Abn logo
Jun 1 2020 @ 03:56AM

మరింత శుభ్రత..

మునిసిపాలిటీల్లో నేటి నుంచి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం

రోజువారీ కార్యక్రమాల ప్రణాళిక ఖరారు


వికారాబాద్‌, ఆంధ్రజ్యోతి/ తాండూర్‌ : జిల్లాలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడంతోపాటు వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా మునిసిపాలిటీల్లో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూన్‌ 1 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా ఏరోజు ఏ పని చేపట్టాలనేది వివరిస్తూ కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. శనివారం సంచిత వ్యర్థ పదార్థాల తొలగింపు, అంతర్గత, బహిర్గత మురుగునీటి కాలువలను శుభ్రం చేయడం, పొంగిపొర్లే అంతర్గత మురుగునీటి మ్యాన్‌హోళ్లను శుభ్రం చేయాలని సూచించారు. సోమవారం గృహ నిర్మాణాల శిథిలాలు, రోడ్లకు ఇరువైపులా ఉండే పిచ్చి మొక్కలను తొలగించే పనులు చేపట్టాల్సి ఉంటుంది. 2న నీటినిల్వ, లోతట్టు ప్రాంతాలను చదును చేయడం, 3న పబ్లిక్‌ టాయిలెట్లు, మురికిగుంతలు శుభ్రం చేసే పనులు. 4న ప్రభుత్వ విద్యాలయాలు, కార్యాలయాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.


5న  వార్డుల్లో ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాల్లోని చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలించడం, 6న ఆసుపత్రుల నుంచి వెలువడే వ్యర్థ పదార్థాలను తొలగించే పనులు చేపట్టాల్సి ఉంటుంది. 7న కొవిడ్‌ వ్యాప్తి జరగకుండా ఉండేందుకు 20 సెకన్లపాటు చేతులు శుభ్రం చేసుకోవడం, ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజ్‌లు ధరించడం, భౌతికదూరంపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలి. 8న ఏ కుటుంబంలో ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు, ముక్కు కారడం వంటి అనారోగ్య సమస్యలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే ఆశ వర్కర్లకు సమాచారం తెలియజేసేలా ప్రజలకు వివరించాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్‌ పౌసుమి బసు శనివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 


ప్రతిరోజూ విధిగా చేయాల్సిన పనులు

ఇదిలా ఉంటే, ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజూ మునిసిపాలిటీల్లో చైర్‌పర్సన్లు, వార్డుసభ్యులు, ప్రత్యేకాధికారులు, వార్డు కమిటీల సభ్యులు, పారిశుధ్య సిబ్బంది, ప్రజలతో కలిసి వార్డుల వారీగా పాదయాత్రలు నిర్వహించి నీటి నిల్వ ప్రాంతాలను గుర్తించాలి. మురికి కాలువలను శుభ్రం చేసి బ్లీచింగ్‌ పౌడర్‌, హైపోక్లోరైడ్‌ ద్రావణం, గాంబోషియా చేపలు, ఆయిల్‌ బాల్స్‌, యాంటీ లార్వా ద్రావణం చల్లడం, స్ర్పే చేయడం చేయాలి. వార్డుల్లో గృహ నిర్మాణాలకు సంబంధించిన శిథిలాలను తొలగించి ప్రమాదకరంగా ఉన్న గుంతల్లో వేసి పూడ్చాలి. దోమల నివారణకు ఫాగింగ్‌ చేపట్టాలి. వార్డుల్లో బహిర్గత, అంతర్గత మురుగుకాలువలను శుభ్రం చేయడం, దుకాణాలు, గోదాముల సముదాయాలు, ప్రజా వైద్యశాలల్లో వ్యర్థాలను తొలగించాల్సి ఉంటుంది. నీటి ట్యాంకులను శుభ్రపరిచి బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం, తాగునీటి సరఫరా పైపులైన్‌ లీకేజీ మరమ్మతులు చేపట్టడం, లోతట్టు ప్రాంతాల్లో మొరం పోయడం వంటి పనులు చేపట్టాలి. ప్రతి ఆదివారం ఉదయం 10.10 గంటలకు ప్రతి ఇంట్లో నిల్వ ఉన్న నీరు, వస్తువులను తొలగించాలి. ఇంటింటికి వెళ్లి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి డంపింగ్‌ యార్డుకు తరలించాలి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బస్‌స్టేషన్‌, కమ్యూనిటీ హాళ్లు, మార్కెట్లు, అంగన్‌వాడీ భవనాలను శుభ్రపరిచే పనులు నిర్వహించాలి. 


పాల్గొనకపోతే చర్యలు

ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్నివార్డుల్లో టాంటాం, ఆటోల ద్వారా చాటింపు వేయాల్సి ఉం టుంది. పారిశుధ్య పనులకు అవసరమైన ఫాగింగ్‌ యంత్రాలు, స్ర్పే యర్లు, బ్లీచింగ్‌ పౌడర్‌, హైపోక్లోరైడ్‌ ద్రావణం, గాంబోషియా చేపలు, ఆయిల్‌ బాల్స్‌, యాంటీ లార్వా ద్రావణం సమకూర్చుకోవాలి. వార్డు ప్రత్యేకాధికారులు తమకు కేటాయించిన వార్డుల్లో ఉదయం 7గంటల్లోగా ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. రోజువారీగా కేటాయించిన పనులు చేపట్టక ముందు, పనులు చేపట్టిన తరువాత ఫొటోలను జతపరిచి మునిసిపల్‌ కమిషనర్‌ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. ఆకస్మిక తనిఖీల్లో ప్రణాళిక ప్రకారం పారిశుధ్య పనులు పూర్తి చేయకపోతే సంబంధిత వార్డు ప్రత్యేకాధికారి, సంబంధిత మునిసిపల్‌ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని, లేనిపక్షంలో పురపాలక సంఘం చట్టం ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 


Advertisement
Advertisement