Abn logo
Sep 26 2020 @ 01:39AM

ఏ దివిలో విరిసిన స్వర పారిజాతమో...

Kaakateeya

  • ఘంటసాల లేని లోటును తీరుస్తూ ఆ మధుర వారసత్వాన్ని పుణికిపుచ్చుకొన్న సుస్వరం ... బాలుది. ఈ స్వరపల్లవం అందుకోని శిఖరం లేదు. ఆలపించని సుస్వరం లేదు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఒరియా, బెంగాలీ, తుళు భాషల్లో ఆయన పాడిన పాటలు శ్రోతల గుండెల్లో సలలిత రాగాల్ని శ్రుతి చేశాయి. పన్నెండు గంటల్లో పదిహేను పాటలు పాడడం, 26 సెకన్లపాటు గుక్క తిప్పుకోకుండా పాట పాడడం.. బాలుకు మాత్రమే సాధ్యం! తెలుగునాట ఓ ప్రభంజనం సృష్టించిన ఈ గాత్రం ఇప్పుడు మూగబోయింది. 


1963వ సంవత్సరం. మద్రాసులోని ఆంధ్రా సోషల్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ (ఆస్కా) వారు ఆ ఏడాది జాతీయస్థాయి డ్రామా, మ్యూజిక్‌ కాంపిటీషన్‌ పెట్టారు. ఆ విషయం తెలిసినా బాలసుబ్రమణ్యం దానికి పేరివ్వలేదు. బాలు రూమ్‌మేట్‌ మురళి.. ఆయనకు తెలియకుండా పదిరూపాయలు కట్టి బాలు పేరు ఇచ్చొచ్చారు. అక్కడ షరతు ఏంటంటే.. సినిమాపాటలు పాడకూడదు. జడ్జీలు ఘంటసాల మాస్టారు, పెండ్యాల మాస్టారు, సుసర్ల దక్షిణామూర్తి మాస్టారు.. ఇలా అందరూ దిగ్ధంతులే! తీరా పాడ్డానికి వెళ్లాక అక్షర క్రమంలో ‘ఎ’ అనే అక్షరంతో పేరు వచ్చేవారెవరూ లేరు. దీంతో మొదటి పేరు బాలుదే అయ్యింది. అక్కడున్న జడ్జీలను చూసి భయపడిపోయిన బాలు.. తానే రాసి, ట్యూన్‌ కట్టుకున్న ‘‘రాగము అనురాగము జీవనరాగములౌగా..’ అనే పాటను కళ్లు మూసుకుని పాడేశారు. ఆయన తర్వాత మరో 70 మంది పాడాల్సినవాళ్లున్నారు. వచ్చి కూర్చుని చూస్తుండగా.. ఆయన వద్దకు ఒకాయన వచ్చి.. ‘ఏఁవయ్యా సినిమాల్లో పాడతావా?’ అని అడిగారు. ఎవరో తనను ఎద్దేవా చేస్తున్నారనుకున్న బాలు.. ‘పాడనండీ’ అన్నారు. ఆయన ఆశ్చర్యపోయారు. ‘ఏం ఎందుకు పాడవు?’ అని అడిగారు. ‘నాకిష్టం లేదు నేను పాడనండీ.. ఎందుకు పాడాలి?’ అని బాలు కూడా గట్టిగానే అన్నారు. దానికాయన.. ‘కాదయ్యా, నేను సీరియ్‌సగా చెబుతున్నాను. నువ్వు బాగా పాడుతున్నావు’ అంటే.. ‘తమరెవరండీ’ అని అడిగారు బాలు. ‘నా పేరు కోదండపాణి, నేను మ్యూజిక్‌ డైరెక్టర్‌ని’ అన్నారాయన. ఈ సంభాషణ జరుగుతున్నంతసేపూ కోదండపాణి నిలబడే ఉండగా.. బాలు కూర్చునే ఉన్నారు. కుర్చీలోంచి లేవలేదు. ఆయన పేరు వినగానే.. పైకి లేచి.. నమస్కారం పెట్టారు. నిజానికి బాలును ‘సినిమాల్లో పాడతావా?’ అని అడిగే సమయానికి కోదండపాణి కూడా రెండు, మూడు సినిమాలే చేశారు. కానీ, కొత్తదనం తీసుకొస్తున్నారన్న పేరు ఆయనకుంది. కోదండపాణి సూచన మేరకు మర్నాడు బాలు నిర్మాత ఎస్‌.భావనారాయణ ఆఫీసుకు వెళ్లారు. బాలు పాట విన్న భావనారాయణ.. ‘‘బానే పాడుతున్నాడ్రా వీడు, కానీ వీడి గొంతు మరీ పిల్లలకు ఉపయోగించలేం, పెద్దవాళ్లకు ఉపయోగించలేం. ఒక్కటే పాట మిగిలిపోయింది మనకి. ఆ పాట పీబీ శ్రీనివా్‌సకు ఇస్తామన్నాం కదా’ అన్నారు. ‘శ్రీనివా్‌సగారిని నేను బతిమాల్తాను బాబాయ్‌. ఈ కుర్రాడికి అవకాశం ఇద్దాం’ అని కోదండపాణి ఏదో చెప్పబోతే.. ‘ఎందుకురా ఇప్పడవన్నీ, నెక్స్ట్‌ పిక్చర్‌లో ఇద్దాంలే’ అని ఆయనతో అని, బాలు వైపు తిరిగి ‘నువ్వు బాగా చదువుకో నాయనా’ అని వెళ్లిపోయారు భావనారాయణ. బాలు అక్కణ్నుంచీ వెళ్లిపోతానంటే.. కోదండపాణి ఆపి, ‘నేను ఇంకో రెండు, మూడు సినిమాలు చేస్తున్నా, ఫలానా రోజున వచ్చి నన్ను కలువు’ అని చెప్పారు. కానీ, బాలు ఆయన్ను ఆరోజున కలవలేదు. అప్పుడే కాదు.. ఆ తర్వాత సంవత్సరన్నర పాటు ఆయన దగ్గరకు వెళ్లలేదు. బాలు కలవకపోయినా.. ఆయన మాత్రం బాలును మర్చిపోలేదు. సంవత్సరన్నరపాటు బాలు కోసం వెతికారు. చివరికి ఆచూకీ తెలుసుకుని.. ఇంజనీరింగ్‌ కాలేజీలో క్లాసులో ఉన్న బాలును బయటకు పిలిపించి, నేరుగా నటుడు పద్మనాభం దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేశారు. ఆ తర్వాత నాలుగు దశాబ్దాలకు పైగా సినీ సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన ఒక గంధర్వ గాయకుడిని సినీ పరిశ్రమ అక్కున చేర్చుకున్న క్షణమది! పద్మనాభం నిర్మాతగా, హీరోగా తీసిన ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’ చిత్రంలో తొలిసారి ‘బాలు’డి స్వరం ‘‘ఏమి ఈ వింత మోహం’’ అంటూ వెండితెరకు కొత్త మధురిమలు అద్దింది. బాలు పాటకు తెరపై అభినయించింది.. అందాలనటుడు శోభన్‌ బాబు. తొలి రికార్డింగ్‌లోనే.. సుశీల, పీబీ శ్రీనివాస్‌, ఈలపాట రఘురామయ్య వంటివారితో కలిసి పాడే అదృష్టం బాలుకు లభించింది. 1966 డిసెంబరు 15న ఈ తొలి రికార్డింగ్‌ జరిగింది. అంటే బాలు.. 50 ఇయర్స్‌ ఇండస్ట్రీ!!

