Abn logo
Mar 26 2020 @ 03:31AM

విధి నిర్వహణలో నిర్లక్ష్యం

నలుగురిపై సస్పెన్షన్‌ వేటు

ఒంగోలు (కలెక్టరేట్‌), మార్చి 25: రాష్ట్రంలో కరోనా వైరస్‌ నేపథ్యంలో ఎమర్జెన్సీ అమలులో ఉన్నా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఒక జిల్లా అధికారి, వైద్యాధికారి, మరో ఇద్దరు ఉద్యోగులను ప్రకాశం జిల్లా కలెక్టర్‌ పోలా భాస్కర్‌ సస్పెండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం కృషి చేస్తున్న తరుణంలో విధులకు గైర్హాజరు కావడంపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారిక అనుమతులు లేకుండా ఒంగోలు విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లిన జిల్లా సోషల్‌ ఫారెస్టు అధికారి కె.మహబూబ్‌ బాషాను సస్పెండ్‌ చేశారు. మార్కాపురం ఏరియా వైద్యశాలలో వైద్యాధికారిగా పనిచేస్తున్న డాక్టర్‌ ఎస్‌.హరి (జనరల్‌ మెడిసిన్‌) విధులకు గైర్హాజరు కావడంతో ఆయనపై కూడా సస్పెన్షన్‌ వేటు వేశారు. ఎమర్జెన్సీలో వైద్యం అందించాల్సిన డాక్టర్‌ ప్రభుత్వ ఉత్తర్వులు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఒంగోలులోని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో విధులకు గైర్హాజరైన సీనియర్‌ అసిస్టెంట్‌ బి.ప్రసన్నకుమార్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌ పి. వెంకట్రావును కూడా సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
Advertisement
Advertisement