Abn logo
Oct 12 2020 @ 03:52AM

సర్వర్‌ డౌన్‌

Kaakateeya

గడువులోపు స్థిరాస్తుల నమోదు గగనమే!

మొరాయిస్తున్న సర్వర్‌తో ఇబ్బందులు 

ఉమ్మడి జిల్లాలో ఇంటింటా వివరాల సేకరణ

పని ఒత్తిడితో ఉద్యోగుల్లో మానసిక వేదన 

మరో పది రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం

గడువు మరింతగా పెంచాలంటున్న ఉద్యోగులు


ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌ /  ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి :  సమయం తక్కువ.. సాధించాల్సిన లక్ష్యం ఎక్కువ.. రోజుకు చాలా గంటలు కష్టపడ్డా కానీ.. కొంతైనా సమాచారం నమోదు చేయలేని పరిస్థితి.. పల్లెల్లో వివరాలు సేకరిస్తున్న సమయంలో సర్వర్‌ మోరాయిస్తుండటంతో వ్యవసాయేతర భూముల నమోదు ప్రక్రియ సిబ్బందికి ఇబ్బందిగా మారింది. గడువులోపల పనులన్నీ పూర్తి చేయాలని అధికారుల నుంచి పెరుగుతున్న ఒత్తిడితో ఉద్యోగులు సతమతమవుతోన్నారు. ఈనెల 10వ తేదీ వరకు వ్యవసాయేతర భూముల సర్వే పూర్తి చేయాల్సి ఉండగా... ప్రభుత్వం గడువును ఈనెల 20వ తేదీ వరకు పెంచింది. సమయం తక్కువగా ఉండటం... సర్వే చేయాల్సినవి ఎక్కువగా ఉండటంతో గడువు పెంచాలని ఉద్యోగులు ప్రభుత్వానికి మొర పెట్టుకోగా... మరో పది రోజుల వరకు గడువును పెంచింది. పెంచిన గడువు కూడా సరిపోతదో... లేదోనని.. ఉద్యోగులు మదనపడుతున్నారు. పని ఒత్తిడితో మానసిక వేదన చెందుతున్నారు. సర్వేకు మరిన్ని రోజుల సమయం ఇవ్వాలని కోరుతున్నారు. 


కొనసాగుతున్న ఆస్తుల నమోదు ప్రక్రియ

ప్రభుత్వం ధరణి పోర్టల్‌లో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల వివరాలను నిక్షిప్తం చేయాలని భావిస్తుంది. ఇందులో భాగంగా మున్సిపాలిటీలు, పంచాయతీలలో వివరాలను సేకరిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శులతో పాటు వీఆర్వో, వీఆర్‌ఏ, స్వయం సహాయక సంఘాల మహిళలు భాగస్వాములవుతున్నారు. సర్వేలో పంచాయతీ పరిధిలో ఉండే ఇంటి నెంబరుతోపాటు ఇంటి విస్తీర్ణం, హద్దులు, కుటుంబసభ్యుల పేర్లు, వారి పేరుమీద ఉన్న ఆస్తుల వివరాలతోపాటు వ్యాపార, వాణిజ్య సముదాయాలను నమోదు చేస్తున్నారు. ఇళ్లతోపాటు దేవాలయాలు, బడి, ఇతర సామాజిక భవనాల వివరాలను కూడా నమోదు చేస్తున్నారు. 36 అంశాలు కలిగిన ప్రొఫార్మర్‌లో కుటుంబ యజమాని పేరు, ప్రాంతం, ఫోన్‌నెంబరు, ఆస్తి రకం, ఇంటి వివరాలతో పాటు ప్లాట్‌ విస్తీర్ణం, ఆధార్‌, బ్యాంకు, రేషన్‌ కార్డు వివరాలను సేకరిస్తున్నారు. 


ప్రజల నుంచి కరువైన స్పందన 

గ్రామాల్లో నిర్వహిస్తున్న సర్వేలో సిబ్బంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు ఇంటింటికీ తిరుగుతూ చేస్తున్న సర్వేకు ప్రజల నుంచి స్పందన కరువవుతోంది. ఇళ్లసర్వేలో యజమానులు వేరే ప్రాంతాల్లో ఉండడం, ఆస్తుల వివరాలను చెప్పకపోవడం సమస్యగా మారింది. పంచాయతీ కార్యదర్శులకు వాట్సాప్‌ నెంబర్‌లకు ప్రత్యేకంగా లింకులను పంపించారు. నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీస్‌ అప్‌డేషన్‌ యాప్‌ ద్వారా వివరాలను ఆప్‌డేట్‌ చేయాలి. దీంతో సర్వర్‌ మొరాయిస్తుండటంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.