చాన్స్‌ వచ్చినా..

శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్నలో చాన్స్‌ వచ్చినా.. సినిమాల్లో గాయకుడిగా స్థిరపడదామన్న ఆలోచనేదీ బాలుకు లేదు. ఘంటసాల, పీబీ శ్రీనివాస్‌, పిఠాపురం, మాధవపెద్ది వంటి హేమాహేమీలున్న సినీ రంగంలో తనకేం అవకాశాలు వస్తాయనే ఆయన అనుకున్నారు. ‘ఏదో వెండితెర మీద పేరు చూసుకున్నట్టు ఉంటుంది’ అని నాలుగైదు పాటలు పాడి వెళ్లిపోదామనుకున్నారు. కానీ, విధి ప్లాన్‌ వేరేలా ఉంది. కోదండపాణి బాలును గాయకుడిగా పరిచయం చేయడమే కాక.. తనకు సహాయకుడిగా ఉండాలని అడిగారు. ‘నాకు సంగీతం రాదు’ అని చెప్పినా వినిపించుకోలేదు. ‘సంగీతం రాదు కాబట్టే అసిస్టెంట్‌ అన్నాను. నువ్వు ఇక్కడికొచ్చి నేర్చుకోవచ్చు’ అని పట్టుబట్టి తనదగ్గర చేర్చుకున్నారు. అలా నెలకొకపాట.. రెండు పాటలతో మొదలై ఒకదశలో కాలేజీకి వెళ్లడానికి ఇబ్బందిగా మారింది. తండ్రి దగ్గరకు వెళ్లి సలహా అడిగితే.. ‘నువ్వు ఏం చేయదల్చుకున్నా.. జోడు గుర్రాల స్వారీ మాత్రం చేయకు. కావాలంటే చదువుపై శ్రద్ధ పెట్టి సినిమాలను వదిలెయ్‌. లేదా దీనిపై (సినిమాలపై) ఇష్టం ఉంటే చదువును పక్కనపెట్టు’ అని నిర్ణయాన్ని బాలుకే వదిలేశారు. బాలు సంగీతాన్నే ఎంచుకున్నారు. ఆ తర్వాతంతా చరిత్రే.


తొలిపాట అదే అయినా..

సినిమాల్లో బాలు పాడిన తొలి పాట శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్నలోని ‘ఏమి ఈ వింత మోహం’ అయినా.. విడుదలైన సినిమా మాత్రం ‘కాలచక్రం’. ఎంజీఆర్‌ సినిమాను తెలుగులోకి ఆ పేరుతో డబ్‌ చేసిన ఎమ్మెస్‌ రెడ్డి బాలుతో అన్ని పాటలూ పాడించారు. అంటే బాలు పాటతో విడుదలైన తొలి సినిమాలో అన్ని పాటలూ ఆయనవే కావడం విశేషం. 1967 మొదట్లో కాలచక్రం విడుదల కాగా.. రెండు నెలల తర్వాత శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న విడుదలైంది.


ఘంటసాల పాడాల్సిన పాట అది

కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో శోభన్‌బాబు, వాణిశ్రీ జంటగా నటించిన ‘చెల్లెలి కాపురం’ చిత్రంలో ‘చరణకింకిణులు ఘల్లుఘల్లుమన... కరకంకణములు గలగలలాడగ’’ అంటూ డాక్టర్‌ నారాయణరెడ్డి రాసిన పాట ఉంది. ఈ సినిమాలో శోభన్‌బాబు కవి. సినిమాలోని చివరి సన్నివేశంలో తన ప్రతాపాన్ని ప్రదర్శించే సందర్భగీతమది. నారాయణరెడ్డి తన కలానికి మరింత పదును పెట్టి ఆ పాట రాశారు. సంగీత దర్శకుడు మహదేవన్‌ అద్భుతంగా స్వరపరిచారు. కఠినమైన పదాలను ఉచ్చరిస్తూ గుక్కతిప్పుకోకుండా ఆ పాట పాడాలి. ఏ గాయకుడికైనా ఆ పాట ఒక ఛాలెంజే. వాస్తవానికి ఘంటసాల పాడాల్సిన పాట అది. కానీ అనారోగ్యం కారణంగా ఆయన పాడలేకపోయారు. ఎదుగుతున్న గాయకుడు బాలుకు ఆ అవకాశం వచ్చింది. ఒకరకంగా అది ఆయన ప్రతిభకు అగ్నిపరీక్షే. ఆ పరీక్షలో నెగ్గి ఆయన అందరిచేతా ‘శభాష్‌’ అనిపించుకొన్నారు బాలు. తెలుగు సినిమా గీతాల్లో ఓ ఆణిముత్యంలా ‘ ఆడవే మయూరి నటనమాడవే మయూరీ’ నిలిచింది.


