Abn logo
Sep 28 2021 @ 18:44PM

సిద్ధూ ఓ మానవ బాంబు : ఎస్ఏడీ

న్యూఢిల్లీ : పంజాబ్ కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్ధూ ఓ మానవ బాంబు అని శిరోమణి అకాలీ దళ్ (ఎస్ఏడీ) ఆరోపించింది. పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి సిద్ధూ రాజీనామా చేసిన నేపథ్యంలో ఘాటుగా స్పందించింది. ఎస్ఏడీ అధికార ప్రతినిధి మంజిందర్ సింగ్ సిర్సా ఓ ట్వీట్‌లో సిద్ధూపై విరుచుకుపడ్డారు. 


సిర్సా ఇచ్చిన ట్వీట్‌లో, సిద్ధూ స్థిరత్వం లేని వ్యక్తి అని ఆరోపించారు. ఆయన ఓ మానవ బాంబు అని, ఆయన ఎక్కడికెళ్తే అక్కడ పేలిపోతారని దుయ్యబట్టారు. 


ఎస్ఏడీ ప్రెసిడెంట్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కూడా సిద్ధూపై మండిపడ్డారు. సిద్ధూ ఓ మిస్‌గైడెడ్ మిసైల్ అని ఆరోపించారు. 


పంజాబ్ ముఖ్యమంత్రి పదవికి కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా తర్వాత దళిత నేత చరణ్‌జిత్ సింగ్ చన్ని ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే. ఓ దళిత నేత ముఖ్యమంత్రి పదవిని చేపట్టడాన్ని సిద్ధూ సహించలేకపోతున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఆరోపించింది. ఆప్ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ విలేకర్లతో మాట్లాడుతూ, నవజోత్ సింగ్ సిద్ధూ దళిత వ్యతిరేకి అని తాజా పరిణామాలతో స్పష్టమవుతోందన్నారు. ఓ నిరుపేద బిడ్డను ముఖ్యమంత్రిని చేశారన్నారు. దీనిని సిద్ధూ సహించలేకపోతున్నారన్నారు. ఇది చాలా విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 


ఇవి కూడా చదవండిImage Caption