Abn logo
May 26 2021 @ 18:12PM

ఆగని చితిమంటలు.. ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉందో కళ్లకు కట్టినట్టు చెప్పిన శ్మశాన వాటిక ఉద్యోగి

ప్రస్తుతం భారతీయుల కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పీడకల కరోనా. గతేడాదితో పోలిస్తే ఇప్పుడు దేశం నలుమూలలా ఈ మహమ్మారి సృష్టిస్తున్న విలయం ఎన్నో రెట్లు భయానకంగా మారింది. దేశ రాజధాని ఢిల్లీ కూడా దీనికి అతీతమేం కాదు. ఈసారి ఢిల్లీ మీద కూడా కరోనా గట్టిగానే దెబ్బ కొట్టింది. గతంలో కూడా కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఢిల్లీ ఒకటన్న విషయం గుర్తుంది కదా. ఈసారి కూడా అలాగే జరిగింది. కానీ నష్టం మాత్రం ఎన్నో రెట్లు పెరిగింది. గతేడాది జూన్‌ 18న దేశంలో 11వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 60 రోజులూ రోజుకు సగటున 35వేల కేసులు రికార్డయ్యాయి. అదే ఘోరం అనుకుంటే.. ఈసారి పరిస్థితి విషమించింది. ఫిబ్రవరి 10న దేశవ్యాప్తంగా 11వేల కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఆ తర్వాత 50రోజులపాటు దేశంలో సగటున రోజుకు 22వేల కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత పదిరోజులైతే సగటున రోజుకు 89,800 కరోనా కేసులు వెలుగు చూశాయి.


దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న రాష్ట్రాల్లో దేశరాజధాని ఢిల్లీ కూడా ఒకటి. ఇక్కడ మార్చి 30న 992 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఒక్క రోజు కూడా కరోనా కేసులు తగ్గలేదు. రోజురోజుకూ పరిస్థితి దిగాజారి ఏప్రిల్ 20న అత్యధికంగా 28,395 కరోనా కేసులు వెలుగు చూశాయి. గతేడాది మార్చిలో కరోనా మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఢిల్లీలో ఒకేరోజులో ఇన్ని కేసులు నమోదవడం ఎన్నడూ జరగలేదు. ఇక్కడ పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయి. దానికి తోడు ప్రజల అవసరాలు తీర్చడం తప్పనిసరి కావడంతో చాలా మంది ఉద్యోగులకు సెలవులు కూడా దొరకడం లేదు. ఢిల్లీలోని శ్మశాన వాటికల్లో అయితే అసలు ఖాళీ లేకుండా పోయింది. డే, నైట్ షిఫ్టులు పనిచేసినా శవాల రాకకు అంతం ఉండటం లేదు. చితిమంటలు ఆరడం లేదు.

కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశరాజధాని ఎంతలా విలవిల్లాడుతోంది? అని ప్రశ్నించగా ఇక్కడ ఒక శ్మశాన వాటికలో పనిచేసే ఉద్యోగి నోరువిప్పాడు. ఇక్కడ స్థానికంగా సారాయ్ కాలే ఖాన్ అనే శ్మశాన వాటిక ఉంది. దానిలో 31 చితులు ఏర్పాటు చేయవచ్చు. దాని సామర్థ్యం అంతే. కానీ ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఇక్కడ ఒకేసారి వంద మందికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని స్మశాన వాటిక ఉద్యోగి చెప్పాడు. 24గంటలూ స్మశానం పని చేస్తూనే ఉందని, పనివాళ్ల షిఫ్టులు సైతం 20గంటలపైగా సాగుతున్నాయని అతను తెలిపాడు. ఇంత చేసినా సరే శ్మశానానికి వస్తున్న శవాల ధార ఆగడం లేదట. గడిచిన 15 రోజుల పరిస్థితులనే పరిగణనలోకి తీసుకున్నా కూడా.. పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయంటున్న ఈ శ్మశాన వాటిక ఉద్యోగి ఇంకా ఏం చెప్పాడంటే..

