Abn logo
May 10 2020 @ 13:35PM

అమ్మకి బిడ్డలే ప్రాణం

చరణంలా సాగే చెట్టంత కొడుకు.. పల్లవిలా అల్లుకుపోయే ముద్దుల కూతురు.. గాయని సునీత ఇల్లంతా పాటల పూదోటలా పరిమళిస్తోందిప్పుడు. ఈ లాక్‌డౌన్‌ ఆమెకు రెండు పండగలను తెచ్చింది. ఒకటి.. ఈ రోజు తన పుట్టిన రోజు. రెండు.. ఇదే రోజు మదర్స్‌ డే. ఇలాంటి అరుదైన సమయంలో అమ్మ తన దగ్గరుంది. పిల్లలూ కళ్లముందే ఉన్నారు. ఇంత అదృష్టం ఏ తల్లికి వస్తుంది? అనడిగితే ఉప్పొంగిన అమ్మ మనసుతో ముచ్చటించింది ఇలా..


అమ్మ అనగానే ఎవరికైనా సరే మొదట కన్నీళ్లు వస్తాయి. అమ్మ మీదుండే ప్రేమ, అభిమానం, ఆప్యాయత దీనికి కారణం కావచ్చు. కడుపులో బిడ్డను మోస్తున్నప్పటి నుంచే అమ్మ త్యాగాలు మొదలవు తాయి. తన ఆరోగ్యం కాదు బిడ్డల ఆరోగ్యమే ముఖ్యం అనుకుంటుంది. తన ఉనికి కన్నా బిడ్డల అస్థిత్వమే ముఖ్యమని విశ్వసిస్తుంది. తల్లి ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సరే పిల్లల ఆనందం కోసమే తపిస్తుంది. తల్లికి ఆడబిడ్డా, మగబిడ్డా అనే తేడా ఉండదు. ఎవరినైనా ప్రాణం పెట్టి చూసుకుంటుంది. ఇలా తల్లికి ప్రతి దశలో పిల్లలే తొలి ప్రాధాన్యం. ఆ తరవాతే ఎవరైనా.


లాక్‌డౌన్‌ వల్ల మా అమ్మానాన్నా, పిల్లలిద్దరూ ఒకేచోట ఉంటున్నాం. బాబు ఆకాశ్‌ గతేడాదే యుఎస్‌లో డిగ్రీ పూర్తిచేశాడు. వాళ్ల యూనివర్సిటీకే సంబంధించిన జాబ్‌ దిల్లీలో చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ పుణ్యమాని ఇంటికి వచ్చాడు. నాలుగేళ్లుగా ఇంటి భోజనానికి దూరంగా ఉన్నాడు కదా. అందుకే వాడికి ఇష్టమైనవన్నీ వండించుకుంటున్నాడు. పులిహోర, దొండకాయ కూర, బంగాళాదుంప - ఉల్లిగడ్డ కూర, ఆలూ పరాఠా, పాలక్‌ పన్నీర్‌ ఇలా. పాప శ్రేయ.. ‘సవ్యశాచి’ సినిమాలో ఓ పాట పాడింది. కీరవాణి గారి సంగీత నిర్దేశకత్వంలో పాప తొలి పాట రావడం శుభసూచకం. ఇద్దరూ ఇంకా చదువుల్లోనే ఉన్నారు. భవిష్యత్తులో ఏమవ్వాలనేది వాళ్లకే వదిలేశా. మొన్నే అమ్మ ఆవకాయపెట్టింది. కొత్తావకాయతో పిల్లలు పండగ చేసుకుంటున్నారు. లాక్‌డౌన్‌ వల్ల అందరం కలిసి ఉండడం బాగుంది. కానీ ఇదే ఎక్కువ కాలం కొనసాగితే అందరికీ నష్టమే కదా.

టీనేజ్‌ పిల్లలు మన నుంచి క్రమంగా ఐసొలేట్‌ అయిపోతారు. వాళ్ల ప్రపంచాన్ని సృష్టించుకుంటారు. మనతో గడపడం తగ్గిస్తారు. అయినా తల్లి ఊరికే ఉండకూడదు. తనే వాళ్ల ప్రపంచంలోకి వెళ్లాలి. నీకెప్పటికీ నేనున్నాననే భరోసా ఇవ్వాలి. పిల్లలు అమ్మ ఉందిలే, ఏ కష్టం వచ్చినా తను చూసుకుంటుందిలే అన్న ధైర్యంతో ఉండగలగాలి. పిల్లల దగ్గర మనం పెద్దోళ్లమని ఈగోలకు పోకుండా మన తోటివాళ్లే అనుకుంటే దూరం ఏర్పడదు. 


కన్నీళ్లు చూడలేదు...

నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో మా అమ్మ సుమతి పాత్ర ఎంతో ఉంది. కుటుంబంలో ఎన్ని రకాల సమస్యలు వచ్చినా, చిన్నప్పుడు ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడ్డా కూడా అలా నిలబడింది. ధైర్యంగా తట్టుకుంది. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. తన కన్నీళ్లని ఇప్పటి వరకూ మాకు చూపించలేదు. నేను కూడా ఈ విషయంలో అమ్మనే ఫాలో అయ్యా. నా పర్సనల్‌ లైఫ్‌ ఎన్ని ఒడిదొడుకులకు గురైనా పిల్లలపై ఆ ప్రభావం ఉండకుండా జాగ్రత్తపడ్డా. మన కష్టాలు, కన్నీళ్లు నాలుగ్గోడల మధ్యే ఉండాలని గట్టిగా నమ్ముతాను. ఏదైనా మంచి విషయం అయితే అందరికీ చెప్పేయొచ్చు. మన సమస్యలు ఎదుటివారికి ఎందుకు చెప్పుకోవాలి. పిల్లలకూ అదే చెబుతాను. కష్టాలు లేని వ్యక్తులు ఈ భూమ్మీద ఉండరు. కాబట్టి మన కష్టాల గురించి వేరే ఎవరితోనూ చెప్పుకోకూడదు. వాటిల్లోంచి బయటికి ఎలా వచ్చామనే సక్సెస్‌ స్టోరీలే పంచండి అంటాను. ఓ వ్యక్తితో మన బాధలు చెబితే అది ‘ఎమోషనల్‌ డిపెండెన్సీ’కి దారితీస్తుంది. అది జీవితంలో మంచిది కాదు. అయితే మనం ఎక్కడో అడవుల్లో లేం. సమాజంలో ఉన్నాం. మనుషులు కావాలి. వాళ్లతో బంధాలూ ఉండాలి. కానీ ప్రతి చిన్న సమస్యనీ భూతద్దంలో చూసి ఎవరో ఒకరు వచ్చి సాయం చేయాలని ఆశిస్తే ఇబ్బదులే ఎదురవుతాయి.బాల్యం తిరిగిరాదు...

ఓ తల్లిగా నాకు ఎలా అన్పిస్తుందంటే.. ఏదైనా తిరిగి పొందవచ్చు. కానీ పిల్లల బాల్యాన్ని తిరిగి ఇవ్వలేం. చిన్నప్పుడు సైక్లింగ్‌ చేయలేకపోయినా ఇప్పుడు నేర్చుకోవచ్చు. అలాగే నృత్యం రాకపోయినా నేడు సాధన చేయవచ్చు. ఇలా ఏదైనా చిన్నప్పుడు చేయంది పెద్దయ్యాక చేయొచ్చు. కానీ బాల్యం మాత్రం తిరిగిరాదు. పిల్లల బాల్యం టెన్షన్‌ ఫ్రీగా, చక్కగా సాగాలని మొదటినుంచీ అనుకున్నాను. అలాగే చేశాను. వాళ్లు తమ బాల్యానికి సంబంధించి సంతోషంగా ఉన్నారు. అందుకే నేనూ హ్యాపీ. లోపల ఎలా ఉంటానో బయటకి అదే రిఫ్లెక్ట్‌ అవుతుంది నాలో. జీవితం ఓ పాఠం లాంటిది రోజూ ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉండాలి. నాకన్నీ తెలుసని అనుకుంటే ఏమీ చేయలేం. 


అమ్మ పాట పాడాలి..

ఇప్పటి వరకు అమ్మ ఔన్నత్యాన్ని చెప్పే పాటలు ఒకటో రెండో తప్ప ఎక్కువగా లేవు. అసలు అమ్మ గురించి రాయడానికి మాటలు సరిపోతాయా. ఏమని రాయాలి, ఎంతని రాయాలి.. అయినా భవిష్యత్తులో అమ్మను కీర్తిస్తూ ఎవరైనా రాస్తే ఆ పాటను పాడే అవకాశం నాకే రావాలని కోరుకుంటున్నా.


ఈరోజు నా పుట్టినరోజు. నేను పుట్టిన రోజు అంటే అమ్మకి పునర్జన్మే కదా. ఇది నాకే కాదు అందరికీ వర్తిస్తుంది. ఇలా రెండు రోజులూ ఒకే రోజు రావడం మహా సంతోషంగా ఉంది. సాటి అమ్మలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు...

Advertisement
Advertisement
Advertisement