మరింత గడువు పెంచాలి : సర్వే సిబ్బంది

సర్వర్‌ మొరాయిస్తుండటంతో ఆన్‌లైన్‌ నమోదు ప్రకియ ఆలస్యమ వుతోంది. ఒక్కో అధికారికి 50-80 ఇళ్లు సర్వే చేసి ఆన్‌ లైన్‌లో వివ రాలను నమోదు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. సర్వే సమస్య తోపాటు ప్రజలు సహకరించక పోవడం వంటి కారణాలతో ఒక్కో అధికారి రోజుకు 30 ఇళ్ల వరకు పూర్తి చేస్తున్నారు. కొంత మంది రంగారెడ్డి జిల్లాలో ఆదివారం వరకు 1,52,127 ఆస్తులను నవీకరించారు. అలాగే వికారాబాద్‌ జిల్లాలో 1,24,886, మేడ్చల్‌ జిల్లాలో 21,505 ఆస్తులను నవీకరిం చారు. ఇంకా నవీకరించాల్సినవి పెద్ద మొత్తంలో ఉండ టంతో సర్వే ఎప్పుడు పూర్తవుతుందోనని అధికారులు తల పట్టుకుంటున్నారు. సర్వే సిబ్బంది గడువును మరింతగా పెంచాలని కోరుతున్నారు.  ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నా మని మేడ్చల్‌ డీపీవో పద్మజారాణి వెల్లడించారు. 


ఆరో స్థానంలో వికారాబాద్‌ జిల్లా

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌)  : వికారాబాద్‌ జిల్లాలో వ్యవసాయేతర ఆస్తుల సర్వే ప్రారంభంలో మందకోడిగా కొనసాగిన సర్వే నమోదు ప్రక్రియ గత నాలుగైదు రోజులుగా వేగంగా కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం వరకు జిల్లాలోని పంచాయతీల్లో 57.36 శాతం ఆస్తుల సర్వే పూర్తి చేసి వికారాబాద్‌ జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో నిలిచింది. రంగారెడ్డి జిల్లాలో 54.96 శాతం ఆస్తుల సర్వే పూర్తి చేసి రాష్ట్రంలో 10వ స్థానంలో నిలిచింది. మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాలో 42.25 శాతం ఆస్తుల సర్వే పూర్తి చేసి రాష్ట్రంలో 27వ స్థానంలో నిలిచింది. 


గడువులోగా నమోదుకు చర్యలు

వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ జిల్లాలో చురుగ్గా సాగుతోంది. ప్రభుత్వం నిర్ధేశించిన గడువులోగా సర్వేను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటు న్నాము. నమోదు ప్రక్రియలో ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని వెంటనే వాటిని పరిష్కరిస్తున్నాము. ఒక్కో పంచాయతీ కార్యదర్శికి 50-70 ఇళ్లు సర్వే చేయాలని లక్ష్యంగా నిర్దేశించాము. యాక్టివ్‌గా ఉన్నవారు రోజుకూ 60 ఇళ్ల వరకు ఆన్‌లైన్‌ నమోదు చేస్తున్నారు. సర్వర్‌ మోరాయింపు వంటి సమస్యలు పెద్దగా లేవు. కొంచెం స్లోగా అప్‌లోడ్‌ అవుతున్నాయి. 

- శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి 


నవీకరించిన ఆస్తుల వివరాలు (ఈ నెల 11వ తేదీ వరకు)

జిల్లా మండలాల గ్రామ సర్వే చేస్తున్న పంచాయతీ నవీకరించిన

సంఖ్య పంచాయతీలు అధికారులు  ఆస్తులు ఆస్తులు

రంగారెడ్డి  21 560 606 2,76,814 1,52,127

వికారాబాద్‌ 18 566 641 2,17,719 1,24,886

మేడ్చల్‌  05 61 66 50,896 21,505

Advertisement
Advertisement