Advertisement
Advertisement
Abn logo
Advertisement

స్వామి సేవలో తరించిన శేషాద్రి

చాలామందికి ‘డాలర్‌ శేషాద్రి’గా తెలిసిన శేషాద్రితో కలిసి తొమ్మిదవ తరగతి నుంచి బిఎస్సీ దాకా చదువుకోవడం నా అందమైన జ్ఞాపకాలలో ఒకటి. శేషాద్రి కుటుంబం తిరుపతి రైల్వేస్టేషన్‌ పక్కనే ఉండే కర్నాల (కరణాల) వీధిలో ఉండేది. తిరుపతి శ్రీ వేంకటేశ్వర హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో పన్నెండవ తరగతి దాకా చదివిన తర్వాత ఇద్దరమూ శ్రీ వేంకటేశ్వర ఆర్ట్స్‌ కళాశాలలో బిఎస్సీలో చేరాము.


బడిలో చదువుకుంటున్న రోజులలోనే శేషాద్రి ఎంతో చురుకుగా ఉండేవాడు. బడి నుండి ఇల్లు చేరగానే స్నానం చేసి శుచిగా వెళ్లి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని ఒక ఉపాలయంలో కైం సేవ చేసేవాడు. అట్లాగే కొన్నాళ్లు ఆ పక్కనే అప్పట్లో ఉన్న ప్రాచ్యకళాశాల ఆవరణలో సాయంకాలాలు హిందీ నేర్చుకునేవాడు. బడిలో ‘స్కౌట్‌’ ఉద్యమంలో స్కౌట్‌ మాస్టర్‌ గోవిందస్వామికి చేదోడుగా ఉండేవాడు. మేము పదవ తరగతిలో ఉన్నప్పుడు తిరుమల నడకదారిని ఆనుకుని ఉన్న ఒక అడవిలో స్కౌట్‌ క్యాంప్‌ ఏర్పాటయింది. పొద్దునే వెళ్లి సాయంకాలం దాకా అక్కడ ఉండి చీకటి పడేలోగా తిరిగి రావాలని కార్యక్రమం. క్యాంప్‌ నియమం ప్రకారం వంట కూడా అక్కడే చేసుకోవాలి. వంట గురించి అంతగా తెలియని మా బృందంలో దాన్ని నేర్చినవాడు శేషాద్రి ఒక్కడే. మా అందరికీ తాను వండిపెట్టగలనని అభయం ఇచ్చాడు. అన్నట్టుగానే బియ్యం పప్పు తక్కిన వంట పదార్థాలు, పాత్రలు, పెరుగు అన్నీ క్యాంప్‌కు తన వెంట తీసుకువచ్చాడు.


క్యాంప్‌లో బృందంనాయకుడిగా తన కర్తవ్యం నెరవేర్చుతూనే వంటపని మొదలుపెట్టాడు. అన్నంతో పాటు పులుసు (సాంబారు), చారు (రసం) చేసి అలసటతో ఆకలితో ఉన్న మా అందరికీ వడ్డించాడు. యాభై ఏడేళ్ల ముందటి ఆ భోజనం రుచి ఇంకా మరచిపోలేదు. స్కౌట్‌ ఉద్యమంలో ఎంతో శ్రద్ధగా పాల్గొన్న శేషాద్రి రోవర్‌ స్కౌట్‌ స్థాయి అందుకున్నారు.


మేము చదువుతున్న బడికి 75 సంవత్సరాలు నిండిన సందర్భంలో మేము ప్రదర్శించిన ‘పోతన’ (హాలికుడు) నాటకం చివరి దృశ్యానికి శేషాద్రి కొత్త శోభ తెచ్చారు. మా నాటక ప్రదర్శన వేదిక మీద శ్రీ గోవిందరాజస్వామి వారిని దేవేరులతో కొలువు తీర్చి అందరినీ పారవశ్యంలో ముంచెత్తే ఏర్పాటు చేశాడు!


