Abn logo
Oct 13 2020 @ 01:43AM

మండల పరిషత్‌ కార్యాలయంలో అధికారుల కొరత

పెద్దేముల్‌: మండల పరిషత్‌ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. కేవలం ఎంపీడీవో, జూనియర్‌ అసిస్టెంట్‌, ఎంపీఈవో మాత్రమే ఉన్నారు. ఇతర అధికారులు, సిబ్బంది కొరత ఉండడంతో పనులు ముందుకు సాగడం లేదు. ప్రస్థుతం గ్రామాల్లో సర్వే కొనసాగుతున్న వేళ ఇక్కడ అధికారులు, సిబ్బంది లేకపోవడంతో పర్యవేక్షణ కరువైంది. పెద్దేముల్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయి. సూపరింటెండెంట్‌ ఉన్నప్పటికీ ఆయనను మరోచోటుకు డిప్యూటేషన్‌పై పంపడంతో ఆపోస్టు ఇక్కడ ఖాళీగానే ఉంది.


ఇక్కడ సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కృష్ణారావు కొద్ది రోజుల క్రితం బదిలీపై వెళ్లడంతో అదికూడా ఖాళీ ఏర్పడింది. ఇక అటెండర్‌ పోస్టులు ఇక్కడ మూడు ఉన్నా ఒక్కరు మాత్రమే పనిచేస్తున్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో టైపిస్టు పోస్టు ఉన్నా అది కూడా ఖాళీ అయింది. దీంతో నామమాత్రంగా కంప్యూటర్‌ ఆపరేటర్‌ను నియమించుకుని అధికారులు వారితో పనులు చేయించుకుంటున్నారు. అధికారులు, సిబ్బంది లేక మండల పరిషత్‌ కార్యాలయం బోసిపోయి కుర్చీలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఇక్కడ పూర్తిస్థాయిలో అధికారులు, సిబ్బందిని నియమించాలని మండల ప్రజలు కోరుతున్నారు. 

Advertisement
Advertisement