Abn logo
Jul 15 2020 @ 00:15AM

మిగులని సాక్ష్యం

ఎనుక ఏడు తరాలు 

ముందట మూడు తరాలకు

అక్షరం అంచు తెలువని

తరాల తంతెల నుంచి 

గూగుల్ గూడ గుర్తు ఎరుగని, 

ఎర్ర బస్సుకి కుడా ఎరుక లేని,

రోడ్డు లేని బోడ పల్లె నుంచి,

అంబేడ్కర్ అంశగా

తెలంగాణ మాదిగ మట్టి నల్లంచిని

ఆఫీశ్వరమ్మగా దీవించి జీవితాన్ని, 

జీతాన్నిచ్చిన సచివాలయం.


ఉమ్మడి ఏపీలో 

శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా,

జిందగీల మరువని జిగిరి దొస్తానాలను

మస్తు మస్తుగా ఇచ్చిన సచివాలయం.

మహిళా ఉద్యోగులకు సందు బెట్టని

మగ సంఘాల్లో దూరి, పోరి

మీసాల బాసులని

ఓటింగుతో ఓడించిన

మొదటి ఉద్యోగి నాయకురాలిగా నన్ను

సంబురంగా వూరేగించిన సచివాలయం.


ఉద్యమకారిణిగా, రచయిత్రిగా,

ఉద్యోగ, మహిళ, సాహిత్య,

కళాసాంస్కృతిక సంస్థలకు

వ్యవస్థాపనలు చేసే

దమ్ము, ధైర్యమిచ్చిన సచివాలయం.

ఇప్పుడు సచివాలయం సచ్చినాలయం

నా జీవిత ఆనవాల్లకు సమాధి కూడా మిగులని సాక్ష్యం

జూపాక సుభద్ర

Advertisement
Advertisement
Advertisement