Abn logo
Sep 21 2020 @ 20:12PM

సీనియర్‌ నటి సీత ఇక లేరు

Kaakateeya

'దేవదాసు', 'మాయా బజార్‌' వంటి చిత్రాలతో పాటు 'ఋతురాగాలు' వంటి సీరియల్‌లో నటించి అత్యంత ప్రేక్షకాదరణ పొందిన నటిగా గుర్తింపు పొందిన సీనియర్‌ నటి సీత(87) సోమవారం హైదరాబాద్‌లో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఆమె బాధపడుతున్నారు. ఆమె అంత్యక్రియలు హైదరాబాద్‌ మహాప్రస్థానంలో సోమవారం మథ్యాహ్నం ముగిశాయి.  ఆమె మృతి వార్త తెలిసిన పలువురు వెండితెర, బుల్లితెర నటులు ఆమెకు సంతాపం తెలిపారు. 

దిగ్గజ దర్శకుడు కెవి రెడ్డి రూపొందించిన ‘యోగి వేమన’ నుంచి పరిశ్రమతో ప్రయాణించిన ఆమె.. తన జీవితంలో ఎన్నో ఆటుపోట్లను, ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. 1933 అక్టోబర్ 14న కాకినాడలో రామస్వామి దంపతులకు ఆమె జన్మించారు. 1946లో కెవి రెడ్డి తొలిసారి దర్శకత్వ బాధ్యతలు వహిస్తూ రూపొందించిన ‘యోగి వేమన’లో బాలనటిగా కనిపించారు. అలా సీత -కథానాయిక చెల్లిగా కెవి రెడ్డి మనసులో ఉండిపోయింది. అప్పటి నుంచి ఆయన రూపొందించిన అనేక చిత్రాల్లో సీతకు పాత్ర లేకుండా లేదు. మంచి పాత్రలిస్తూ ప్రోత్సహించారు. హాస్యతారగా సరికొత్త మేనరిజమ్స్‌తో సీత ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కెవి రెడ్డి రూపొందించిన మాయాబజార్, గుణసుందరి కథ, పెళ్లినాటి ప్రమాణాలు, పెద్దమనుషులు తదితర చిత్రాల్లో హాస్యపాత్రలు, చెలికత్తె పాత్రలు ధరించారు. 1946 నుంచి ప్రారంభమైన ఆమె సినీ ప్రస్థానం, 2002లో ‘నేనేరా పోలీస్’ వరకూ సాగింది. దాదాపు 250 చిత్రాల్లో నటించారు. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే నటుడు నాగభూషణంతో కలిసి రక్తకన్నీరు, పాపం పండింది, ఇనుప తెరలు, అందరూ బతకాలి లాంటి నాటకాలు దాదాపు 2వేల ప్రదర్శనలిచ్చారు.

లవంగి, జయసింహ, పల్లెటూరిపిల్ల, గుణసుందరి కథ, స్వర్ణసుందరి, స్వప్నసుందరి, పరమానందయ్య శిష్యులు, పల్నాటియుద్ధం, పంతులమ్మ, నలదమయంతి, భానుమతి నటించిన గృహప్రవేశం, సతీతులసి, అత్తా ఒకింటి కోడలే, ఋష్యశృంగ, సత్యహరిశ్చంద్ర, సంతోషిమాతవ్రతం, దేవదాసు,మాయాబజార్ వంటి గొప్ప చిత్రాల్లోనటించి తన ప్రతిభ చాటారు. టీవీలో తొలి సీరియల్ ఋతురాగాల్లోనూ నటించి, తరువాత అనేక చానల్స్‌లో ధారావాహికలలో నటించి పేరు తెచ్చుకున్నారు. రక్తకన్నీరు నాటకం అనేక ప్రాంతాల్లో తిరిగి ప్రదర్శించే సమయంలో నటుడు నాగభూషణాన్ని 1956లో వివాహం చేసుకున్నారు. పెళ్లయ్యాక దాదాపు కుటుంబానికే పరిమితమయ్యారు. ఆమెకు కూతురు భువనేశ్వరి, కొడుకు సురేందర్ ఉన్నారు. 

Advertisement
Advertisement
Advertisement