Abn logo
Mar 23 2020 @ 04:36AM

వైద్య సిబ్బందికి క్రీడాలోకం సెల్యూట్‌

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారిపై పోరాటంలో అలుపెరగకుండా శ్రమిస్తున్న వైద్య సేవల సిబ్బందికి దేశ క్రీడాలోకం సెల్యూట్‌ చేసింది. ఈ మేరకు సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, పీవీ సింధు సహా పలువురు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్ట్‌ చేశారు. బెంగళూరులో శిక్షణ శిబిరంలో ఉన్న పురుషుల హాకీ జట్టు చప్పట్లతో తెలిపిన సంఘీభావ వీడియోను కోచ్‌ సొజొర్డ్‌ మారిన్‌ తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. ‘కొవిడ్‌-19పై అలుపెరగని పోరు సలుపుతున్న వీరులకు సెల్యూట్‌’ అని సెహ్వాగ్‌ పేర్కొన్నాడు. ‘కరోనాపై యుద్ధం చేస్తున్న వైద్య సిబ్బందే నిజమైన హీరోలు. మీకు జేజేలు’ అని రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియా ట్వీట్‌ చేశాడు. ‘కొవిడ్‌-19 బారినుంచి మమ్మల్ని రక్షించడానికి కృషి చేస్తున్న మీకు కృతజ్ఞతలు’ అని మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే అన్నాడు. అలాగే వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయ్‌ చాను, స్ర్పింటర్‌ హిమాదాస్‌, రెజ్లర్‌ వినేష్‌ ఫొగట్‌, షూటర్‌ హీనా సిద్ధు కూడా సంఘీభావం తెలిపారు. 

Advertisement