Abn logo
Oct 5 2020 @ 04:38AM

పూటగడిచేదెట్లా...?

Kaakateeya

ఉపాధి కోల్పోయి ఇల్లు గడవక ప్రైవేట్‌ టీచర్ల ఇక్కట్లు

దయనీయంగా మారిన బతుకులు  

కరోనా ప్రభావంతో జీతాలు ఇవ్వని ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలు

వ్యవసాయ పనులు, కూలీలుగా టీచర్లు 

కొన్ని ప్రైవేట్‌ స్కూళ్లలో కొనసాగుతున్న ఆన్‌లైన్‌ క్లాసులు

ఆన్‌లైన్‌ క్లాసుల్లో కొందరికే డ్యూటీ 

వారికే సగం జీతం.. అదీ ఫీజులు వసూలు చేస్తేనే..!

‘‘తాళిబొట్టు తాకట్టు పెట్టి..టీ కొట్టు పెట్టుకున్న ప్రైవేట్‌ ఉపాధ్యాయుడు


ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు పాపారావు. సొంతూరు నల్గొండ జిల్లా. 30ఏళ్ల క్రితమే ఉపాధి కోసం మేడ్చల్‌ జిల్లా భరత్‌నగర్‌కు వచ్చాడు. 25 ఏళ్ల నుంచి స్థానికంగా ఓ ప్రైవేట్‌ స్కూల్లో పీఈటీగా పనిచేస్తున్నాడు. నెలకు 18వేల జీతం. కరోనా మహమ్మారితో స్కూల్‌ మూత పడింది. దీంతో అతను రోడ్డున పడ్డాడు. కుటుంబ పోషణ భారంగా మారింది.


నెలలుగా ఇంటి అద్దె కట్టలేని పరిస్థితి. భార్య ఆరోగ్యం బాగా లేదు. ఆమె ఇంట్లోనే ఉంటుంది. అతనికి ఒక పాప 8వ తరగతి చదువుతోంది. ప్రైవేట్‌ అప్పులు కుప్పలయ్యాయి. కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర కరువైంది. ఏమి చేయాలో తెలియక చివరకు భార్య మెడలోని తాళిబొట్టు కుదువబెట్టి రూ.30 వేలు అప్పు తీసుకున్నాడు. టీ కొట్టు పెట్టుకుని జీవన సాగిస్తున్నాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నాడు.‘‘


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) :  ఓడలు బండ్లు... బండ్లు ఓడలు అవుతాయంటే.. ఇదేనేమో...! కరోనా వచ్చి అన్నిరంగాలను కుదిపేసింది. కరోనా ఎఫెక్ట్‌తో 8నెలలుగా జీతాలు రాక ప్రైవేట్‌ స్కూల్‌ ఉపాధ్యాయులు కడుపులు మాడ్చుకుంటున్నారు. కన్న బిడ్డలకు నాలుగు మెతుకులు పెట్టలేని దుస్థితిని తలచుకుని గోస పడుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఎవరన్నా పనికి పిలుస్తారేమోనని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేట్‌ స్కూళ్ల ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది. కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో 8నెలలుగా విద్యాలయాలు మూసి ఉండటంతో జీతాలు రాని పరిస్థితి నెలకొంది. యాజమాన్యాలు కూడా జీతాలు ఇవ్వలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాయి. దీంతో ఇన్నాళ్లు బడుల్లో పాఠాలు చెప్పిన టీచర్లు... ప్రస్తుతం వ్యవసాయ కూలీలుగా దర్శనమిస్తున్నారు. పనిలేక ఉపాధి పనులకు వెళ్తున్నారు. మెడికల్‌, కిరాణషాపుల్లో పనిచేస్తున్నారు. కొందరు ఆటోలు నడిపిస్తున్నారు. చివరకు వాటర్‌ ప్లాంట్లలో నీటి డబ్బాలు మోస్తున్నారు. బట్టల దుకాణాలు, హోటళ్లలో పనిచేస్తున్నారు. కొంతమంది మహిళలు ఇంటివద్దే స్టిచ్చింగ్‌ చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్నారు. చాలావరకు ఇతర పనులు చేసుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఇటు ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలు కూడా పట్టించుకోవడం లేదు. మరోవైపు అద్దె భవనాల్లో స్కూళ్లను నడిపిస్తున్న వారు నెలవారీ రెంట్‌ కట్టడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్లపాటు వారి సేవలను వాడుకున్న మేనేజ్‌మెంట్లు కష్టకాలంలో వారివైపు కన్నెత్తి చూడటం లేదు. 


