logo
Sep 26 2021 @ 18:15PM

qatar వేదికగా 24 గంటల ఎస్పీ బాలు స్వరరాగ మహా యాగం..!

ఖతార్:  గాన గంధర్వ పద్మవిభూషణ్ ఎస్ పి బాలును స్మరిస్తూ వంశీ -  ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ (GIFT),  తెలుగు కళా సమితి ఖతార్ సంయుక్త ఆధ్వర్యంలో ఖతార్ వేదికగా " 24 గంటల ఎస్ పి బాలు స్వర రాగ మహా యాగం" అంతర్జాలంలో ఘనంగా జరిగింది. సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం పది గంటలకు ప్రారంభమై 25వ తేదీ ఉదయం 10 గంటలకు స్వరరాగ మహా యాగం పూర్తయింది. ఘంటసాల ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ట్రస్ట్ కన్వీనర్ పద్మజ ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.  వంశీ సంస్థల అధినేత కళాబ్రహ్మ శిరోమణి డాక్టర్ వంశీ రామరాజు,  తాతాజీ ఉసిరికల,  అధ్యక్షులు తెలుగు కళా సమితి,ఖతార్  ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఏదైనా ఒక విశ్వవిద్యాలయంలోని సంగీత విభాగంలో ఎమ్ .ఎ. మ్యూజిక్ లో  అత్యుత్తమ స్థానం పొందిన విద్యార్థులకు ఎస్ పి బాలు పేరిట స్వర్ణ పతకాన్ని నెలకొల్పుతామని తెలియజేశారు.

సభా ప్రారంభకులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు డా. కె.వి.రమణాచారి ఐ ఏ ఎస్ మాట్లాడుతూ "బాల సుబ్రహ్మణ్యం గురించి ఎంత చెప్పినా తక్కువేనని.. సంకల్పం, కృషి, దీక్ష ,తపన, రాజీపడని తత్వం, ఒడిసిపట్టి ఎదిగే నైపుణ్యం - ఈ సప్తగుణాలన్నీ కలిసి ఆయన గొంతులో సప్తస్వరాలుగా ప్రతిష్ఠితమైనాయి"  అని అన్నారు,  బాలు పాటలే ఆ సప్తస్వరాల వైభవాన్ని చెప్పాయంటూ ఆ గాన గంధర్వునితో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. 


వైద్య సేవా శిరోమణి డాక్టర్ గురవారెడ్డి మాట్లాడుతూ " ఎస్ పి బాలు ఐ సీ యు లోకి వెళ్లే రెండు రోజుల ముందు తనకు పెట్టిన వాయిస్ మెయిల్ వినిపించారు. అందులో ఎస్పీబీ మాట్లాడుతూ.. 'నేను ప్రికాషన్స్ కోసం ముందుగా  అడ్మిట్ అయ్యాను.. ఎందుకంటే నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఏది రాలేదు, నాకు విపరీతమైన జలుబు ఫీవర్  - దానికి టెస్ట్ చేయించుకున్నాను. ఇంట్లో ఉండి కూడా ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చన్నారు.. నేను హాస్పిటల్ లోనే ఉంటానని వచ్చాను.. నేను మధ్యాహ్నం నుంచి మామూలు అయిపోయినట్లే లెక్క, కానీ  ఐ వాంట్ టు బి హియర్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ డేస్.." అని చెప్పినట్టు గురవారెడ్డి పేర్కొన్నారు. ఆ తరువాత ఆయన ఐ సి యు లోకి వెళ్లడం.. వెనక్కి రాకుండా దూరాలకు వెళ్లిపోవడం జరిగింది.. నిజంగా గ్రేట్ లాస్ " అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  

ఈ కార్యక్రమంలో ఎస్పీబీతో అనుబంధం ఉన్న సంగీత దర్శకులు మాధవపెద్ది సురేష్, తనికెళ్ళ భరణి, సాలూరి వాసు రావు, రేలంగి నరసింహారావు, భువనచంద్ర,  డా వంగూరి చిట్టెన్ రాజు, కె స్వరూపా రెడ్డి, శారద ఆకునూరి, కె ఎస్ ప్రసాద్ ఐసిసి అడ్వైజరీ కౌన్సిల్ ఖతార్ , శ్రీదేవి జాగర్లమూడి, తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ న్యూజెర్సీ, సత్యాదేవి మల్లుల మలేషియా, రత్న కుమార్ కవుటూరు, అధ్యక్షులు శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, డా తెన్నేటి సుధ  అధ్యక్షురాలు వంశీ , శైలజ సుంకరపల్లి మేనేజింగ్ ట్రస్టీ వంశీ, డాక్టర్ ఇప్పనపల్లి చైర్మన్ లీడ్ ఇండియా ఫౌండేషన్ అమెరికా, డా రామరాజు శ్రీనివాసరావు ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ టాక్స్ ప్రాక్టీషనర్ & కన్సల్టెంట్  అసోసియేషన్ గుంటూరు, రాధిక నోరి అమెరికా, ప్రముఖ గాయని శశికళ స్వామి, వైణిక విద్వాంసురాలు రామరాజు లక్ష్మీ శ్రీనివాస్, కొమ్మరాజు  ప్రసాద్ అమెరికా, కుమార్ రాణి న్యూ జెర్సీ,రేవంత్ చిలకమర్తి  కెనడా, మధువాణి వడ్లమాని కెనడా, అనిల్ కుమార్ ఒమన్, ఆదిత్య వెలిచెర్ల ఆస్ట్రేలియా, మనోహర్ ఎల్లా ఆస్ట్రేలియా, శ్రీలత మగతల న్యూజిలాండ్, రమ  ఆస్ట్రేలియా,పద్మ  మల్లెల, గోవర్ధన్ మల్లెల న్యూజిలాండ్, వి.హరిశ్రీనివాస్ బెంగళూరు, రాజశేఖర్ వెలపూరు అమెరికా, మోహన్ విస్సాప్రగడ  ఖజికిస్తాన్, వి ఎస్ మూర్తి కెనడా, గంటా ప్రసాద్ అమెరికా, ప్రముఖ గాయని వి కె దుర్గ, ఉషా చివుకుల అమెరికా,పి బి  సాహితి చెన్నై ,త్రినాధ రావు అమెరికా మరియు 5 ఖండాల నుంచి ఎంతో మంది ఆన్‌లైన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొని బాలు గారికి నివళులు అర్పించారు. 5 సంవత్సరాల బాలిక నుంచి 90 ఏళ్ల వయస్సు గల గాయని వరకు తమ గాత్రాన్ని వినిపించారు. 24 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ పి బాలుకు తమ పాటలతో స్వరాభిషేకం చేశారు. ఒక గంట సేపు ఈలపాట  ద్వారా డా విద్యాసాగర్ టీమ్ సమర్పించిన బాలు పాడిన గీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వారికి వంశీరామరాజు ఎస్ పి  బాలు ఇంటర్నేషనల్ అవార్డు ప్రకటించారు. యు కె నుంచి ఎస్ పి బాలు పాటలు పాడిన ఆదిత్య శివానంద మల్లాది అనే గాయకుడిని  స్వరాభిషేకం లాంటి కార్యక్రమాల్లో ప్రోత్సహించాలని ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి వాసు రావు అభిప్రాయపడ్డారు. వ్యాఖ్యాతలుగా ఖతార్‌కు చెందిన బి భవాని, బి గౌరీదేవి, కె సాహిత్య జ్యోత్స్న, మాధవి బైటారు వ్యవహరించారు.