స్థాయి పెంచిన ‘శంకరాభరణం’

పాశ్చాత్య సంగీత ప్రభావానికి తట్టుకోలేక శాస్త్రీయ సంగీతం తన ఉనికిని కోల్పోతున్న తరుణంలో విడుదలైన ‘శంకరాభరణం’ చిత్రం శాస్త్రీయ సంగీతపు మధురిమల్ని చవి చూపించింది. ఆ సినిమాలోని పాటల ప్రభావంతో ఎంతోమంది యువతీయువకులు సంగీతం నేర్చుకోవడం ప్రారంభించారంటే అతిశయోక్తి కాదు. బాలు అంతవరకూ పాడిన పాటలన్నీ ఒక ఎత్తయితే ‘శంకరాభరణం’ సినిమాలోని పాటలు మరో ఎత్తు. శాస్త్రీయ సంగీతం కథాంశంతో తీసే ఈ చిత్రంలోని పాటలు బాలు పాడుతున్నారని తెలియగానే విమర్శలు వెల్లువెత్తాయి. ‘సంగీతం నేర్చుకోని బాలు ఇందులో పాడుతున్నాడా.. ఇక ఆ సినిమా ఆడినట్లే ’ అన్న వాళ్లు ఎంతమందో! నిజం చెప్పాలంటే ‘శంకరాభరణం’ చిత్రంలో పాటలు పాడడానికి బాలు కూడా వెనకడుగు వేశారు. ‘నా వల్ల కాదు.. సంగీతం తెలిసిన వారితో పాటలు పాడించండి’ అని ఆయన తప్పుకోవాలని చూశారు కానీ మహదేవన్‌ అసిస్టెంట్‌ పుహళేంది వదిలిపెట్టలేదు. దర్శకుడు కె.విశ్వనాథ్‌ కూడా బాలూనే పాడాలని పట్టుబట్టారు. దాంతో బాలు ప్రతి పాటనూ ఎంతో సాధన చేసి పాడారు. ఆ పాటలు విన్నాక.. విమర్శించినవాళ్ల నోళ్లు మూతపడ్డాయి. ‘శంకరాభరణం’ పాటలతో గాయకుడిగా బాలు స్థాయి పెరిగింది. సంగీతాభిమానుల్లో గౌరవం పెరిగింది.


జానకి జోస్యం

నెల్లూరు జిల్లా గూడూరులోని కాళిదాస కళానికేతనం సంస్థ నిర్వహించిన పాటల పోటీల్లో బాలసుబ్రమణ్యం పాడారు. ఆ పోటీకి జడ్జిగా వ్యవహరించడానికి వచ్చిన ఎస్‌.జానకి.. ‘నువ్వెందుకు సినిమాల్లో ప్రయత్నించకూడదు?’ అన్నారు. అప్పటికి బాలు వయసు 17-18 ఏళ్లు. దానికి బాలు.. ‘నాకేమీ రాదండీ సంగీతం, ఘంటసాల మాస్టారు పాడిన పాటలు పాడుతున్నానంతే’ అని చెప్పారు. అప్పుడావిడ.. ‘నాకూ సంగీతం రాదయ్యా, నేను పాడట్లేదా సినిమాలో’ అన్నారు. అంతేకాదు.. ‘నిజంగా నేను సంగీతం నేర్చుకోలేదు బాలసుబ్రమణ్యం. నీ గాత్రంలో ఏదో ప్రత్యేకత ఉంది. నీకంటూ ఒక బాణీ కనపడుతోంది. నీ గాత్రాన్ని సిన్సియర్‌గా సంగీతానికి మల్చుకోగలిగితే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది’ అన్నారు. ‘సంగీతం మనకు అన్నం పెడుతుంది’ అనే ఆలోచన ఎస్పీబీ మనసులో రావడానికి కారణం నాడు జానకి ఇచ్చిన ప్రోత్సాహమే.


ఆఖరు క్షణంలో మార్చేశారు!

‘ఎన్నాళ్లో వేచిన ఉదయం.. ఈనాడే ఎదురవుతుంటే..’ (మంచి మిత్రులు) పాట గుర్తుందా? ఆ పాటలో మొదట అనుకున్నదాని ప్రకారం.. కృష్ణకు బాలు పాడాలి, శోభన్‌బాబుకు ఘంటసాల పాడాలి. ఇద్దరూ ఎవరి వెర్షన్‌ను వారు సాధన చేశారు. తీరా రికార్డింగ్‌ థియేటర్‌కు వెళ్లేసరికి.. ‘‘ఈ సినిమాలో శోభన్‌బాబుకు నువ్వే పాటలు పాడావు కాబట్టి, ఈ పాటలో కూడా శోభన్‌బాబుకు నువ్వే పాడు. ఘంటసాల మాస్టారు కృష్ణకు పాడతారు’’ అని కోదండపాణి చెప్పారు. బాలు వెళ్లి ఘంటసాలతో ఆ విషయం చెప్తే.. ఆయన సరేనన్నారు. అలా ఆఖరు క్షణంలో మార్పు జరిగినా ఆ పాట ఎంత అద్భుతంగా వచ్చిందో అందరికీ తెలిసిందే.


