Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రాణాలు తీస్తున్న మూఢనమ్మకాలు

ఒడిశాను ఆనుకుని ఉన్న పల్లెల్లో అధికం

వ్యాధులు, దోషాల నివారణ పేరిట క్షుద్ర పూజలు

ఇతరులను ఇబ్బందులకు గురిచేసేందుకంటూ చెడుపు/చిల్లంగి

ఆగ్రహంతో బాధిత కుటుంబాలు దాడి

హత్యకు గురవుతున్న దిసారీలు

మన్యంలో తరచూ ఘటనలు 


పాడేరు, అనంతగిరి, డిసెంబరు 2: నిరక్షరాస్యత, వెనుకబాటుతనం, తరతరాలుగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాల కారణంగా ఏజెన్సీలో గిరిజనులపై మూఢనమ్మకాల ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా చిల్లంగి/చేతబడి/చెడుపు వంటి అనాచారాల వల్ల ఎంతోమంది గిరిజనులు ప్రాణాలు కోల్పోతున్నారు. మూఢనమ్మకాలపై ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నప్పటికీ మారుమూల గ్రామాల్లో...ముఖ్యంగా ఒడిశాను అనుకుని వున్న ప్రాంతంలో ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అనంతగిరి మండలం టోకూరు పంచాయతీ బగ్మారవలస గ్రామంలో చెడుపు చేస్తున్నారనే అనుమానంతో ఇరు కుటుంబాల మధ్య చెలరేగిన వివాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో మన్యంలో మూఢనమ్మకాలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. 


ఒడిశాను ఆనుకుని ఉన్న గ్రామాల్లో అధికం

ఒడిశా రాష్ట్రాన్ని ఆనుకుని వున్న గిరిజన ప్రాంతాల్లో మూఢనమ్మకాలను ఎక్కువగా పాటిస్తుంటారు. చిల్లంగి పూజలు, మంత్రాల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఒడిశాలో పలు గురువులు ఉన్నారు. మూఢనమ్మకాలను విశ్వసించేవారు ఒడిశా వెళ్లి అక్కడ దిసారీ (మూఢనమ్మకాలకు పూజలు చేసే గురువు)గా శిక్షణ పొందుతుంటారు. తరువాత సొంతూరులో అనారోగ్య సమస్యలు, వ్యాధులు, దోషాల నివారణ పేరిట క్షుద్ర పూజలు చేస్తుంటారు. ఇతరులను ఇబ్బందులకు గురి చేసేందుకంటూ చెడుపు వంటి వాటిని నిర్వహిస్తుంటారు. 


గ్రామాల్లో గురువులు!

కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా, ఇంటిలో పరిస్థితులు ఇబ్బందికరంగా వున్నా చిల్లంగి పెట్టారని గిరిజనులు నమ్ముతుంటారు. చిల్లంగి పెట్టడానికి, చెడుపును తీసేయడానికి గ్రామాల్లో ‘పెద్దదేవుడు/గురువు’ అనే వ్యక్తులను ఆశ్రయిస్తుంటారు. అనారోగ్యంతో ఉన్న వారిని అతను పరిశీలించి, కారణం ఏమిటో చెబుతాడు. అనారోగ్య సమస్య అయితే మూలికా వైద్యం చేస్తాడు. చిల్లంగి అయితే...విరుగుడుగా గ్రామశివార్లలో నల్లకోడి, దీపపు ఒత్తులు, కొబ్బరికాయలు, ముగ్గుపిండి వంటి సామగ్రితో పూజలు చేస్తాడు. అలాగే గురువు ఇంటిలోనే దేవత విగ్రహాలు లేదా  ఫొటోల వద్ద ప్రత్యేక పూజలు చేసి జంతు బలి ఇస్తుంటారు. కొంతమంది తమ అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి, తమకు గిట్టని వారిని ఇబ్బందులకు గురిచేయడానికి ఈ గురువులను ఆశ్రయిస్తుంటారు. తమ సమస్య పరిష్కారమైతే డబ్బులు, బియ్యం, మేకలు, పశువులను బహుమతిగా ఇస్తుంటారు. 


ప్రాణాలమీదకి తెచ్చకుంటున్న గురువులు

తమ సమస్యలను పరిష్కరించాలని గురువులను ఆశ్రయిస్తున్న గిరిజనులు...తమ కుటుంబంలో ఎవరైనా చనిపోయినా, తీవ్ర అనారోగ్యానికి గురైనా.. ఇందుకు గురువు చేతబడి చేయడమే కారణమంటూ దాడి చేసి, తీవ్రంగా గాయపరుస్తున్నారు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తున్నారు. 


మచ్చుకు కొన్ని సంఘటనలు

  1. 2015 నవంబరులో డుంబ్రిగుడ మండలం కితలంగి పంచాయతీ  రంగిసింగిగూడ గ్రామంలో ఓ గురువు/దిసారీ ఇంటిపై స్థానికులు దాడి చేసి అతనిని సజీవదహనం చేశారు. 
  2. డుంబ్రిగుడ మండలం తూటంగి పంచాయతీ ఈసుకలు గ్రామంలో నాలుగు నెలల క్రితం చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో ఒక గిరిజనుడిని సాటి గిరిజనులే సజీవ దహనం చేశారు.
  3. అనంతగిరి మండలం చిలకలగెడ్డ పంచాయతీ పాటి గ్రామానికి చెందిన ఒక గిరిజనుడు, చిల్లంగి చేసి తన అన్నను చంపాడనే అనుమానంతో మరో గిరిజనుడిని అక్టోబరు 27న కాశీపట్నం సంతలో కత్తితో పొడిచి హత్య చేశాడు. 
  4. జి.మాడుగుల మండలం గడుతూరు ప్రాంతంలో ఒక వ్యక్తిని గొడ్డలితో నరికి చంపేశారు. 
  5. ముంచంగిపుట్టు మండలం రంగబయలు పంచాయతీ పట్నాపడాల్‌పుట్‌ ప్రాంతంలో ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి బాణంతో చంపేశారు.
  6. పాడేరు మండలం మోదాపల్లి పంచాయతీ పందొర్లు గ్రామంలో చెడుపు చేస్తున్నాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని హత్య చేసి బావిలో పడేశారు. 
  7. తాజాగా అనంతగిరి మండలం టోకూరు పంచాయతీ బగ్మారవలస గ్రామంలో చేతబడి అనుమానంతో పరస్పరం దాడులు చేసుకోవడంతో ముగ్గురు మృతిచెందారు.
Advertisement
Advertisement