Abn logo
Jun 3 2020 @ 23:50PM

చిన్న ఎన్టీఆర్‌ పేరు చెడగొడుతున్నారు!

తారక్‌ (చిన్న ఎన్టీఆర్‌) పేరును ఆయన అభిమానులు సర్వనాశనం చేస్తున్నారని కథానాయిక మీరా చోప్రా మండిపడ్డారు. ట్విట్టర్‌ వేదికగా తనపై యాసిడ్‌తో దాడి చేస్తామనీ, సామూహిక అత్యాచారానికి ఒడి గడతామనీ, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడిన తారక్‌ అభిమానులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా హక్కుల సంఘం అధ్యక్షురాలు రేఖా శర్మ సహా హైదరాబాద్‌ (సైబర్‌ క్రైమ్‌) పోలీసులను ఆమె కోరారు. సదరు ట్విట్టర్‌ ఖాతాలపై ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌ ఫైల్‌ చేయడంలో తనకు సహకరించిన జాతీయ మహిళా హక్కుల సంఘానికి, రేఖా శర్మకు మీరా చోప్రా కృతజ్ఞతలు తెలిపారు. 


వివాదానికి కారణమేంటి? 

వివరాల్లోకి వెళితే... ఇటీవల ట్విట్టర్‌లో ప్రేక్షకులతో మీరా చోప్రా ముచ్చటించారు. ఆ సమయంలో తెలుగులో మీకు ఇష్టమైన కథానాయకుడు ఎవరని ప్రశ్నించగా మహేశ్‌బాబు పేరు చెప్పారామె. మరో నెటిజన్‌ ప్రశ్నకు తారక్‌ ఎవరో తెలియదనీ, తాను తారక్‌ అభిమానిని కాదని ఆమె సమాధానం ఇచ్చారు. దాంతో కొందరు మీరా చోప్రాను ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. 


వేశ్యతో పోలుస్తారా?

తనను వేశ్యతో పోల్చడం, తన కుటుంబ సభ్యులకు కరోనా రావాలని శాపనార్థాలు పెట్టడం పట్ల మీరా చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీకంటే మహేశ్‌బాబును ఎక్కువ ఇష్టపడుతున్నానని చెప్పినందుకు నన్ను వేశ్య, తిరుగుబోతు, శృంగార తారగా అభివర్ణిస్తారని నాకు తెలియదు. మీ అభిమానులు నా తల్లితండ్రులు కరోనా మరణించాలని శాపనార్థాలు పెడుతున్నారు. ఇలాంటి అభిమాన గణంతో మీరు విజయవంతమైనట్టు భావిస్తున్నారా?’’ అని ట్విట్టర్‌ వేదికగా చిన్న ఎన్టీఆర్‌ను మీరాచోప్రా ప్రశ్నించారు. ‘‘తారక్‌ అభిమాని కాకపోవడం నేరమని తెలియదు. అమ్మాయిలందరికీ ఓ విషయం గట్టిగా చెప్పాలనుకుంటున్నా... మీరు తారక్‌ అభిమాని కాకపోతే, ఆయన అభిమానులు ట్వీట్‌ చేసినట్టు మీ తల్లితండ్రులు మరణించవచ్చు. మీరు అత్యాచారానికి, హత్యకు గురికావచ్చు. తమ అభిమాన కథానాయకుడి పేరును ఇటువంటి అభిమానులు సర్వనాశనం చేస్తున్నారు’’ అని మీరా చోప్రా ట్వీట్‌ చేశారు. అసభ్యకర రీతిలో ట్వీట్స్‌ చేసిన అభిమానులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను, సదరు ఖాతాలను తొలగించాలని ట్విట్టర్‌ను ఆమె కోరారు.


నటుడిగా ఎన్టీఆర్‌ అంటే గౌరవమే!

నటుడిగా తారక్‌ అంటే తనకు గౌరవం ఉందనీ, అభిమానులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో ఆయన తెలుసుకోవాలనే ట్విట్టర్‌లో ఎన్టీఆర్‌కు ట్యాగ్‌ చేస్తున్నానని మీరా చోప్రా తెలిపారు. ఇటువంటి పోకిరి చర్యలకు దూరంగా ఉండాల్సిందిగా అభిమానులకు చెప్పడం ఎన్టీఆర్‌ బాధ్యతని ఆమె అన్నారు. మీరా చోప్రాకు గాయని చిన్మయి సహా పలువురు మద్దతు తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement