Abn logo
Oct 17 2020 @ 04:53AM

సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల కోసం కసరత్తు

Kaakateeya

పరిశీలనలో 37 వేల ఎకరాలు

బ్రహ్మంసాగర్‌లో తేలియాడే సౌర పలకలు

జిల్లాలో 3 వేల మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం


కడప (సిటి), అక్టోబరు 16 : జిల్లాలో అదనంగా సోలార్‌ విద్యుదుత్పత్తి కోసం అధికారులు ప్లాంట్ల ఏర్పాటు కసరత్తు ముమ్మరం చేశారు. వ్యవసాయం, నివాస యోగ్యం కాని 35 వేల ఎకరాల పైచిలుకు ప్రభుత్వ భూమిని పరిశీలించారు. దీంతో పాటు బ్రహ్మంసాగర్‌ పరిసర ప్రాంతంలో మరో 1260 ఎకరాల్లో నీటిలో తేలియాడే పలకలను ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా 37 వేల ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపారు.  వ్యవసాయానికి 9 గంటల కరెంటు సహా ఇతరత్రా విద్యుత్‌ అవసరాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో జల, బొగ్గు ఆధారిత విద్యుత్‌తో పాటు సోలార్‌ విద్యుదుత్పత్తి అత్యవసరమైంది. సోలార్‌ విద్యుదుత్పత్తికి రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల్లో అనువైన స్థలాలు ఉంటాయని ప్రభుత్వం నిర్ణయించి ఆ మేర స్థలాల గుర్తింపునకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మూడు జిల్లాల్లో పది వేల మెగావాట్ల సోలార్‌ విద్యుదుత్పత్తి లక్ష్యంగా అధికారులు కసరత్తు ప్రారంభించారు.


ఐదు మండలాల్లో 35 వేల ఎకరాలు

జిల్లాలో అదనపు సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఐదు మండలాల్లో 35,976 ఎకరాలను పరిశీలించారు. కలసపాడు మండలంలో 20 వేల ఎకరాలు, చక్రాయపేటలో 4860, కాశినాయనలో 3750, మైలవరంలో 4500, బి.మఠం మండలంలో 2867 ఎకరాలు గుర్తించారు. ఈ మేరకు నెడ్‌క్యాప్‌ అధికారులు సంబంధిత శాఖకు వివరించారు. ఇందులో విద్యుత్‌ ప్లాంట్లకు అనువైన స్థలాన్ని గుర్తించే కసరత్తు ప్రారంభమైంది. ఈ స్థలాల్లో పొడుచుకు వచ్చిన రాళ్లతో ఉన్న గుట్టలు విద్యుత్‌ప్లాంట్లకు అనువుగా ఉండవు. కాగా ప్రస్తుత ం గుర్తించిన స్థలంలో 40 శాతం పైబడి అనువుగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


బ్రహ్మంసాగర్‌లో నీటిలో తేలియాడే పలకలు

బ్రహ్మంసాగర్‌ రిజర్వాయరు ప్రాంతంలో 1260 ఎకరాల విస్తీర్ణంలో నీటిలో తేలియాడే సౌర పలకలను ఏర్పాటు చేయనున్నారు. ఒకవేళ రిజర్వాయరుకు అధికంగా నీరు వచ్చినా ఈ పలకలు నీటిలో తేలియాడుతూనే విద్యుదుత్పత్తి చేయగలవు. మొత్తంమ్మీద 37,236 ఎకరాల ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.


3 వేల మెగా వాట్ల ఉత్పత్తి

జిల్లాలో ఇప్పటికే గాలివీడు, మైలవరం మండలాల్లో 1500 మెగావాట్ల లక్ష్యంతో ప్లాంట్లు పనిచేస్తున్నాయి. కాగా ఇప్పటికే దాదాపు వెయ్యి మెగావాట్లు ఏపీ గ్రిడ్‌కు అనుసంధానమైంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న సౌర విద్యుత్‌ ప్లాంట్ల ద్వారా అదనంగా మరో 3 వేల మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement