Abn logo
Apr 3 2020 @ 20:42PM

చరణ్ వాయిస్ లేకుండానే ఆర్ఆర్ఆర్ ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

రామ్ చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ‘రౌద్రం రణం రుధిరం’ (ఆర్ఆర్ఆర్) టీమ్ విడుదల చేసిన స్పెషల్ వీడియో మెగా, నందమూరి అభిమానులనే కాకుండా ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ వాయిస్ ఈ వీడియోకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చరణ్ బర్త్‌డే రోజు ఎన్టీఆర్ ఇచ్చిన మెగా సర్‌ప్రైజ్‌కి అందరూ ఫిదా అయ్యారు. ఇక రాబోయే యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డేకి ఈ టీమ్ ఎటువంటి సర్‌ప్రైజ్ ఇస్తుందో అని అంతా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అసలు ఎలాంటి సర్‌ప్రైజ్ ఇస్తారో అనే ఊహలకి కూడా అంతే లేదంటే నమ్మాలి మరి. కొందరైతే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ లుక్ ఇలా ఉండబోతుంది అంటూ కొన్ని స్కెచ్‌లు కూడా విడుదల చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ బర్త్‌డేకి రాబోయే స్పెషల్ వీడియో గురించి ఇప్పుడొక వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తుంది.


ఈ వీడియోలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఉండదని అంటున్నారు. ఎన్టీఆర్ స్వయంగా చెప్పే డైలాగ్‌తో పాటు, చిరుతపులితో చేసే ఫైట్ సీన్‌కు సంబంధించిన విజువల్స్‌ని చూపించనున్నారట. ఎన్టీఆర్ బర్త్‌డేకి విడుదల చేయబోయే వీడియోపై ఇప్పటికే దర్శకధీరుడు దృష్టి పెట్టాడని, మెగా అభిమానులను ఎలా అయితే సర్‌ప్రైజ్ చేశారో.. నందమూరి అభిమానులు కూడా ఎప్పటికీ గుర్తు పెట్టుకునే విధంగా ఈ వీడియో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. రాజమౌళి ఏం చేసినా కొత్తగానే ఉంటుంది. మరి ఈ ఎన్టీఆర్ స్పెషల్ వీడియోతో ఎలా సర్‌ప్రైజ్ చేయబోతున్నాడో తెలియాలంటే మే 20 వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement
Advertisement
Advertisement