ఇంజనీర్‌ కావాలనుకుని..

బాలు తన తండ్రి కోరిక మేరకు ఇంజనీరింగ్‌ చదవాలనుకున్నారు. తండ్రి కలనే తన కలగా భావించి అందులో చేరారు కూడా. అందులోనూ తనకు సంగీతం రాదు కాబట్టి సినిమాల్లో పాడడాన్ని వృత్తిగా మలచుకోవాలని ఆయన అనుకోలేదు. అయినా గాయకుడు కావడం విధి లీలే అంటారాయన. ‘‘నాకు సంగీతం రాదు. ఎవ్వరూ నమ్మరు ఈ నాటికీ. ఏ గురుముఖతా నేను వెళ్లి నేర్చుకోలేదు. నా చిన్నప్పుడు నేను కలలు కన్నది ఇంజనీర్‌ కావాలని. ఇంజనీరై గవర్నమెంట్‌ ఉద్యోగం చేసి జీపులో వెళ్తూ.. ఆ రోజుల్లో 250 రూపాయల జీతం సంపాదించాలని కోరిక. కానీ, విధి వేరుగా ఉంది. పాడటం కోసమే భగవంతుడు నాకీ జీవితాన్నిచ్చాడేమో. నేను వచ్చినప్పుడు ఘంటశాల, మాధవపెద్ది సత్యం, పిఠాపురం, పీబీ శ్రీనివాస్‌గారు, నాకంటే నాలుగేళ్ల ముందు పరిచయమైన ఏసుదాసు.. ఇలా చాలామంది హేమాహేమీ లున్నారు. అంతమంది ఉన్నప్పుడు చాలా మామూలుగా పాడే నాకు అన్ని అవకాశాలు ఇవ్వవలసిన అవసరం పరిశ్రమకు లేదు. వాళ్లందరికంటే నేను గొప్పగా ఊడబొడిచినవాణ్ని కాను. లేత గొంతుక, చిన్నవాణ్ని కాబట్టి నాకు అవకాశాలిచ్చారేమో. పరిశ్రమ నా తప్పుల్ని భరించిందో, క్షమించిందో.. అని ఆలోచిస్తే.. విధి అనిపిస్తుంది. అంతకంటే వేరే ఏం లేదు.’’ అని చెప్పేవారు.

ఇద్దరినీ పాడించిన ఘనత

సంగీత దర్శకులు ఎమ్మెస్‌ విశ్వనాథన్‌, ఇళయరాజా స్వరపరిచిన పలు గీతాలను ఎస్పీబీ ఆలపించారు. అవి ఆయనకు ఎంతో పేరు తీసుకొచ్చాయి. అయితే, వాళ్లిద్దరి చేతా ఓ పాట పాడించిన ఘనత మాత్రం ఎస్పీబీదే. తన కుమారుడు చరణ్‌ నిర్మించిన తమిళ చిత్రం ‘ఉన్నై శరణడైన్దేన్‌’ (2003)లో తాను స్వరపరిచిన ‘పానక్కు నిలమూడు’ పాటను ఆ దిగ్గజ సంగీత దర్శకుల చేత ఆయన పాడించారు. వారితోనే కాదు.. మరికొందరు ప్రముఖులతో కూడా బాలు పాడించారు. ఉదాహరణకు.. ‘కొంగుముడి’లో ‘రాదా మళ్లీ వసంతకాలం’ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు రమేశ్‌ నాయుడి చేత, తమిళ చిత్రం ‘శిగరం’ టైటిల్‌ సాంగ్‌ను జె.ఏసుదాసుతో, అందులో మరో పాటను మంగళంపల్లి బాలమురళీ కృష్ణతో, ‘కళ్లు’ చిత్రంలో ‘తెల్లారింది లెగండోయ్‌...’ పాటను రచయిత ‘సిరివెన్నెల’తో పాడించారు. అన్నిటికంటే ముఖ్యమైనది కన్నడ చిత్రం ‘ముద్దినమావ’లో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌తో పాడించడం. ఆ సినిమాలో రాజ్‌కుమార్‌ గాత్రానికి బాలు తెరపైన నటించారు కూడా.

Advertisement
Advertisement
Advertisement