‘సిరివెన్నెల’ తొలి పాట ఇలా రికార్డ్‌ అయింది

విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం

ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం ఓం 

కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం 

ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం

సరస స్వర సుర ఝరీ గమనమౌ సామవేద సారమిది

నే పాడిన జీవన గీతం ఈ గీతం..


కొత్త రచయిత సీతారామశాస్త్రి రాసిన తొలి సినిమా పాట ఇది. కళాతపస్వి కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకొనే ‘సిరివెన్నెల’  చిత్రం కోసం ఆయన ఈ పాట రాశారు. పాట రాసే ముందు సీతారామశాస్త్రితో ‘మీరు సినిమా రంగానికి, సినిమా పాటకు కొత్త. ఇక్కడ కొన్ని పద్ధతులు, నియమాలు ఉంటాయి. వాటికి అలవాటు కావడానికి మీకు టైమ్‌ పడుతుంది. అందుకే ఈ మొదటి పాటను మీకు తోచిన పద్ధతిలో రాయండి. ఈ పాటను బట్టి మామ (కె.వి.మహదేవన్‌) ట్యూన్‌ కడతాడు. మీరు కథ విన్నారు కదా. ఈ పాటను హీరో మీద చిత్రీకరిస్తాం. అతను అంధుడు. వేణునాధ విద్వాంసుడు. పక్కనే ఉన్న అతని చెల్లెలు కూడా ఈ పాట పాడుతుంది. ఇది దృష్టిలో పెట్టుకుని మీరు పాట రాయండి’ అన్నారు విశ్వనాథ్‌. ఆయన చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకుని అద్భుతంగా ఆ పాట రాసి ఇచ్చారు సీతారామశాస్త్రి. 


1985 అక్టోబర్‌ 4న ఈ పాటను రికార్డ్‌ చేశారు సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్‌. పాట సాహిత్యం ఎంత బాగుందో, అంతకంటే అద్భుతంగా పాడారు  సుశీల, బాలసుబ్రహ్మణ్యం. పాటలో వేణునాదాన్ని వినిపించింది హరిప్రసాద్‌ చౌరాసియా. ఈ పాటతో ఉత్తమ గాయకుడిగా బాలు నంది అవార్డ్‌ అందుకోవడం విశేషం. 

-వినాయకరావు

స్టిల్స్‌: జి. నారాయణరావు
Advertisement
Advertisement