Abn logo
May 14 2021 @ 20:31PM

షాకింగ్.. ఇంకో 40ఏళ్ల తర్వాత పిల్లలు పుట్టరా!

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రపంచం క్షణక్షణానికి ఎన్నో మార్పులకు లోనవుతోంది. ప్రజలు కూడా కాలంతో పరుగులు తీస్తూ తమ జీవన విధానాలను పూర్తిగా మార్చుకుంటున్నారు. దీంతో కొత్త కొత్త వ్యాధులను కొని తెచ్చుకుంటున్నారు. అయితే ఇది ఇలానే కొనసాగితే భూమిపై మానవుల మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతి సమీప భవిష్యత్తులో పురుషులు తమ సంతాన ఉత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ షన్నా స్వాన్ అంటున్నారు. తాజాగా ఆమె రచించిన ‘కౌంట్‌డౌన్’ అనే పుస్తకంలో పురుషుల్లో వీర్యకణాల సంఖ్యకు సంబంధించిన సంచలన విషయాలను వెల్లడించారు. కొన్నేళ్లలో పురుషుల్లో వీర్యకణాల సంఖ్య ఘణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలిపారు. ఎంతలా అంటే.. సంతాన ఉత్పత్తికి కావాల్సిన కనీస వీర్యకణాల సంఖ్యను కూడా పురుషులు కలిగి ఉండలేరని చెప్పారు.


40 ఏళ్లలో పురుషుల్లో వీర్యకణాల సంఖ్య 50 శాతానికిపైగా పడిపోతుందని పేర్కొన్నారు. దీంతో 2060 నుంచి పురుషులు తమ సంతాన ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయే అవకాశాలు ఉన్నాయని షన్నా స్వాన్ చెబుతున్నారు. వీర్య కణాల సంఖ్య పడిపోవడంతోపాటే గర్భస్రావాల రేటు పెరుగుతందని తెలిపారు. అంతేకాకుండా పురుషుల్లో పురుషాంగాల పరిమాణం క్రమంగా తగ్గుందని చెప్పారు. అంతేకాకుండా 2045 నాటికి సంతానం కోసం చాలా మంది దంపతులు కృత్రిమ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుందని ఆమె తన పుస్తకంలో పేర్కొన్నారు. సంతాన ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన సమస్యలను కేవలం మనుషులే కాకుండా వన్యప్రాణులు కూడా ఎదుర్కొంటాయని చెప్పారు. వీటికి ప్రధానమైన కారణం రసాయనాలేనని ఆమె స్పష్టం చేశారు. 1973 తర్వాత మానవుల జీవనశైలిలో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయని షన్నా స్వాన్ పేర్కొన్నారు. తీసుకునే ఆహారపదార్థాలు, ఉబయకాయం, వ్యాయామం, ఎక్కవ మోతాదులో ఆల్కాహాల్ పుచ్చుకోవడం, పర్యావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు తదితర కారణాల వల్ల పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గుతుందని ఆమె వివరించారు. 


కాగా.. పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గుదల అంశంపై గతంలో కూడా అనేక పరిశోధనలు జరిగాయి. వాటికి సంబంధించిన నివేదికలు కూడా బయటకొచ్చాయి. 1990ల్లో మొట్టమొదటగా ఈ అంశం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. తర్వాత 2017లో కూడా ఓ నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. 1973-2011 మధ్య కాలంలో ఏడాదికి సగటున 1-2శాతం చొప్పున పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గిందని వెల్లడించింది. ఇదిలా ఉంటే.. రసాయనాల కారణంగా పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ తగ్గినట్టే, రసాయనాలతో నిండిన పర్యావరణం కారణంగా జంతవులు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నట్టు తాజాగా జరిగిన కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. 


ప్రత్యేకంమరిన్ని...

Advertisement