Abn logo
Nov 30 2020 @ 19:44PM

బంతి పట్టేందుకు సిద్ధమైన శ్రీశాంత్.. రైనా శుభాకాంక్షలు

కేరళ: సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ బంతి పట్టబోతున్న టీమిండియా ఆటగాడు శ్రీశాంత్‌కు మాజీ క్రికెటర్ సురేశ్ రైనా శుభాకాంక్షలు తెలిపాడు. 37 ఏళ్ల శ్రీశాంత్.. కేరళ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ప్రెసిడెంట్స్ కప్ టీ20 టోర్నమెంటులో ఆడబోతున్నాడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సోమవారం శ్రీశాంత్ ఓ ట్వీట్ చేశాడు. తన చేతులను మళ్లీ తిప్పే అవకాశం వచ్చిందని, తాను ఎంతగానో ఇష్టపడే క్రికెట్‌లో అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి కృషి చేస్తానని పేర్కొన్నాడు.  


శ్రీశాంత్ ట్వీట్‌కు అతడి మాజీ సహచరుడు సురేశ్ రైనా ‘‘గుడ్ లక్ మై బ్రదర్’’ అని బదులిస్తూ శుభాకాంక్షలు తెలిపాడు. 2013లో ఐపీఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ కేసులో చిక్కుకుని శ్రీశాంత్ క్రికెట్‌కు దూరమయ్యాడు. అతడితోపాటు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడిన అతడి సహచరులు అజిత్ చండేలా, అంకిత్ చవాన్‌లు కూడా నిషేధానికి గురయ్యారు.


శ్రీశాంత్‌పై విధించిన నిషేధాన్ని గతేడాది ఏడేళ్లకు కుదించగా, ఈ ఏడాది సెప్టెంబరుతో అది ముగిసింది. కాగా, ప్రిసెడెంట్స్ కప్ టీ20 టోర్నీ వచ్చే నెల 17న ప్రారంభం కానుంది. కేసీఏ రాయల్స్, కేసీఏ టైగర్స్, కేసీఏ టస్కర్స్, కేసీఏ ఈగల్స్, కేసీఏ పాంథర్స్, కేసీఏ లయన్స్ జట్లు పోటీపడనున్నాయి.  

Advertisement
Advertisement
Advertisement