Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్వచ్ఛ భారత్‌ నిధులు స్వాహా!

- కార్మికులకు వేతనాల పేరుతో పక్కదారి

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

కేంద్ర ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో ప్రారంభించిన స్వచ్ఛభారత్‌ పథకం నిధులు దారి మళ్లుతున్నాయి. గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య పనులు చేపట్టే కార్మికులకు వేతనాల పేరిట ఈ నిధులు దుర్వినియోగమవుతున్నాయని ఆరోపణలున్నాయి. జిల్లాలో 1190 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో సుమారు 560 పంచాయతీల్లో గత ప్రభుత్వ హయాంలో గ్రీన్‌ అంబాసిడర్ల పేరుతో తాత్కాలిక ప్రాతిపదికన ముగ్గురు లేదా నలుగురు చొప్పున పారిశుధ్య కార్మికులను నియమించారు. నెలకు ఒక్కో కార్మికుడికి రూ.6 వేల వంతున గౌరవ వేతనం అందించాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీలకు విడుదలయ్యే స్వచ్ఛభారత్‌ నిధుల నుంచి ఈ వేతనాలు చెల్లించారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల తరువాత పంచాయతీల్లో గ్రీన్‌ అంబాసిడర్ల వ్యవస్థ దాదాపు కనుమరుగైంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పారిశుధ్య కార్మికుల వేతనాలు నిలిచిపోయాయి. ఇటీవల గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తయ్యాయి. కొత్త సర్పంచ్‌లు నిధుల లేమితో పారిశుధ్య పనులు చేపట్టలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇంతలో జిల్లాకు కేంద్రప్రభుత్వం ఇటీవల స్వచ్ఛభారత్‌ నిధులు విడుదల చేసింది. ప్రతి పంచాయతీకి దాదాపు రూ.2 లక్షల నుంచి పెద్ద పంచాయతీలైతే రూ.10 లక్షలు వరకు నిధుల కేటాయించింది. పంచాయతీలకు స్వచ్ఛ భారత్‌ నిధులు రాగానే కొందరు సర్పంచ్‌లు పారిశుధ్య కార్మికుల వేతనాల చెల్లింపులపై దృష్టి పెట్టారు. కొన్ని పంచాయతీల్లో అసలు లేనివారి పేరుతో కూడా గ్రీన్‌ అంబాసిడర్లకు నెలకు రూ.6 వేలు వేతనం చెల్లిస్తున్నట్లు ఆరు నెలలకు సంబంధించిన నిధులు డ్రా చేశారని సమాచారం. స్వచ్ఛభారత్‌  నిధుల నుంచి ఖర్చు చేసే వెసులుబాటు ఉండడంతో చాలా పంచాయతీల్లో కార్మికులకు తెలియకుండానే వేతనాల చెల్లింపుల పేరుతో నిధులు డ్రా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో సర్పంచులు, కార్యదర్శులు ఏకమైనట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.


- ఒక నెల జీతంతో సరి...

పాలకొండ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని కొన్ని పంచాయతీల్లో సర్పంచులు కార్మికుల వేతనం కింద రూ.36వేల వంతున డ్రాచేసి, ఒక్క నెల వేతనమే వారికి చెల్లించినట్టు సమాచారం. మిగిలిన మొత్తాన్ని స్వాహా చేసినట్టు తెలిసింది. జిల్లాలో అనేక పంచాయతీల్లో ఇలా నిధులు పక్కదారి పట్టాయని తెలుస్తోంది. వాస్తవానికి కార్మికుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు వేతనాలు జమ చేయాలి. కానీ సర్పంచులు, కార్యదర్శులు చెక్‌ పవర్‌ ఉండడంతో వారే నిధులు బ్యాంకుల్లో డ్రా చేసి, వారికి నచ్చినంత గ్రీన్‌ అంబాసిడర్‌లకు వేతనాలు చెల్లించి మిగిలింది కాజేస్తున్నారు. కొందరు గ్రీన్‌ అంబాసిడర్లు బకాయిల విషయాన్ని కొత్త సర్పంచ్‌లను అడిగినా ఫలితం లేదని సమాచారం. పాలకొండ మండలంలో ఎక్కువగా నిధుల దుర్వినియోగమైనట్టు కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. ఎవరైనా తాము గతంలో చేసిన పనికి వేతనాల సంగతేంటని ప్రశ్నిస్తే,  ఈనెల నుంచి పని చేయండి. ఇకపై వేతనాలు చెల్లిస్తామంటూ పాత వేతనాల సొమ్ము పక్కదారి పట్టించినట్లు తెలిసింది. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్‌ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. ఎక్కడైనా అవినీతి చోటుచేసుకున్నట్టు ఫిర్యాదు అందితే విచారణ చేపడతామని తెలిపారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.  

Advertisement
Advertisement