Abn logo
Sep 13 2020 @ 10:29AM

జీతాల కోసం ప్లాట్‌ అమ్మాడు..

Kaakateeya

కాలానికంటే ముందుంటే అద్భుతాలు చేయొచ్చు. కానీ, ఒక్కోసారి ఎదురీదే పరిస్థితులే రావొచ్చు. ధైర్యంగా నిలబడితేనే విజయం సాధించగలం అని చెబుతోంది ఇండియా మార్ట్‌ వ్యవస్థాపకుడు దినేష్‌ చంద్ర అగర్వాల్‌ జీవితం. ఆయన ఒక అడుగు ముందుకు వేయాలని సంకల్పిస్తే.. పది అడుగులు వెనక్కి వేసేలా చేశాయి పరిస్థితులు. అయినా కుంగిపోలేదు. ధైర్యాన్ని వీడలేదు..


భార్య చేతన అగర్వాల్‌. దినేష్‌ కు తాడూ బొంగరం లేని రోజు నుండి నేటి వరకు అండగా వెన్నుదన్ను గా ఉంటోంది. గోరఖ్‌పూర్‌లోని ప్రఖ్యాత గీతా ప్రెస్‌ వ్యవస్థాపకుడి మనవరాలే దినేష్‌ భార్య చేతన.


కంప్యూటర్లు లేకపోయినా చిన్న వ్యాపారస్తులు సులభతరంగా ఉపయోగించేటట్టు మొబైల్‌ ఆధారిత ఇండియా మార్ట్‌. కామ్‌ వెబ్‌సైటును సృష్టించాడు. వ్యాపారం పుంజుకొనే సరికి వాటా కొనడానికి వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలు క్యూ కట్టాయి. దిగ్గజ సంస్థలూ ప్రయత్నించాయి కానీ అమ్మనని తెగేసిచెప్పాడు దినేష్‌. అనేక ఒత్తిళ్లను అధిగమించి ఆఖరికి నిలబడ్డాడు. 


డిసెంబర్‌ 2001, న్యూఢిల్లీ - ఇండియా మార్ట్‌ ఉద్యోగుల గుసగుసలు... ‘ఈ నెలా జీతం వచ్చేట్టు లేదు. మన సారు ఇంటిని అమ్మకానికి పెట్టారట, అది అమ్ముడయ్యాక ముందు అప్పులు తీర్చాలి, సప్లయర్లకు ఇవ్వాలి తరువాతే మన వంతు’ ఆర్నెళ్ల కిందట చేరిన ఉద్యోగి ఆందోళన చెందాడు. ‘చూడు బ్రదరూ.. మేమందరం ఐదేళ్లుగా పనిచేస్తున్నాం, ఏ ఒక్క నెల కూడా ఇలా జరగలేదు. మూడు నెలల జీతం రాకపోయినా అదే ఉత్సాహంతో పనిచేస్తున్నాం.. ఎందుకంటే ఈ సంస్థ ఎప్పుడూ అన్యాయం చెయ్యదు’ ధైర్యం చెప్పారు సాటి ఉద్యోగులు. ....అదీ తొలినాళ్లలో కంపెనీ పరిస్థితి..


దార్శనికుడు..  

ఉత్తరప్రదేశ్‌, బహ్రాయిచ్‌ జిల్లాలోని నాన్‌పరాలో నివసించే వ్యాపారస్థుల కుటుంబంలో పుట్టాడు దినేష్‌ చంద్ర అగర్వాల్‌. తాత, తండ్రి, పినతండ్రులు చిన్నాచితకా వ్యాపారాలు చేసేవారు. చిన్నప్పటి నుంచే చదువులో రాణించాడు. కాన్పూర్‌లో కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తి చేశాడు. సెంట్రలైజ్డ్‌ రైల్వే రిజర్వేషన్‌ సిస్టమ్స్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రాజెక్ట్‌ చేపట్టింది అప్పటి ప్రభుత్వ సంస్థ ‘కంప్యూటర్‌ మెయింటెనెన్స్‌ కార్పొరేషన్‌’. ఆ ప్రాజెక్ట్‌లో (1990) ఇంజినీర్‌గా ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్ళకు సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలిమాటిక్స్‌ (సి-డాట్‌)లో చేరాడు. ఆయన అనుభవాన్ని చూసిన హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ సంస్థ దినేష్‌కు తమ అమెరికా కార్యాలయంలో ఉద్యోగమిచ్చింది. ఆ సంస్థ క్లయింట్‌ అయిన బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా లాంటి కొన్ని కంపెనీలలో పనిచేసే అవకాశం దొరికింది. ఓరోజు ఆఫీసులో సహోద్యోగిని కంప్యూటర్‌ స్ర్కీన్‌ చూసి ఆశ్చర్యపోయాడు. కొత్తగా వచ్చిన తొలి గ్రాఫిక్‌ వెబ్‌ బ్రౌజర్‌ ‘మొజాయిక్‌’లో ఏ విషయం గురించి అడిగినా పలు వెబ్‌సైట్లు దర్శనమిచ్చేవి. రోజూ ఇంటర్నెట్‌ మీద కొంత సమయం వెచ్చించి ముచ్చటపడేవాడు. ఇక, ఇంటర్‌నెట్‌దే భవిష్యత్తు అని తీర్మానించుకున్నాడు. ఇంటర్నెట్‌ ఆధారిత వ్యాపారం సొంతగడ్డపై చేయాలనుకుని.. మాతృ దేశం వచ్చేశాడు. కొత్త కంప్యూటర్‌ కొన్నాడు. అదే అతని తొలి పెట్టుబడి. నెట్‌ తొలినాళ్లలో..

ఇంటర్నెట్‌తో ఏ వ్యాపారం చేద్దామన్నా దేశంలో పదిహేను వేలకు మించి కనెక్షన్లు లేవు. గవర్నమెంట్‌ ఆఫీసులు, కంప్యూటర్‌ ఇనిస్టిట్యూట్లలో తప్ప కంప్యూటర్లు ఉన్న కార్యాలయాలు, ఇళ్లు అరుదు. ఇప్పుడు వెబ్‌సైట్‌ డొమైన్‌ రూ.500 కి కూడా లభ్యమవుతోంది కానీ.. అప్పుడు రూ.6 వేలు చెల్లించాల్సి వచ్చేది. ఇంటి కోసం టెలిఫోన్‌ కనెక్షన్‌ తీసుకుంటే పెద్ద టెలిఫోన్‌ డైరెక్టరీని ఇచ్చింది టెలికాం డిపార్ట్‌మెంట్‌. అంత పెద్ద బుక్కును చూడగానే పాదరసం లాంటి ఆలోచన తట్టింది. విదేశాలలో భారతీయ ఉత్పత్తులకున్న డిమాండ్‌ను గమనించాడు కానీ ఎగుమతిదారుల సమాచారం తెలుసుకుని వారితో సంప్రదింపులు జరపడం పెద్ద సమస్య అయ్యింది. భారతీయ ఎగుమతి దిగుమతి దారుల వివరాల జాబితాతో వెబ్‌సైటు పెడితే విదేశీ వాణిజ్య సంస్థలకు ఉపయోగపడుతుందని అనుకున్నాడు. అలా పుట్టింది ‘ఇండియా మార్ట్‌’. బాబాయ్‌ కొడుకు బ్రిజేష్‌ అగర్వాల్‌ కూడా భాగస్వామిగా చేరాడు. ఎగుమతి- దిగుమతిదారుల వివరాల కోసం వాణిజ్య మంత్రిత్వశాఖ కార్యాలయాలకు చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం లేదు. అయినా నిరుత్సాహపడలేదు. మొండి పట్టుదలతో రెండు వేల పోస్ట్‌ కార్డులు కొన్నాడు. టెలిఫోన్‌ డైరెక్టరీ,  వార్తాపత్రికల్లోని ప్రకటనలను చూసి వాటి అడ్రస్‌లకు పోస్ట్‌ కార్డులు రాసి పంపేవాడు. తల్లీ భార్య కూడా సహకరించేవాళ్ళు. ఇండియా మార్ట్‌.కామ్‌ వెబ్‌సైట్లో మీ వ్యాపారం, వస్తు-సేవలు ఉచితంగా నమోదు చేసుకోండి’ అన్నదిఆ పోస్ట్‌కార్డుల సారాంశం. ఇందులో ఉన్న ఎగుమతిదారుల ఉత్పత్తులను కొనడానికి కొన్ని విదేశీ వ్యాపార సంస్థలు ఈ మెయిల్‌ ద్వారా సంప్రదించేవి. కానీ స్వదేశీ ఎగుమతి వ్యాపార సంస్థలకు ఈ మెయిల్‌ లేకపోవడం వల్ల ఫ్యాక్స్‌, పోస్ట్‌కార్డు, ఫోన్ల ద్వారా సంప్రదించి విదేశీ వ్యాపార సంస్థలతో పరిచయం చేసుకువాడు.   


వెబ్‌సైట్ల నిర్వహణ..

మరో రెండేళ్లకు ఇంటర్నెట్‌ సేవలను అందించేందుకు ప్రయివేట్‌ సంస్థలకు అనుమతిచ్చింది ప్రభుత్వం. ఇంటర్నెట్‌ వాడకం పెరగడం మొదలయింది. వ్యాపార సంస్థలకు వెబ్‌సైట్‌లు రూపొందిస్తే అటు ఆదాయమూ వస్తుంది, ఇటు ఇంటర్నెట్‌ వాడకందారులను పెంచుకుంటూ పోవచ్చు.. అని ఓ నిర్ణయానికొచ్చాడు. ఢిల్లీలో ‘నిరులాస్‌’ అనే ప్రముఖ గొలుసుకట్టు రెస్టారెంట్‌కి వెబ్‌సైట్‌ను రూపొందించి మెయింటెనెన్సు చేయడానికి ఒప్పించాడు. ఏడాదికి రూ.32 వేలిస్తామన్నారు. తొలి ఏడాది 50 సంస్థలకు వెబ్‌సైట్లు రూపొందించి ఆరు లక్షలు సంపాదించాడు. ఆ తరవాత గిరాకీ పెరగడంతో ఒక్కో వెబ్‌సైట్‌కు రూ.50 వేలు వసూలు చేసేవాడు. నేటికీ అదే ధరను వసూలు చేస్తోంది ఇండియా మార్ట్‌. దేశంలో 50 శాతం ఎస్‌ఎంఈ సంస్థల వెబ్‌సైట్‌లు ఇండియామార్ట్‌ చేత రూపొందించబడ్డాయి. బుడిబుడి నడకలు వేస్తూండగానే డాట్‌ కామ్‌ బబుల్‌ వెబ్‌సైట్ల వ్యాపారాన్ని దెబ్బతీసింది. చేసేదిలేక ఉన్న డబ్బుని, ఉద్యోగులను జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఏడాదిలో వ్యాపారం పుంజుకొంది. చిన్న అద్దె గదిలో కార్యాలయం వుంటే ఎప్పటికీ సంస్థను విస్తరించలేమని నోయిడాలో రెండెకరాల స్థలం కొని కార్యాలయం కోసం సెప్టెంబర్‌ 10 నాడు శంకుస్థాపన చేశాడు. మరుసటి రోజే అమెరికాలో (9/11) అల్‌-ఖయిదా దాడులు జరిపింది. దెబ్బతో 50 శాతం వ్యాపారం పడిపోయింది. 


మార్కెటింగ్‌ కోసమే... 

