Abn logo
May 14 2020 @ 00:31AM

రాజ్య వివక్ష, ఆపై కరోనా కట్టడి

రేషన్ కార్డు లేనప్పటికీ ట్రాన్స్‌జెండర్ మహిళలకు నిత్యావసర సరుకులు, మందులు పంపిణీ చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నిర్దేశించింది. హెచ్‌ఐవితో బాధపడుతున్న ట్రాన్స్ మహిళలకు ప్రభుత్వం వెంటనే యాంటి రిట్రోవైరల్ డ్రగ్స్ అందజేయకపోతే వారి పరిస్థితి మరింతగా  విషమించే అవకాశం ఉంది.


కరోనా కర్ఫ్యూతో అత్యంత దారుణ పరిస్థితులను ఎదుర్కుంటున్న ట్రాన్స్‌జెండర్ మహిళల స్థితి గతులకు కారణం ఒకవిధంగా రాజ్య హింసే. ఒక ప్రక్కన క్రింది తరగతి ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోయి ప్రభుత్వం అందించిన నిత్యావసర సరుకులతో సర్దుకుంటుండగా, ట్రాన్స్ జెండర్ మహిళలకు నిత్యావసర సరుకులు కూడా ప్రభుత్వం నుంచి అందలేదు. కొందరు సామాజిక కార్యకర్తలు అందించిన సరుకులు కొందరు ట్రాన్స్ మహిళలకు అందినప్పటికీ, రెడ్‌జోన్‌లలోను, నగర శివార్లలో నివాసం ఉంటున్న ట్రాన్స్ మహిళలకు ఎటువంటి సహాయం అందలేదు. ప్రభుత్వం నుంచి సహాయం అందకపోవటానికి ఒక ముఖ్య కారణం ట్రాన్స్ మహిళలకు ఎటువంటి రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, బ్యాంకు అకౌంట్లు లేకపోవటం. మాములు సమయంలో ట్రాన్స్ మహిళలు ప్రభుత్వరంగం నుంచి ఏదైనా సహాయం పొందటానికి భయపడతారు. ఎందుకంటే, వారిపై సమాజం చేసే అఘాయిత్యాలకు తోడు, రాజ్యం మరింత హింసకు గురిచేస్తుంది. కుటుంబ హింస, సామాజిక దౌర్జన్యాలనుంచి రక్షించాల్సిన పోలీసు వ్యవస్థ వారికి రక్షణ కల్పించకపోగా నానా దుశ్చర్యలకు పాల్పడుతుంది. దీనితో వారు ప్రభుత్వానికి, సమాజానికి, కుటుంబాలకు ఆవల ఒంటరిగా జీవిస్తుంటారు. కొవిడ్ -19 కర్ఫ్యూతో వారికీ ఇటు జీవనోపాధి లేక, అటు ప్రభుత్వ సహాయం లేక ఆకలితో అలమటిస్తున్నారు. ట్రాన్స్‌జెండర్ కార్యకర్త వైజయంతి వసంత మొగలి వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ట్రాన్స్ మహిళలకి కొంత ఊరట కలింగించింది. తెలం  గాణ రాష్ట్ర హైకోర్ట్‌లో ఆమె వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం వలన రేషన్ కార్డు లేనప్పటికీ ట్రాన్స్ మహిళలకు నిత్యావసర సరుకులు, మందులు పంపిణీ చేయవలసిందిగా కోర్టు నిర్దేశించింది. 