‘‘ఈ కరోనా మహమ్మారి లేనప్పుడు సాధారణంగా ప్రతి రోజూ 6-8 మృతదేహాలు అంత్యక్రియల కోసం వచ్చేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రతి రోజూ ఎలా లేదన్నా 60-70 మృతదేహాలు వస్తున్నాయి. ఇంత చేసినా శ్మశాన వాటిక ముందు డెడ్‌బాడీలతో వేచి చూస్తున్న కుటుంబాల సంఖ్య తగ్గడం లేదు. అది పెరుగుతూనే ఉంటోంది. అన్ని శరీరాలకు అంత్యక్రియలు నిర్వహించే సరికి కనీసం నిద్ర కూడా పోలేక పోతున్నాం. పడుకోవాలంటే భయంగా ఉంది’’ అని ఆ ఉద్యోగి తన మనసులో మాట బయటపెట్టాడు. శ్మశానాల్లో ఒక చోట చితి మంటలు ఆరిపోయే లోపు మరో చోట ఎగసి పడుతున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు, జలపాతాలవుతున్న కళ్లు.. ఇవన్నీ చూస్తే మనసు తరుక్కుపోతోందని, నిద్ర కూడా కరవు అవుతోందని అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఈ పరిస్థితులు చూసి భయంతో ఉద్యోగం మానేయాలని అనుకున్నానని, కానీ చాలా మంది అదే పని చేయడంతో శ్మశానంలో పనివారు కరువయ్యారని ఆ ఉద్యోగి చెప్పాడు. ఇంత మంది చనిపోతున్న తరుణంలో ఈ పని చేయడానికి ఎవరూ లేకపోతే ఎలా? ఎవరో ఒకరు ఈ భారం మోయాలి కదా.. అనే ఉద్దేశ్యంతోనే ఉద్యోగం చేస్తున్నాడట అతను. ‘‘కరోనాతో ఇంత మంది మృతదేహాలు వస్తుంటే.. చాలా రోజులు నిద్ర కూడా పోలేకపోయా. కళ్ల ముందు మండుతున్న చితులే కదలాడేవి. ఏం చేయాలో కూడా అర్థం కాలేదు’’ అంటున్న ఈ ఉద్యోగి.. ఒక్కోరోజు 20గంటలపైగా పని చేసి, ఇంటికి వెళ్తే సంతోషంగా కుటుంబాన్ని కూడా కలిసే పరిస్థితి ఉండటం లేదన్నాడు. తమ వల్ల కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకే ప్రమాదం ఉందనే ఆందోళన మనసును పట్టి పీడిస్తూనే ఉంటుందని చెప్పాడు. రెండు మాస్కులు ధరించి, గ్లౌవ్స్ వేసుకొని పని చేసి, ఇంట్లోకి వెళ్లే ముందు శరీరం మొత్తం శుభ్రం చేసుకున్నా సరే కుటుంబ సభ్యులను ఆ చేతులతో పట్టుకోవాలంటే భయం మాత్రం తగ్గడం లేదట.

అలాగే ఢిల్లీకే చెందిన మృతదేహాలను తీసుకెళ్లే ఒక వాహనం డ్రైవరు కూడా ప్రస్తుత పరిస్థితులపై భయభ్రాంతులను వ్యక్తం చేశాడు. ఒక్కోసారి రోజుకు 20 మృతదేహాలను స్మశానానికి తీసుకెళ్లాల్సి వస్తుందని చెప్పిన ఈ డ్రైవర్.. ఈ ఘోరాలు చూడలేక చాలా మంది అంబులెన్సు డ్రైవర్లు ఉద్యోగాలు మానేశారని చెప్పాడు. ఉన్న వాళ్లమే పని పంచుకుంటున్నామని అన్నాడు. వయసులో ఉన్న యువకులు చనిపోవడం చూస్తుంటే మనసు ద్రవించిపోతుందని, ప్రస్తుతం వైద్య రంగ పరిస్థితులు చూస్తుంటే భయమేస్తోందని చెప్పాడు. ‘‘ఒక్కోసారి నా అంబులెన్సులో 10-12 మృతదేహాలు కుప్పగా వేసేస్తారు. అవి చూసినప్పుడు మనసంతా ఏదోలా అయిపోతుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి. నేనసలు ఎక్కడున్నాను? ఎందుకు ఇలా జరుగుతోంది? నేనేమీ చేయలేకపోతున్నాననే బాధ.. ఇక ఆరోజు నిద్ర కూడా ఉండదు’’ అని ఆవేదనకు లోనయ్యాడు.

ప్రస్తుతం వ్యాక్సినేషన్ కారణంగా ఢిల్లీ నగరం నెమ్మదిగా కోలుకుంటోంది. ఇక్కడ గడిచిన మూడు నాలుగు రోజుల నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీనికి కారణం రాష్ట్రంలో అమలు చేస్తున్న లాక్‌డన్ అని నిపుణులు అంటున్నారు. ఈ నెల 31 వరకూ ఇక్కడ లాక్‌డౌన్ అమలవుతుంది. ఆ తర్వాత పరిస్థితిని బట్టి దీనిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ క్రమంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా ఒక ట్వీట్ చేశారు. కరోనా సెకండ్ వేవ్ నియంత్రణలోకి వచ్చిందని, మూడో వేవ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నామని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే 6వేల ఆక్సిజన్ సిలిండర్లు దిగుమతి చేసుకుంది ఢిల్లీ ప్రభుత్వం. ఈసారి ఎలాగైనా కరోనాను ఆదిలోనే నియంత్రించి, పరిస్థితి చేయి దాటకుండా చూసుకోవాలని భావిస్తోంది.

ప్రత్యేకంమరిన్ని...

క్రైమ్ మరిన్ని...