Abn logo
Sep 21 2021 @ 23:56PM

రేషన్‌కు సర్వర్‌ సమస్య!

రాజాంలోని ఓ డిపో వద్ద నిరీక్షిస్తున్న లబ్ధిదారులు




వేలిముద్రలు పడక లబ్ధిదారుల అవస్థలు

డిపోల వద్ద గంటల తరబడి పడిగాపులు

రాజాం, సెప్టెంబరు 21: రేషన్‌ తీసుకునేందుకు డిపోల వద్దకు వెళ్లే లబ్ధిదారులకు గంటల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. సర్వర్‌ సమస్య వెంటాడుతుండడంతో బయోమెట్రిక్‌ నమోదు కావడం లేదు. దీంతో నిరాశతో లబ్ధిదారులు వెనుదిరుగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇదే సమస్య నెలకొంది. కొవిడ్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్‌ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సెప్టెంబరు నెలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా రేషన్‌ పంపిణీని పూర్తిచేసింది. రెండో పక్షంలో నేరుగా డిపోల  వద్దనే ఉచిత రేషన్‌ అందిస్తున్నారు. దీనికి సాంకేతిక సమస్యలు ఎదురవుతుండడంతో లబ్ధిదారులకు నిరీక్షణ తప్పడం లేదు.

జిల్లా వ్యాప్తంగా 1,989 రేషన్‌ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 8,01,923 రేషన్‌ కార్డులు ఉన్నాయి. రెండో దశ కొవిడ్‌ నేపథ్యంలో రేషన్‌కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా రేషన్‌ బియ్యం అందిస్తోంది. తొలుత ఇంటింటా రేషన్‌ అందించినా...తమపై భారం పడుతున్న దృష్ట్యా చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో పాత పద్ధతిలో రేషన్‌ డిపోల ద్వారా ఉచితంగా బియ్యం అందిస్తున్నారు. నవంబరు వరకూ అందించనున్నారు.  డిపోల వద్ద సర్వర్‌ సమస్య వెంటాడుతోంది. లబ్ధిదారులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. సెప్టెంబరు నెలకు సంబంధించి ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభమై వారం రోజులు గడుస్తున్నా సగం కూడా అందించలేని పరిస్థితి. రాజాం పట్టణంలోని డిపోల వద్ద సాంకేతిక సమస్య తలెత్తడంతో లబ్ధిదారుల నుంచి నిరసన వ్యక్తమైంది. దీనిపై సీఎస్‌డీటీ రంజిత్‌ స్పందించారు. జేసీ శ్రీనివాసులతో పాటు పౌరసరఫరాల జిల్లా అధికారికి ఫిర్యాదుచేశారు. జిల్లా వ్యాప్తంగా ఇదే సమస్య ఉందని...సమస్య పరిష్కారానికి సత్వర చర్యలు చేపడుతున్నట్టు వారు చెప్పారు.