Abn logo
Feb 26 2021 @ 00:48AM

శాసన శోధనలో విశిష్టుడు

శాసనాలు...మన ప్రాచీన సంస్కృతికి ఆనవాళ్లు. చరిత్ర నిర్మాణానికి సోపానాలు. వాటిలోని భాష, యాస ప్రత్యేకం. తెలుగు భాష ప్రాచీనతను అధ్యయనం చేయడంలోనూ వాటి పాత్ర అనన్యం. ఎలరస (యువరాజు), పునరసుపుష్యంబు (పునర్వసు నక్షత్రం), బారదాయ (భరద్వాజగోత్రుడు), కొచ్చియపార (కౌసికగోత్రుడు) రోగొండ్ర వాండ్రు (లంచం తీసుకునేవారు), చీకు (చీకటి) వంటి అనేక పదాలు మనకు శాసనాల్లో కనిపిస్తాయి. అసుర గురువారం (శుక్రవారం) ఇలా ప్రాకృతంతోపాటు వివిధ భాషా పదాలతో కూడిన శాసనాల అధ్యయనం మాత్రం ఓ సవాలు. కాలగర్భంలో కలిసిపోయిన చరిత్రను నేటి తరాలకు అందిస్తున్న వాహకాలుగా నిలుస్తున్న శాసనాల అధ్యయనంవైపు అతి తక్కువమంది మాత్రమే అడుగులు వేస్తున్నారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని ప్రాచీన భారతదేశ చరిత్ర, సంస్కృతి పురావస్తు విభాగంలో ఆచార్యులుగా పనిచేస్తున్న నాగోలు కృష్ణారెడ్డి శాసనాల అధ్యయనానికి అంకితమయ్యారు. ఆయన వివిధ ప్రాంతాల్లో లభ్యమైన శాసనాలను సేకరించి, పరిష్కరించి సమాజానికి అందించారు. చరిత్రకెక్కని అనేక విషయాల్ని కృష్ణారెడ్డ్డి సునిశిత దృష్టితో గుర్తించి, పరిశీలించి ప్రకటించారు. ఇతర పరిశోధకులు పరిష్కరించినా పూర్తి సమాచారం వెల్లడించకపోవడం, ప్రజాబాహుళ్యంలోకి సంపూర్ణంగా సమాచారం చేరకపోవడం వంటి అంశాల్ని దృష్టిలో ఉంచుకుని ఆయా విషయాలకు బహుళప్రాచుర్యం కల్పించారు. దాదాపు మూడు దశాబ్దాల బోధనానుభవం మూడున్నర దశాబ్దాల పరిశోధకుడిగా ఆయన తెలుగు నేలపైనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో లభించిన శాసనాల్ని పరిశీలించి అధ్యయనం చేశారు. దేశవ్యాప్తంగా లక్షకుపైగా శాసనాలు లభ్య మయ్యాయి. అందులో 65శాతం దక్షిణ భారతదేశంలో లభించాయి. ఇంకా అక్కడక్కడా వెలుగు చూస్తూనే ఉన్నాయి.


చరిత్ర నిర్మాణంలో శాసనాలు ముఖ్యమైన భూమికను పోషిస్తాయి. శాసనాలను పరిశీలించడం ద్వారా ఆయా కాలాల ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిస్థితుల్ని స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఆంధ్రులకు నాగజాతికి సంబంధం ఉందని కూడా భావిస్తున్నాం. అమరావతి రాజధానిగా పరిపాలన సాగించిన రాజులు, రాణులకు సర్పకిరీటాలు తెలిసిందే. భారతదేశంలో లభించిన తొలి శాసనాలు అశోకునికి సంబంధించినవి. అశోకుని శాసనాలు ఆయన వ్యక్తిత్వాన్ని ప్రస్ఫుటం చేస్తాయి. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దినాటి రాజకీయ చరిత్రకు అశోకుని శాసనాలే ముఖ్యమైన ఆధారాలు. గుప్తుల రాజకీయ చరిత్రను తెలుసుకునేందుకు సముద్రగుప్తుని అలహాబాదు స్తంభశాసనం చాలా ఉపయుక్తంగా నిలిచింది. అశోకుడికి రాయలసీమ ప్రాంతానికి ఉన్న సంబంధాలపైన కూడా కృష్ణారెడ్డి విశేషకృషి చేశారు. అశోకుని కాలానికి సంబంధించిన శాసనాల్లో రాయల సీమ ప్రస్తావనల్ని క్రోడీకరించారు. 


చరిత్రలో సముద్రగుప్తుడు ఓడించిన విష్ణుగోపవర్మ ఎవరనే ప్రశ్నకు నాగోలు కృష్ణారెడ్డి సమాధానాన్ని కనుగొన్నారు. ప్రకాశం జిల్లా కంచి రాజధానిగా పల్లవుల వంశీయుడైన విష్ణుగోపవర్మ పాలనసాగించారనేందుకు ఆధారాల్ని సేకరించారు. సముద్రగుప్తుడు తాను సాగించిన జైత్రయాత్రలో దక్షిణభారతదేశంలోని 12 మందిపాలకుల్ని ఓడించినట్లు అలహాబాదులో లభించిన నాలుగో శతాబ్దానికి సంబంధించిన స్తంభ శాసనంలో ఉంది. ఆ 12 మందిలో ఉన్న కంచి విష్ణుగోపవర్మ ఎవరనేది సంవత్సరాలుగా చరిత్రకారులు తేల్చలేకపోయారు. అందుబాటులో ఉన్న చారిత్రక ఆధారాల ప్రకారం 6, 7 శతాబ్దాల్లో విష్ణుగోపవర్మ తమిళనాడులోని కంచి రాజధానిగా రాజ్యాన్ని పాలించినట్లు చరిత్రకారులు నిర్దారించి ఉన్నారు. నాలుగో శతాబ్దంలో వేయించిన శాసనంలో ఉన్న ఈ విష్ణుగోపవర్మ 6, 7 శతాబ్దాలకు చెందిన విష్ణుగోపవర్మ అయ్యే అవకాశంలేదు కాబట్టి అదో మిస్టరీగా ఉండిపోయింది. ఈ నేపథ్యంలో ఆరు సంవత్సరాల కిందట కర్నూలు జిల్లా అలవకొండ గ్రామానికి చెందిన కానాల వెంకటరెడ్డి ఇంటి ఆవరణంలో పునాదులు తీస్తుండగా లభించిన తామ్ర శాసనం ఈ చిక్కుముడిని విప్పింది. ఆ శాసనాన్ని పరిశీలించిన కృష్ణారెడ్డి పల్లవ వంశస్థుడైన విష్ణుగోపవర్మ ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని కంచి రాజధానిగా పాలన సాగించారని, సముద్రగుప్తుడి చేతిలో ఓడిపోయిన విష్ణుగోపవర్మ ఈయనే అని నిర్ధారించారు. ఇదో చారిత్రక ఆధారంగా నిలుస్తోంది. ప్రాచీన పల్లవులు రాయలసీమ, గుంటూరు ప్రాంతాల్ని పాలించారు. వీరు తమిళ ప్రాంతాన్ని కూడా పరిపాలించారు. ఆర్వాచీన పల్లవులు తర్వాతికాలంలో తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలించారు. పల్లవరాజుల్ని తమవారిగా భావించిన తమిళులు అన్నింటికి ఆ పేర్లు పెట్టుకునేవారు. పల్లవులు తెలుగువారేనని ఇటీవల పలువురు తమిళ చరిత్రకారులు కూడా అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తమ సంస్థలకు పల్లవుల పేర్లు పెట్టుకోవడాన్ని తమిళ సోదరులు తగ్గించేశారు. 


గోగ్రహణాలపై మొత్తం 54 శాసనాలు లభించగా అందులో 53 రాయలసీమ జిల్లాల్లో లభ్యమయ్యాయి.ఒక శాసనం గుంటూరులో వెలుగు చూసింది. గోవులమందలే ప్రధాన ఆస్తిగా ఉన్న రోజుల్లో వాటిని అపహరించే ప్రయత్నాలు సాగేవి. ఒక రకంగా యుద్ధాలే జరిగేవి. ఆవుల అపహరణల్ని అడ్డుకునే సందర్భంలో జరిగేఘర్షణల్లో కొందరు అసువులుబాసేవారు. అలాంటి దివంగతుల్ని వీరులుగా పరిగణిస్తూ వారి పేరిట శాసనాలు వేయించేవారు. వీరుడ్ని అప్సరసలు స్వర్గానికి తీసుకెళుతున్నట్లుగా పాలకులు తయారు చేయించిన శిల్పాలుఇప్పటికీ కనిపిస్తుంటాయి. అమరవీరుల వారసుల పోషణకు గ్రామాలను కేటాయించేవారు. వీరుల కుటుంబపోషణకు ఉద్దేశించిన గ్రామాలను ‘నెత్తురుపట్టు’ అని పిలిచేవారు. ఇలాంటి వీరశిలాశాసనాలు చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలోని మంగకుళం దగ్గర 11 లభించాయి. కడప జిల్లా సిద్ధవటం దగ్గరలోని గంగపేరూరులో క్రీస్తుశకం నాలుగో శతాబ్దానికి చెందిన ప్రాచీన శిలాశాసనం లభించింది. అటవీ సమీపప్రాంతాల్లోనే వ్యవసాయం, పశు పోషణ సాగేది కాబట్టి అక్కడే ఘర్షణలు జరిగి వీరశిలాశాసనాలు ఏర్పాటు చేసి ఉంటారు. ఆచార్య నాగోలు కృష్ణారెడ్డి ఉద్యోగ విరమణ సందర్భంగా ఆయన స్నేహితులు, శిష్యులు, శ్రేయోభిలాషులు నేడు ఒక అభినందన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలోని సెనేట్‌హాలులో జరిగే ఈ సమావేశంలో ఆయన రచించిన రెండు పుస్తకాల్ని కూడా ఆవిష్కరించనున్నారు. అవి: ‘అశోకుడు - రాయలసీమ’; ‘శాసనాలు - సామాజిక, సాంస్కృతిక చరిత్ర’. అధ్యాపకవృత్తి బాధ్యతలనుంచి అధికారికంగా విరమణ తీసుకున్నా చరిత్ర, పురావస్తుశాస్త్ర అధ్యయనం బాటలోనే పయనించాలనేది కృష్ణారెడ్డి అభిమతం. ఆయన అధ్యయనాలు పురావస్తుశాస్త్రం, శాసనాలపై పరిశోధన చేసేవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని, ఆయన మరెన్నో పరిశోధనా ఫలాల్ని సమాజానికి అందిస్తారని నిస్సందేహంగా చెప్పొచ్చు. 

డాక్టర్‌ యల్వీకే

రిజిస్ట్రార్‌, విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం, నెల్లూరు

(నేడు ఆచార్య నాగోలు కృష్ణారెడ్డి అభినందన సభ, పుస్తకాల ఆవిష్కరణ)

Advertisement
Advertisement
Advertisement