Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్‌గా సుధాకర్‌ బాధ్యతల స్వీకరణ

తిరుపతి(కల్చరల్‌), డిసెంబరు 1: తిరుపతిలోని శ్రీ వేకంటేశ్వర సంగీత, నృత్య కళాశాల ప్రిన్సిపాల్‌గా మృదంగాధిపతి ఎం.సుధాకర్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తిరుపతికి చెందిన ఈయన ఇదే కళాశాలలో 1976లో  13 ఏళ్ల వయసులో మృదంగ విభాగం విద్యార్థిగా చేరి 1983 వరకు వివిధ కోర్సులు పూర్తి చేశారు. 1994లో  అదే కళాశాలలో అధ్యాపకుడిగా బాధ్యతలు చేపట్టారు. తన ఉద్యోగ జీవితంలో ఎందరో శిష్యులను మృదంగంలో ప్రతిభావంతులుగా తీర్చిదిద్దారు. వారిలో పలువురు ఆకాశవాణి, దూరదర్శన్‌లో ఏ గ్రేడ్‌  ఉత్తమ కళాకారులుగా సంగీత సేవలందిస్తున్నారు. ఇంకొందరు దేశ విదేశాల్లో సంగీత కచేరీలతో రాణిస్తున్నారు. టీటీడీ ఈవోలు, జేఈవోల సహకారంతో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ కళాకారులతో మహతిలో వందలాది సంగీత కార్యక్రమాలను నిర్వహించడంలో సుధాకర్‌ చొరవ చూపారు. ప్రస్తుతం తాను చదివిన కళాశాలకే ప్రిన్సిపాల్‌గా నియమితులయ్యారు. విద్యార్థుల సంక్షేమం, సంగీత కళాశాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. అధ్యాపకుల సహకారంతో  విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఉమ ముద్దుబాల, కొమండూరి కృష్ణ, అనంత కృష్ణ, వైఎల్‌ శ్రీనివాసులు, డాక్టర్‌ శరత్‌చంద్ర, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement