Abn logo
Sep 21 2021 @ 23:24PM

27న భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలి

వేలేరుపాడులో మాట్లాడుతున్న ఎండీ మున్నీర్‌

వేలేరుపాడు, సెప్టెంబరు 21: కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈనెల 27న భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని వామపక్ష ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. వేలేరుపాడులో భారత్‌ బంద్‌ సన్నాహక సదస్సును మంగళవారం నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు ఎండీ మున్నీర్‌ మాట్లాడుతూ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందని విమర్శించారు. కార్మికుల ప్రతిఘటన, ప్రజాభిప్రాయాన్ని లెక్క చేయకుండా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం ప్రయత్నించడాన్ని ఆక్షేపించారు. ప్రభుత్వ ఆస్తులు కార్పోరేట్‌లకు కట్టబెట్టడం, ఉద్యోగులను తొలగించడం, ధరలు పెంచి ప్రజల పొట్టకొట్టడం, కార్మిక, పౌర, మానవ హక్కులను హరించడం తదితర ప్రజా వ్యతిరేక విధానాలపై సంయుక్త కిసాన్‌ మోర్చా ఈనెల 27న తలపెట్టిన భారత్‌ బంద్‌లో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. సదస్సులో సీపీఐ, సీపీఎం, కాంగ్రెసు పార్టీ, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు కారం దారయ్య, మడివి దుర్గారావు, ధర్ముల రమేష్‌; కొల్లూరు సత్యనారాయణ, ఎస్‌కే గౌస్‌, మాచర్ల హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

గిరిజన గ్రామాల్లో ప్రచారం చేస్తున్న కొండరెడ్లు

బుట్టాయగూడెం: భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ, ఏఐకేఎంఎస్‌ నాయకులు, కార్యకర్తలు మంగళవారం అలివేరు తదితర కొండరెడ్డి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. న్యూడె మోక్రసీ నాయకుడు కారం రాఘవ మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాల ను అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 27న భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంపీ టీసీ కొవ్వాసు గోవిందరాజు, సర్పంచ్‌ కారం లక్ష్మి, కరకాల పద్మ, గోగుల పండు, రాజు, రమేష్‌, అర్జునుడు తదితరులు పాల్గొన్నారు.

చాగల్లులో ప్రజా సంఘాల నిరసన ప్రదర్శన

చాగల్లు: రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతు సం ఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ అన్నారు. 27న భారత్‌ బంద్‌ విజయవంతం చేయాలని కోరుతూ ప్రచార, నిరసన కార్యక్రమం మంగళవారం చేపట్టారు. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస్‌ మాట్లాడుతూ రైతులకు కనీస ఆదాయం లేక నష్టాల్లో ఉన్నారన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రధాని హామీ ఏమైందని ప్రశ్నించారు. కౌలురైతు సంఘం నాయకులు కంకటాల బుద్ధుడు, ఆర్‌.మురళి, కడారి ప్రభాకరరావు, ఆత్కూరి రాము, టి.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.