Abn logo
Feb 26 2020 @ 05:08AM

చిచ్చర పిడుగల్లే..

‘స్మృతి మంధాన లేకపోవడంతో బాధ్యత తీసుకోవాలనుకున్నాను. వీలైనంత వేగంగా పరుగులు సాధించాలన్న లక్ష్యంతో ఆడా..’ బంగ్లాపై గెలిచిన తర్వాత షఫాలీ వర్మ చేసిన వ్యాఖ్య ఇది. తీవ్ర ఒత్తిడి నెలకొనే ప్రపంచ కప్‌లాంటి మెగా ఈవెంట్‌లో ఆడుతూ 16 ఏళ్ల వయస్సులోనే వర్మ తీసుకున్న బాధ్యత ఇది. నిజానికి మహిళల క్రికెట్‌లో స్టార్‌ బ్యాట్స్‌వుమెన్‌ ఎంతమంది ఉన్నా గత వారం రోజుల నుంచి మాత్రం షఫాలీ పేరు మార్మోగుతోంది. కారణం.. ఈ టీనేజర్‌ ఫియర్‌లెస్‌ ఆట తీరే.. జట్టుకు ప్రపంచకప్‌ అందించే వరకు ఇలాగే ఆడతానంటూ ప్రత్యర్థులకు షఫాలీ గట్టి సవాల్‌  విసురుతోంది.


టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళలు వరుసగా రెండు విజయాలు సాధించారు. దీనికి ప్రధాన కారణం బౌలింగ్‌లో వెటరన్‌ పూనమ్‌ యాదవ్‌ అయితే బ్యాటింగ్‌లో మాత్రం అంచనాలకు మించి రాణిస్తున్న 16 ఏళ్ల షఫాలీనే. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌లపై టోర్నీకి ముందు అందరికీ భారీ అంచనాలు ఉండేవి. స్మృతి ఆడిన ఒక్క మ్యాచ్‌లో విఫలం కాగా, హర్మన్‌ పేలవ ఫామ్‌ కొనసాగిస్తోంది. కానీ షఫాలీ (హరియాణా) మాత్రం పవర్‌గేమ్‌కు మారుపేరుగా నిలుస్తూ భయమంటే తెలీకుండా ఆడుతోంది. వయస్సుకు మించిన ఆటను ప్రదర్శిస్తూ తొలి బంతి నుంచే ఎదురుదాడికి దిగి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచుతోంది. ఆరంభ మ్యాచ్‌లో భారత్‌ చేసింది 132 పరుగులే అయినా అందులో షఫాలీ 15 బంతుల్లో చేసిన 29 పరుగులు అత్యంత కీలకం. ఆమె ధాటికి 4 ఓవర్లలోనే జట్టు 40 పరుగులు సాధించింది. ఆ తర్వాత మధ్య ఓవర్లలో కాస్త నిదానంగా ఆడినా ఈ మెరుపు ఆరంభం జట్టుకు భరోసానిస్తోంది. ఇక బంగ్లాపై అయితే ఆమె ఆడిన షాట్లు అద్భుతం. 


సెహ్వాగ్‌ శైలిలో..

మహిళల క్రికెట్‌లో బంతిని బలంగా బాదేవారు అత్యంత అరుదుగా కనిపిస్తారు. ఆ అరుదైన జాబితాలో ఈ టీనేజ్‌ సంచలనం కూడా ఉంటుంది. అచ్చు సెహ్వాగ్‌ను తలపించే శైలిలో కచ్చితమైన స్ట్రోక్‌ప్లేతో తను ఆడే షాట్లు వహ్వా.. అనిపిస్తుంటాయి. నెంబర్‌వన్‌ టీ20 బౌలర్‌ మెగాన్‌ షట్‌ ఓవర్‌లో మూడు ఫోర్లు బాదిన విధానం.. బంగ్లాపై పవర్‌ప్లేలోనే నాలుగు సిక్సర్లను స్లాండ్స్‌లోకి పంపిన నైపుణ్యం విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇంత చిన్న వయస్సులో ఆమె ఆడే తీరును ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. రెండో మ్యాచ్‌లో మంధాన లేని లోటును తెలీకుండా ఆడి శభాష్‌ అనిపించుకుంది. అటు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా షఫాలీకి పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ‘లైసెన్స్‌ టు కిల్‌’ తరహాలో సహజశైలిలో చెలరేగమని చెప్పడం ఆమె ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచినట్టయింది. ఆ వయసులో తాను కనీసం క్రికెట్‌లో శిక్షణ కూడా తీసుకోలేదని, 30 ఏళ్ల పేసర్‌ శిఖా పాండే అంటుంటే.. క్రీజులో షఫాలీని చూస్తుంటే తానే జూనియర్‌లా భావిస్తానని జెమీమా కొనియాడుతోంది. 


ఆరు నెలల క్రితం అంచనాల్లోనే లేదు..

గతేడాది మహిళల జట్టు కివీస్‌, ఇంగ్లండ్‌లతో తమ టీ20 సీజన్‌ను ఆరంభించినప్పుడు షఫాలీ పేరు ఊసులో కూడా లేదు. ఈ మెగా ఈవెంట్‌లో సరైన కూర్పును పరిశీలించేందుకు ఓపెనింగ్‌లో మంధానకు జతగా హర్లీన్‌ డియోల్‌ను తీసుకున్నారు. అయితే ఆ ప్రయోగం సక్సెస్‌ కాలేదు. ఇక టీ20 ప్రపంచక్‌పకు సరిగ్గా ఆరు నెలల ముందు వర్మ గత సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాపై అరంగేట్రం చేసింది. అయితే డకౌట్‌తో ఆరంభించినా ఆ తర్వాత వరుసగా ఐదు ఇన్నింగ్స్‌లో 50కి పైగా సగటుతో 46, 14, 4, 73, 69 (నాటౌట్‌) బాదేయడంతో గట్టి సందేశాన్నిచ్చినట్టయింది. ఇక టీ20 చాలెంజర్స్‌ ట్రోఫీలో 155కి పైగా సగటుతో 189 పరుగులు సాధించింది. ఫైనల్లో 48 బంతుల్లో 89 పరుగులు సాధించి భారత్‌ ‘సి’ని విజేతగా నిలిపింది. అటు టీ20 ప్రపంచక్‌పలోనూ చోటు దక్కించుకుంది. అప్పటికి ఆమె వయస్సు 15 ఏళ్లే.


కొసమెరుపు

9 ఏళ్ల వయస్సులో తన ఆరాధ్య క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ను ప్రత్యక్షంగా చూసిన షఫాలీ వర్మ ఆ రోజే క్రికెటర్‌ కావాలనుకుంది. సీన్‌ కట్‌ చేస్తే.. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ నుంచి అత్యంత చిన్న వయస్సు (15 ఏళ్ల 285 రోజులు)లోనే అర్ధసెంచరీ సాధించి.. సచిన్‌ 30 ఏళ్ల రికార్డును షఫాలీనే అధిగమించింది.

Advertisement
Advertisement
Advertisement