ప్రస్తుతం ఆన్‌లైన్‌ తరగతులు జరుగుతున్నాయి. ప్రభుత్వ పాఠ శాలల కంటే ముందే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్‌ పాఠశాలలు ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించాయి. జూమ్‌యాప్‌ ద్వారా ప్రైవేట్‌ స్కూళ్ల టీచర్లు విద్యార్థులకు క్లాసులు చెబుతున్నారు. సుమారు 40 నిమిషాల పాటు తరగతులకు ఒక్కో క్లాసుకు రూ.50 నుంచి రూ.100  వరకు యాజమాన్యాలు చెల్లిస్తున్నారు. అయితే కార్పొరేట్‌ స్కూళ్లు మాత్రమే ఈవిధంగా టీచర్లకు ఎంతోకొంత జీతం ఇవ్వగలుగుతు న్నాయి. ఫీజులు కట్టించేలా తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. ఫీజులు లక్ష్యంలో ముందున్న టీచర్లకు సగం జీతం చెల్లిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సుమారు 4 వేలకు పై చిలుకు ప్రైవేట్‌ స్కూళ్లు ఉన్నాయి. 60వేల మంది వరకు ప్రైవేట్‌ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం 5శాతం మంది మాత్రమే సగం జీతానికి పనిచేస్తున్నారు. మిగతా వారంతా రోడ్డున పడ్డారు. కరోనా కారణంగా కొన్ని స్కూళ్లు ఆన్‌లైన్‌ క్లాసులు మొదలు పెట్టలేని పరిస్థితి ఉంది. ఆన్‌లైన్‌ క్లాసులు చెప్పే టీచర్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉంది. 


ఇబ్బందుల్లో..నాన్‌టీచింగ్‌ సిబ్బంది

ప్రతి స్కూల్లో స్వీపర్లు, అటెండర్లు, ఆయాలు, బస్‌డ్రైవర్లు, క్లీనర్లతోపాటు ఆఫీస్‌స్టాఫ్‌ కూడా ఉంటారు. ఆన్‌లైన్‌ క్లాసులు స్టార్ట్‌ అయినప్పటి నుంచి కేవలం ఒక స్వీపర్‌, ఒకరిద్దరు ఆఫీస్‌ స్టాఫ్‌తోనే స్కూళ్లను కొనసాగిస్తున్నారు. మిగతావారి పరిస్థితి దయనీయంగా తయారైంది. ఆరు నెలలుగా జీతాలు రాక అష్టకష్టాలు పడుతున్నారు. కూలీ పనులు చేసుకుంటూ కష్టంగా బతుకులను నెట్టుకొస్తున్నారు. 


ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్తాం..

ప్రైవేట్‌టీచర్ల సమస్యలను పరిష్క రించాలని కోరుతూ ప్రభుత్వానికి ఇప్పటివరకు పలుమార్లు వినతులు చేసినా పట్టించుకోలేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఓడించేందుకు కంకణం కట్టుకున్నాం. ప్రైవేట్‌ ఉపాధ్యాయుడిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో దింపుతాం. నిరుద్యోగ యువకులంతా మద్దతుగా ఉన్నారు. పెద్దపెద్ద చదువులు చదివి నేడు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక నానాఇబ్బందులు పడుతున్నారు. కరోనాతో ప్రైవేట్‌ టీచర్లకు పనిలేక పస్తులుంటున్నారు. లాక్‌డౌన్‌  సమయానికి సంబంధించి జీవో 45,(1897చట్టం) ప్రకారం ఉపాధ్యాయు లకు యాజమాన్యాలు పూర్తి వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పో యిన ప్రైవేట్‌ టీచర్ల కుటుంబానికి ప్రభుత్వం నెలకు రూ. 10వేలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకోవాలి. ప్రైవేట్‌ పాఠశాలల్లో జీవో నెంబరు1,1994ను అమలు చేయాలి. ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు  ప్రభుత్వం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. 

- షేక్‌ షబ్బీర్‌ అలీ, తెలంగాణ ప్రైవేట్‌ టీచర్స్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు

Advertisement
Advertisement