Abn logo
Sep 25 2021 @ 12:55PM

ఆ కంఠం మూగబోయి అప్పుడే ఏడాది!

నెల్లూరు (సాంస్కృతిక ప్రతినిధి): కోటి కోయిలల మధుర స్వరాలను మోసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గంధర్వ కంఠం మూగబోయి అప్పుడే ఏడాది అయింది. తన పాటలతో యావత్‌ భారతదేశాన్ని తన్మయత్వంలో ఓలలాడించిన గాన గాంధర్వుడు బాలు మృతిని ఇప్పటికీ సంగీతాభిమానులు మరువలేకున్నారు. ఆయన సొంతగడ్డ సింహపురి ఇప్పటికీ మూగగా రోదిస్తూనే ఉంది. నెల్లూరు నగరంలోని ట్రంకురోడ్డు ఎదురుగా ఉన్న వీధిలో బాలు తల్లిదండ్రులు  పండితారాధ్యుల సాంబమూర్తి, శకుంతలమ్మ ఉండేవారు. బాలు తొలి గురువు ఆయన తండ్రే. చిన్నతనం నుంచే తండ్రితో కలిసి హరికథా గానం చేస్తూ, స్నేహితుల మధ్య సినిమా పాటలు పాడుతూ.. చిన్న చిన్న నాటకాలు ప్రదర్శిస్తూ.. ఆడుతూ పాడుతూనే ప్రముఖ గాయకుడిగా ఎదిగారు. తన ఆరుగురు మిత్రులతో కలసి పూర్ణా క్యాంటీన్‌లో 2/6 కాఫీ, టీలు తాగేవారు. ఆ సమయం తప్పించి, ఈ ఆరుగురికి బాలు ఇంటి ఆరుబయట స్థలం సంగీత కబుర్లకు వేదిక అయింది. ఎస్పీ బాలును ‘మణి’ అంటూ ముద్దుగా పిలుచుకునేవారు. ఇంజనీరింగ్‌లో సీటు వచ్చి అనంతపురం వెళ్లినా నెల్లూరు మీద బెంగతో తిరిగి వచ్చేశారు. టౌనుహాలు వేదికగా నాటకాలు, పాటల పోటీల్లో సాధించిన ఎన్నో బహుమతులు, మరెన్నో కప్పులతో బాలు ఇల్లు నిండిపోయింది. ఎంతో విలువైన తన ఇంటిని వేద సంస్కృత పాఠశాల కోసం కంచికామకోటి పీఠానికి విరాళంగా ఇచ్చారు.


 1966లో తొలిపాట 

సంగీత దర్శకులు కోదండపాణి ఇచ్చిన తొలిపాటతో 2020 వరకు తిరుగులేని గాయకుడిగా ఎదిగారు. దాదాపు 10 భాషల్లో 40 వేలకుపైగా పాటలు పాడిన ఆయన  సింహపురి ఖ్యాతిని నలుదిశలా వ్యాపింపజేశారు. ఎంతోమంది శ్రోతలను అలరింపజేసిన ఎస్పీ బాలు అనారోగ్యంతో బాధపడుతూ గతేడాది సెప్టెంబరు 24న చెన్నైలో మృతి చెందారు. ఆయన భువిని వీడి సంవత్సరం గడిచినా అభిమానుల గుండెల్లో మాత్రం ఇప్పటికీ కొలువై ఉన్నారు. బాలు మిత్రులు, అభిమానులు తమతో గడిపిన మధుర క్షణాలను తలుచుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు.