Advertisement
Advertisement
Abn logo
Advertisement

చెట్ల కిందే చదువులు

- నాలుగు సంవత్సరాల నుంచి ఇదే గోస

- పట్టించుకోని అధికారులు

తాడ్వాయి, డిసెంబరు 1: బంగారు తెలంగాణ రాష్ట్రంలో బడిబాట అధ్వానంగా తయారైంది. ప్రభుత్వ పాఠశాలలను అధునాతనంగా తీర్చిదిద్దుతామని ప్రగల్బాలు పలికిన ప్రభుత్వం పాఠశాలను కనీసం పట్టించుకోవడం లేదు. విద్యా బోధన అటుంచితే, కనీసం విద్యార్థులకు కూర్చోడానికి సరైన భవనాలు లేకుండా పోయాయి. తాడ్వాయి మండలం పల్లెగడ్డ తండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు చెట్ల కింద కూర్చొని విద్యాభ్యాసం చేస్తున్నారు. వర్షం వస్తే పక్కనే ఉన్న అంగన్‌వాడీ భవనంలోకి వెళ్లడం, వర్షం పోయిన తర్వాత తిరిగి చెట్ల కింద రావడం విద్యార్థులకు ఆనవాయితీగా మారింది. విద్యార్థులు గత నాలుగు సంవత్సరాల నుంచి ఎండలో ఎండుతూ వానలో నానుతూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. పల్లెగడ్డ తండా ప్రాథమిక పాఠశాలలో మొత్తం 36 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. గతంలో ఉన్న ప్రాథమిక పాఠశాల భవనం శిథిల దశకు చేరుకొని కూలిపోవడంతో విద్యార్థులను ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో ఆరుబయటే చెట్ల కింద కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు.

విద్యార్థులపై ప్రజాప్రతినిధులకు చిన్నచూపు

పల్లెగడ్డ తండా ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరి విద్యార్థులకు ఇబ్బందులు అవుతున్నా అటు అధికారులు గాని ఇటు ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోవడం లేదని విద్యార్థులపై ఇంత చిన్నచూపు చూడడం తగదని తండావాసులు పేర్కొంటున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా పెడచెవిన పెడుతున్నారే తప్ప పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. సభలు, సమావేశాలలో ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించాలని ఉపన్యాసాలు దంచికొట్టే అధికారులు, ప్రజాప్రతినిధులు విద్యార్థులకు క్షేత్రస్థాయిలో అందిస్తున్న సౌకర్యాలపై మాత్రం మాట్లాడరనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

విద్యార్థులకు విష కీటకాలతో ప్రమాదం

విద్యార్థులు ఆరుబయటే చెట్ల కింద చ దువుకోడంతో వారి వద్దకు పాములు, విష కీటకాలు వస్తున్నాయి. విద్యార్థులు చదువుకుంటున్న సమయంలో పాములు రావడంతో వారు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఆరుబయట విద్యార్థులకు ఎలాంటి రక్షణ లేకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. మధ్యాహ్న భోజనం సైతం ఆరుబయట ఎండలో కూర్చోని తింటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే పాఠశాల భవనం మంజూరు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


భవనం లేక తీవ్ర ఇబ్బందులు

- హేమలత, ప్రధానోపాధ్యాయురాలు

పల్లెగడ్డ తండా ప్రాథమిక పాఠశాలకు భవనం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రభుత్వం వెంటనే భవనాన్ని మంజూరు చేయాలి. గత నాలుగు సంవత్సరాల నుంచి భవనం లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులకు ఆరుబయట చెట్ల కింద కూర్చోబెట్టి విద్యను బోధిస్తున్నాం. వర్షం పడితే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండను సైతం తట్టుకోలేకపోతున్నారు.


భవన నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించాం

- రామస్వామి, ఎంఈవో

పాఠశాల భవన నిర్మాణం కోసం అధికారులకు ప్రతిపాదనలు పంపించాం. ఈ విషయాన్ని డీఈవో దృష్టికి సైతం తీసుకెళ్లాం భవనం లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భవనం లేదనే విషయాన్ని ప్రతీ సంవత్సరం డైస్‌ఫారంలో సైతం నింపుతున్నాం. అధికారులు స్పందించి పాఠశాల భవనానికి నిధులు మంజూరు చేయాలి.

Advertisement
Advertisement