బీఎస్సీ రోజులలో మాకు వారంలో ఒక మధ్యాహ్నం సెలవు ఉండేది. ఆ మధ్యాహ్నాలలో వీలైనన్ని సార్లు సైకిళ్ల మీద సినిమాలకు వెళ్లేవాళ్లం. శేషాద్రి సైకిల్‌ తొక్కుతూ ఉంటే నేను ఆ వెనుక కూర్చుని చేసిన ప్రయాణాలూ ఎన్నో! మాలో ఎవరిదగ్గరయినా సినిమా టికెట్‌ కొనే ఆర్థికస్థితి లేకపోతే శేషాద్రి తానే టికెట్లు కొని సినిమాకు తీసుకుపోయేవాడు. మా బిఎస్సీ చివరి సంవత్సరం వీడ్కోలు సభకు శేషాద్రి ‘టై’ కట్టుకుని రావడం ఒక మరపురాని సంఘటన! దాని వల్ల శేషాద్రి కొన్నాళ్లు ‘వార్తల్లో వ్యక్తి’ అయ్యాడు.


నేను తిరుపతి వదలిపెట్టినా శేషాద్రితో చెలిమి కొనసాగింది. తిరుపతికి వెళ్లినప్పుడు శేషాద్రిని పలకరించి రావడం ఒక ఆనవాయితీ అయింది. శ్రీవారి ఆలయంలో లఘుదర్శనాల పద్ధతి మొదలుకాని కాలంలో మా దంపతులం ఒకసారి స్వామివారి దర్శనానికి వెళ్లినప్పుడు బంగారు వాకిలి దగ్గర శేషాద్రి ఒకచేత చీపురు మరొకచేత నీటిగొట్టం పట్టుకుని ఆ ప్రాంగణం కడుగుతూ కనిపించాడు. ‘ఏం చేస్తున్నావురా?’ అని నేను అడిగితే ‘స్వామి సేవ’ అన్నాడు శేషాద్రి. ఆ తర్వాత ఎన్నోసార్లు శేషాద్రి స్వామివారి ఆలయంలో ఎన్నో సేవలు చేస్తుండగా చూశాను.


శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి వచ్చే ఎందరెందరో ప్రముఖులతో ఫొటోలలోనూ వీడియోలలోనూ కనిపించే శేషాద్రి తన ఆరోగ్యస్థితిని కూడా లెక్కచేయక సేవ చేస్తూ వచ్చాడని ఎందరికి తెలుసు? గడచిన కొన్నేళ్ల నుంచి శేషాద్రి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మూత్రపిండాలకు సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ సంవత్సరం కూడా అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. ఆస్పత్రి నుంచి తిరుపతికి చేరగానే వెంటనే తిరుమలకు వెళ్లి స్వామిసేవకు సిద్ధమయ్యాడు. ఈ మధ్య ఫోన్‌లో మాట్లాడినప్పుడు ‘ఆరోగ్యం జాగ్రత్త’ అని చెబితే ‘అన్నీ స్వామి చూసుకుంటారు’ అన్నాడు. ఊపిరి ఉన్నంత దాకా సేవ చేస్తూనే ఉండాలని తన కోరిక అనీ అన్నాడు. ఆ కోరిక ప్రకారమే జీవితం గడిపాడు.


తిరుమలలో శేషాద్రి కనిపించని సహస్ర దీపాలంకార సేవలు, పారాయణాలు, ఉత్సవాలు ఊహించుకోవడానికే బాధగా ఉంది. సేవలో నిమగ్నమై తన జన్మను సార్థకం చేసుకున్న శేషాద్రి వంటివారు అరుదు. స్వామి సేవలో తరించిన శేషాద్రి లేని లోటు తీరేది కాదు.

డా. పి.ఎస్‌. గోపాలకృష్ణ

Advertisement
Advertisement