Abn logo
Oct 14 2021 @ 22:33PM

రైతులకు ఎన్ఆర్ఐల చేయూత, ఎన్నారై 'శశికాంత్ వల్లేపల్లి' సహకారం

నల్గొండ జిల్లాలోని కట్టంగూర్ మండలంలో రైతులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారంతా ఉమ్మడిగా ఒక FPO ఏర్పాటు చేసుకొని ఎరువులు, వ్యవసాయానికి అవసరమయ్యే వివిధ పరికరాలు ఉమ్మడిగా కొనడం, ఉత్పాదకత పెంచుకునేందుకు అవసరమయ్యే టెక్నాలజీని తెలుసుకోవడం, తమ ఉత్పత్తులను అమ్ముకునేందుకు చేస్తున్న సమిష్టి ప్రయత్నం వినూత్నంగా ఉంది. దీనికి ఎన్నారై ‘శశికాంత్ వల్లేపల్లి’ స్వేచ్ఛ సంస్థలు సహకరిస్తున్నాయి.

ప్రకృతి వైపరీత్యాలు, నీటి-విద్యుత్ కొరత, వ్యవసాయానికి కావల్సిన ఎరువులు రసాయనాల అధిక ధరల రైతులను పీడిస్తున్న సంగతి తెలిసిందే. వీరు ఈ సమస్యలను అధిగమించి పండించినా, ఉత్పత్తి చేసిన సరుకు దళారుల పాలు కావడం, రైతుకు నిమ్మకాయకి పావలా ఇస్తూ అంగడిలో మూడు రూపాయిలపైనే అమ్ముతున్న దుస్థితి. తరచుగా ఇలాగే ఉంది. ఒక నిమ్మ మాత్రమే కాదు, టమాటా, బత్తాయి, మిరప మొదలు అన్ని వ్యవసాయోత్పత్తుల పరిస్థితీ ఇంతే. నిమ్మ టమాటా రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితిని చూసి ఐటీ ఉద్యోగుల సంఘం ఫోరం ఆఫ్ ఐటి ప్రొఫెషనల్స్ , స్వేచ్ఛ సంస్థ సంయుక్తంగా రైతుల సరుకును నేరుగా రైతులు అమ్ముకునేందుకు వేదికను ఏర్పాటుచేశాయి. 

ఈ విషయం తెలుసుకున్న తానా ఫౌండేషన్ కార్యదర్శి ‘శశికాంత్ వల్లేపల్లి’ తన మిత్రుడు ‘రామ్‌ బొబ్బ’తో కలిసి రైతులకు రెండు వాహనాలను డొనేట్ చేశారు. రైతులకు రవాణా ఖర్చు తగ్గించుకోవటానికి ఇది తోడ్పడుతుంది. ఈ వాహనాలను లాంఛనంగా తెలంగాణ రాష్టృ విద్యుత్ శాఖ మంత్రి శ్రీ జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ‘వల్లేపల్లి శశికాంత్’, రాజ్య సభ సభ్యులు బి లింగయ్య యాదవ్, శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య, మాజీ శాసనసభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి , స్వేచ్ఛ చైర్మన్ కిరణ్ చంద్ర, ఫోరం ఆఫ్ ఐటి ప్రొఫెషనల్స్ (ఫోరిట్) ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ చంద్రహాస్, FPO డైరెక్టర్లు, 600 మంది పైన సభ్యులు, వందలాది రైతులు, ఐటి నిపుణులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వాహనాలతో పాటు, మినీ ట్రాక్టర్, నాటు వేసే మెషీన్‌లను, ఇతర అధునాతన పరికరాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ పలువురిని ఆకర్షించింది. ప్రయోగాత్మకంగా ఇక్కడ ఏర్పాటు చేయనున్న ఐఓటీ(IoT) ఆధారిత వ్యవసాయ ప్రయోగానికి సంబంధించిన ప్రయత్నాలను, నూతన ఆవిష్కరణల కోసం స్వేచ్ఛ చేస్తున్న కృషి, రైతుల ఆసక్తి వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట, ‘శశికాంత్ వల్లేపల్లి’ తన వంతుగా వారికి అండగా నిలవాలనుకున్నారు. ఎన్ఆర్ఐ మిత్రులు, తానా సంస్థ తోడ్పాటుతో స్వదేశంలో జరుగుతున్న ఈ మార్పులను ప్రోత్సహిస్తామని శశికాంత్ భరోసా ఇచ్చారు. రైతులు ముందుకొచ్చి మూడెకరాల భూమిని ఈ ప్రయోగానికి వినియోగించుకోవాలని కోరగా, ప్రయోగంగా ఈ మూడెకరాలలో పనిని ప్రారంభిస్తామని స్వేచ్ఛ చైర్మన్ కిరణ్ చంద్ర పేర్కొన్నారు. 

స్వేచ్ఛ ఫోరిట్ తలపెట్టిన ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే తానా తరపున దీనిని తెలుగు రాష్ట్రాలలోని అన్ని మండలాలకి విస్తరిస్తామని ‘శశికాంత్ వల్లేపల్లి’ హామీ ఇచ్చారు.ది ఒక మహత్తరమైన కార్యక్రమమని, దీక్షతో చేసినందునే ఇది సాధ్యమైందని, రైతులు మరింత బలపడాలంటే మల్టీ క్రాపింగ్‌వైపుగా కృషిని ప్రారంభించాలని మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆ వైపుగానే ప్రయత్నాలు చేస్తోందని, నాణ్యమైన పంటను అందుబాటులోకి తేవటానికి రైతులు కృషి చేయాలని మాజీ శాసన సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి పేర్కొన్నారు. దళారుల బారి నుండి రైతులు రక్షించుకోవడానికి చేస్తున్న ఈ ప్రయత్నం జయప్రదం కావాలని రాజ్యసభ సభ్యులు బి లింగయ్య ఆకాంక్షించారు. విజేత సూపర్ మార్కెట్ ఎండి జగన్మోహన్‌రావు, రైతుల వద్ద నుంచి తాము నేరుగా కొనుగోలు చేస్తామని, రైతు కుటుంబాల నుంచి వచ్చిన తనకు రైతు బాధలు తెలుసునని పేర్కొన్నారు.

తాజా వార్తలుమరిన్ని...