Abn logo
Sep 21 2021 @ 11:32AM

సుప్రీంకోర్టులో మాజీ మంత్రికి ఊరట

                 - అక్రమాస్తుల కేసు విచారణకు బ్రేక్‌


అడయార్‌(చెన్నై): అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన అక్రమాస్తుల సంపాదన కేసు విచారణకు అనుమతి ఇస్తూ మద్రాస్‌ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలకు సర్వోన్నత న్యాయస్థానం తాత్కాలికంగా నిలుపుదల చేసింది. రాజేంద్ర బాలాజీ రూ.7 కోట్ల అక్రమాలకు పాల్పడినట్టు మదురై జిల్లాకు చెందిన మహేంద్రన్‌ అనే వ్యక్తి మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అయితే, ఈ ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరుగా తీర్పులిచ్చారు. దీంతో మూడో న్యాయమూర్తికి హైకోర్టు సిఫార్సు చేసింది. అయితే, ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన భిన్నమైన తీర్పుల నేపథ్యంలో ఈ కేసును మూడో న్యాయమూర్తికి బదిలీ చేయడాన్ని వ్యతిరేకిస్తూ రాజేంద్ర బాలాజీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో హైకోర్టు విచారణపై స్టే విధించాలని కోరుతూ గత యేడాది ఆగస్టు 16వ తేదీన సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. నాలుగేళ్ళ కిత్రం ముగిసిపోయిన కేసును హైకోర్టు విచారణ చేపట్టడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని, ఈ కేసును మూడో న్యాయమూర్తి విచారణకు సిఫార్సు చేయడం అర్థరహితమని అందులో పేర్కొన్నారు. అందువల్ల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. హైకోర్టు విచారణను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.