Abn logo
Sep 24 2021 @ 00:15AM

పోరాటంతోనే ఉక్కు పరిరక్షణ సాధ్యం

రిలే నిరాహార దీక్షలో మాట్లాడుతున్న సంపూర్ణం

పోరాట కమిటీ నాయకుడు సంపూర్ణం 

కూర్మన్నపాలెం, సెప్టెంబరు 23: ఉక్కు పరిరక్షణకు ఏ స్థాయి పోరాటాలకైనా సిద్ధమని ఉక్కు పోరాట కమిటీ నాయకులు సంపూర్ణం అన్నారు. కూర్మన్నపాలెంలో గురువారం 224వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలలో పాల్గొన్న ఎఫ్‌ఎండీ, సీఆర్‌ఎంపీ, వీఎస్‌జీహెచ్‌, హెచ్‌ఆర్‌ విభాగాల కార్మికులనుద్దేశించి మాట్లాడుతూ కరోనా కష్టకాలం నుంచి 224 రోజులుగా నిర్విరామంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికుల పోరాట పటిమ అభినందనీయమన్నారు. ఐక్య ఉద్యమాలతో ప్రధాని నరేంద్ర మోదీ కుటిల రాజకీయాలను ఎండగట్టాలన్నారు. పోరాట కమిటీ నాయకులు వేములపాటి ప్రసాద్‌ మాట్లాడుతూ కేంద్రం తనకు నచ్చినట్టుగా ప్రభుత్వ రంగ పరిశ్రమలను తన తాబేదార్లకు కట్టబెడితే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. ఐదు దశాబ్దాలు గడిచినా ఉక్కు కర్మాగారానికి  సొంత గనులను కేటాయించక పోవడం కేంద్ర ప్రభుత్వ అసమర్థతన్నారు. బీజేిపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఒక్క ప్రభుత్వరంగ సంస్థను కూడా ఏర్పాటు చేయలేదని, ఉన్నవి అమ్మేసే అధికారం వారికి ఎవరిచ్చారన్నారు. కార్యక్రమంలో ఉక్కు పోరాట కమిటీ నాయకులు గంధం వెంకట్రావు, కొమ్మినేని శ్రీనివాసరావు, గంగాధర్‌, గంగవరం గోపి, రాజు, శ్రీను, శశి రెడ్డి, ఈశ్వరరావు, గోవిందరావు, హనుమంతరావు, బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.