ట్రాన్స్ మహిళలలో ఎక్కువమంది వలస కూలీలే. అయినప్పటికీ ప్రభుత్వం వారిని వలస కూలీలుగా గుర్తించడం కద్దు. అయితే, వీరిలో కొందరు షాపింగ్ మాల్స్, ఫంక్షన్ హాల్స్‌లో చిన్న చిన్న కూలీలుగా పని చేస్తున్నారు. ట్రాన్స్ మహిళల్లో విద్యావంతులైన కొందరు ఇంటర్నెట్ ద్వారా కొంత ఆదాయం వచ్చే పనులు చేస్తున్నారు. ఎక్కువ మంది సెక్స్ వర్క్, భిక్షాటనపై ఆధారపడి జీవించేవారు. వీరిని తల్లి దండ్రులు, కుటుంబం ఆదరించటం అరుదు. మన సంస్కృతిలో తల్లి ప్రేమ గురించి, కుటుంబ విలువల గురించి మాట్లాడేవాళ్ళు అనేకులు. అయితే అదే బ్రాహ్మణీయ సంస్కృతిలో తల్లి ప్రేమ కూడా బ్రాహ్మ ణీయ భావజాలానికి అతీతం కాదు. బ్రాహ్మణీయ భావజాలాన్ని వ్యతిరేకించిన బిడ్డను తల్లి ప్రేమించటం చాలా అరుదు. ఆడపిల్ల తమ సొంత కులం వారిని కాకుండా తక్కువ కులాల వారిని వివాహం చేసుకున్నప్పుడు, అబ్బాయి లేదా అమ్మాయి స్వలింగ సంపర్కులు లేదా ట్రాన్స్ జెండర్లు అయినప్పుడు వారు మొదటగా హింస ఎదుర్కొనేది తల్లి తండ్రుల నుంచే. అనేకమంది మహిళలకు వివాహం తరువాత భర్త, అత్తా మామల నుంచి తల్లిదండ్రులు ఎటువంటి రక్షణ కల్పించటానికి సిద్ధంగా ఉండరు. ఎందు కంటే, వివాహితకు వివాహం వెలుపల జీవితం లేదనేది బ్రాహ్మణీయ భావజాలం. అలాగే ఆడపిల్లలు, మహిళల పట్ల పోలీస్ వ్యవస్థ చూపే వివక్షకు కారణం కూడా ఇదే బ్రాహ్మణీయ భావజాలం. ఆడపిల్లలు కనపడకుండా పోయినప్పుడు, పోలీసులు ఉదాసీనత కనపర్చటంతో పాటు, వారి కుటుంబాలను అవమానకర ప్రశ్నలతో వేధిస్తారు.  


ట్రాన్స్ మహిళలతో కలిసి పనిచేయటం ద్వారా వారికి సంబంధించిన మరింత పెద్ద సమస్యల గురించి తెలుసుకోగలిగాను. వారిలో కొందరు హెచ్‌ఐవి, ఇతర లైంగిక వ్యాధులు ఉన్నవారు ఉన్నారు. ఎవరూ ప్రభుత్వ వైద్యశాలలో హెచ్‌ఐవి రోగులుగా నమోదు చేసుకోలేదు. సమాజం వారిపై చూపే వివక్షకు తోడు హెచ్‌ఐవి రోగులుగా మరింత వివక్షకు, రాజ్య హింసకు గురికావటం ఇష్టం లేక, వారు ఇంతవరకు ప్రైవేట్ వైద్యశాలలనుంచే వైద్య సదుపాయాలు, మందులు కొనుక్కున్నారు. అయితే కరోనాతో, అనేక ప్రైవేట్ వైద్యశాలలు మూతపడ్డాయి. స్వచ్ఛందంగా యాంటి రిట్రోవైరల్ డ్రగ్స్ కొనుక్కునే అవకాశం ఇప్పుడు లేకుండా పోయింది. ప్రభుత్వ వైద్యశాలలు ముందుగా నమోదు చేసుకున్న హెచ్‌ఐవి రోగులకు మాత్రమే యాంటి రిట్రోవైరల్ డ్రగ్స్ పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు కరోనా కర్ఫ్యూ కారణంగా కొత్త నమోదులు నిలిపివేశారు. ఈ మందులు వారికి ఏక్కడా దొరకటం లేదు. ఇప్పుడు హెచ్‌ఐవితో బాధ పడుతున్న ట్రాన్స్ మహిళలు జీవన్మరణ పోరాటం జరుపుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీరికి యాంటి రిట్రోవైరల్ డ్రగ్స్ అందజేయకపోతే వారి పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. 

సౌజన్య తమలపాకుల 

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్

Advertisement
Advertisement
Advertisement