ఉగ్యోగులకు ఆరు నెలల వరకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. దినేష్‌ మీద ఉన్న నమ్మకంతో ఒక్క ఉద్యోగి కూడా సంస్థను విడిచిపెట్టి వెళ్ళలేదు. చివరికి తన ఫ్లాట్‌ అమ్మి అప్పులు తీర్చి, జీతాలు ఇచ్చాడు. 2008లో ప్రపంచ ఆర్ధిక మాంద్యం వచ్చినపుడు మళ్ళీ వ్యాపారం దెబ్బతినింది. ఇలాంటి ఆటుపోట్లు తట్టుకోవాలంటే  కేవలం ఎగుమతి-దిగుమతి ఆధారిత సప్లయర్ల మీద ఆధారపడకుండా భారతదేశం కేంద్రీకృత బి2బి మార్కెట్‌ వైపు దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించుకున్నాడు.  ఇంటెల్‌ కాపిటల్‌ నుండి పెట్టుబడి తీసుకుని సంస్థను బలోపేతం చేశాడు. దేశంలోని చిన్న, మధ్యతరహా పరిశ్రమలు వేల సంఖ్యలో వెలిశాయి. కొన్నింటికి వెబ్‌ సైట్‌ పెట్టుకొనే స్థోమత, అనుభవం లేవు, మరికొన్ని పెట్టుకున్నా అప్‌డేట్‌ చేయకపోవడం వల్ల ఆన్‌లైన్‌ బేరాలు వచ్చేవి కావు. సవాలక్ష కంపెనీల వెబ్‌సైట్లను చూసి కొనే సమయం, ఓపిక పెద్ద వ్యాపార సంస్థలకు లేదు. ఈ పరిస్థితిని తిరగరాసి చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఉత్పత్తులు-సేవలను మార్కెట్‌ చేయడంలో సహాయపడి చేయూతనివ్వాలని ఆలోచన చేశాడు దినేష్‌. మొదట్లో వెబ్‌సైట్‌ల ఉద్దేశ్యం అందరికీ అర్థం కాలేదు. ఇండియా మార్ట్‌లో తమ ఉత్పత్తులు పెట్టినంత మాత్రాన అది వారికి వ్యాపారాన్ని సృష్టించగలదన్న నమ్మకం లేదు. అయితే తక్కువ కాలంలోనే బిజినెస్‌ లీడ్స్‌ సృష్టించి అందర్నీ ఆకట్టుకుంది. కొన్నాళ్ళకు ఎస్‌ ఎం ఈ సంస్థల్లో ఇంటర్నెట్‌ అంటే ఇండియా మార్ట్‌ అనే భావం పాతుకుపోయేలా ఎదిగిందీ సంస్థ. నేడు 20 లక్షల సంస్థల వస్తు - సేవలను ఒకే వెబ్‌సైట్‌లో ప్రదర్శించి వివిధ ఉత్పత్తులు- సేవల జాబితా, అమ్మకం దారుల వివరాలు పొందుపరచి ఆన్‌లైన్‌ బి2బి మార్కెట్‌కే షహన్‌ షాగా అవతరించింది. దినేష్‌ ప్రయాణం విన్నాక ప్రతి వ్యాపారికీ ఒకటి అర్థం కావాలి. నేటి కష్టం రేపు ఉండదని..!.


5 కోట్ల వస్తు సేవలు

నేడు 80 శాతం కొనుగోళ్ళు- అమ్మకాలు స్మార్ట్‌ఫోన్‌ మాధ్యమం నుండి జరుగుతున్నాయి. సంస్థను బలోపేతం చేసేందుకు 2019లో ఐపీఓ లో షేర్‌ ఒక్కింటికి రూ.970 చొప్పున రూ.470 కోట్లను ప్రజలనుండి సేకరించింది. ఏడాది లో ఒక షేర్‌ రూ.3100 కి చేరుకుంది. 

నేడు దేశవ్యాప్తంగా 50 కార్యాలయాలు 2,500  మంది సిబ్బంది ఉన్నారు. 

40 లక్షల వ్యాపారస్తులు, ఐదు కోట్ల కొనుగోలుదారులతో .. ఐదు కోట్ల రకాల వస్తు-సేవల లావాదేవీలు  ఇండియా మార్ట్‌. కామ్‌లో జరుగుతున్నాయి. వార్తిక ఆదాయం వెయ్యి కోట్లు. 

అనేక అంకుర సంస్థల్లో పెట్టుబడి పెట్టి చేయూతనిస్తున్నాడు దినేష్‌ అగర్వాల్‌. 


సునీల్‌ ధవళ, 97417 47700 సీయీవో, 

ద థర్డ్‌ అంపైర్‌ మీడియా అండ్‌ అనలిటిక్స్‌


కుబేర

దినేష్‌ చంద్ర అగర్వాల్‌ 

ఇండియా మార్ట్‌ వ్యవస్థాపకుడు

Advertisement
Advertisement
Advertisement