Abn logo
May 19 2020 @ 00:50AM

స్వావలంబనే జీవనమంత్రం

ప్రభుత్వ రంగంలో అసమర్థత, వృథా, జవాబుదారీ విధానం లేకపోవడం, అవినీతిని రూపుమాపేందుకు మోదీ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. కరోనా విలయం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకుని పలు పాలనా సంస్కరణలను ప్రవేశపెట్టారు. వ్యూహాత్మకరంగాలకే ప్రభుత్వ రంగ సంస్థలను పరిమితం చేయడం మోదీ ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయం. తాము ఖర్చు పెడుతున్న డబ్బుకు తగ్గ నాణ్యమైన సేవల గురించి ప్రజలు ప్రశ్నిస్తున్నందున డిస్కమ్‌ల అసమర్థతను వినియోగదారులపై రుద్దకుండా వారి ప్రయోజనాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో భారీ సంస్కరణలకు పూనుకున్నారు.


సంక్షోభాన్ని అవకాశంగా ఉపయోగించుకోవడంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని మించిన వారు లేరన్న విషయం కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన భారీ ప్యాకేజీని బట్టి అర్థమవుతోంది. గత రెండు నెలలుగా ప్యాకేజీ, ప్యాకేజీ అంటూ కలవరిస్తున్న విమర్శకులు ఎట్టకేలకు మోదీ సర్కార్ భారీ ప్యాకేజీ ప్రకటించడంతో నిర్ఘాంతపోయినట్లు కనిపిస్తున్నది. గత అయిదు రోజులుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేస్తున్న ప్రకటనలతో వారు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. దేశంలో ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుదుపు కుదిపి నిర్మాణాత్మక దిశలో నవనవోన్మేషంగా మార్చేందుకు, వ్యవస్థల్లో జడత్వాన్ని రూపుమాపేందుకు, రైతునుంచి పరిశ్రమల వరకు ఆకాశమే హద్దు అన్నట్లుగా అవకాశాలు కల్పించేందుకు ప్రధాని మోదీ గత కొన్ని రోజులుగా ఎందరో నిపుణులతో చర్చించిన తర్వాత ప్రకటించిన బృహత్తర ప్యాకేజీ ఇది.


ఆదివారం నాడు ఆర్థిక మంత్రి తన ప్రకటనల పరంపరలను పూర్తి చేసిన తర్వాత సమీక్షిస్తే ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల కంటే ఎక్కువగానే ప్యాకేజీ ఉన్నట్లు అర్థమవుతోంది. కరోనా వ్యాప్తి ప్రారంభమైన తర్వాత తొలుత రూ.లక్షా92వేల కోట్లు ప్యాకేజీ ప్రకటిస్తే అయిదు ప్రకటనల ద్వారా దాదాపు రూ.11 లక్షల కోట్ల మేరకు ఆర్థిక వ్యవస్థకు ఊపు కల్పించారు. రిజర్వు బ్యాంకు తీసుకున్న రూ.8,01,603 కోట్ల చర్యలతో కలిపి మొత్తం రూ.20,97,503 కోట్ల మేరకు మోదీ సర్కార్ వ్యవస్థలో విడుదల చేసింది. అమెరికాలో ఆ దేశ జీడీపీలో 13 శాతం ప్యాకేజీ ప్రకటించగా, కెనడాలో 8.4 శాతం, బ్రెజిల్‌లో 8 శాతం, అర్జెంటీనాలో 3.5 శాతం ప్రకటించారు. భారత దేశ ప్యాకేజీ దేశ జీడీపీలో 10 శాతానికి పైగా ఉంటుంది.


నిజానికి అభివృద్ధి చెందిన దేశాల్లో జరిగినంత స్థాయిలో ప్రైవేటీకరణ మన దేశంలో జరగనే లేదు. అందువల్ల మన ప్రభుత్వ చర్యల్ని అగ్ర రాజ్యాల చర్యలతో పోల్చడానికి ఏ మాత్రం వీలు లేదు. అక్కడ సంపదను సృష్టించి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రైవేట్ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ దృష్ట్యానే మోదీ సర్కార్ ఒకవైపు దాదాపు రూ.21లక్షల ప్యాకేజీని ప్రకటిస్తూనే అభివృద్ధిలో ప్రైవేట్ రంగం పాత్రను ప్రోత్సహించేందుకు బృహత్తరమైన పరిపాలన, ఆర్థిక సంస్కరణలను ప్రకటించింది. ఈ సంస్కరణలు అమలు అయితే ఆర్థిక వ్యవస్థలో గుణాత్మకమైన మార్పు వచ్చి అభివృద్ధి విశ్వరూపం మనకు కనపడుతుంది. అప్పుడు భారత ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ కన్నా ఎన్నో రెట్లు ఆర్థిక వ్యవస్థకు ఎక్కువ ఉత్తేజం కలుగుతుంది. ఊహించని స్థాయిలో ఉపాధి కల్పనకు అవకాశం ఏర్పడుతుంది.


దేశ అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వాలకు భాగస్వామ్యమే కాదు, బాధ్యత కూడా ఉన్నది. అందువల్ల చివరిగా ఆర్థిక మంత్రి చేసిన ప్రకటనలో రాష్ష్ట్ర ప్రభుత్వాలకు కూడా భారీ ఎత్తున అదనపు వనరులు సమీకరించేందుకు బృహత్తర అవకాశం కల్పించారు. ముఖ్యమంత్రుల డిమాండ్లను మోదీ ప్రభుత్వం ఆమోదించి రుణ పరిమితిని జీఎస్‌డిపీలో 3 శాతం నుంచి 5 శాతానికి పెంచింది. దీని వల్ల రాష్ట్రాలు అదనంగా రూ.4.28 లక్షల కోట్ల మేరకు రుణాలు చేసుకునేందుకు అవకాశం లభించింది. ఆర్థిక వనరులను సమీకరించినంత మాత్రాన సరిపోదు. ఆ వనరులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా అనుత్పాదక రంగానికి ఖర్చు చేయకుండా సంయమనం పాటించాలి. ఆ దిశలోనే మోదీ సర్కార్ పలు సంస్కరణలను ప్రవేశపెట్టింది.


ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న పారిశ్రామిక రంగానికి సంబంధించి మోదీ ప్రభుత్వం ప్రకటించిన సంస్కరణలు దేశ పారిశ్రామిక రంగం రూపురేఖలు మారుస్తాయనడంలో సందేహం లేదు. ఈ సంస్కరణలన్నీ నరేంద్రమోదీ ఆశించిన‘మేక్ ఇన్ ఇండియా’ను సార్థకం చేసి ‘ఆత్మనిర్భర భారత్’కు దారిని సుగమం చేస్తాయి. ప్రధానమంత్రి తన సందేశంలో ‘స్థానికమే మన జీవన మంత్రం’ అని ప్రకటించిన విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. గతంలో మైనింగ్ రంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమాలకు పాల్పడడం, మంత్రులు, అధికారులు జైలు పాలు కావడం వంటి ఉదంతాలు మనకు సుపరిచితం. ఈ దిశగా బొగ్గు గనుల రంగాన్ని ప్రైవేటీకరించడం, బ్లాకులను పారదర్శక పద్ధతిలో వేలం వేయడం వంటి నిర్ణయాలతో మనం స్వయం సమృద్ధి సాధించేందుకు తోడ్పడుతుంది. ఎక్కడో విదేశాల్లో మైనింగ్ రంగంలో పాల్గొని కోట్లాది రూపాయలు ఆర్జించే మన పారిశ్రామికవేత్తల దృష్టి ఇప్పుడు పూర్తిగా భారత్ వైపు మళ్లుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఆత్మనిర్భరభారత్ దిశలోనే రక్షణ రంగంలో 74శాతం ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించి మన దేశంలోనే ఆయుధాల తయారీకి ఆస్కారం కలిగించడం చరిత్రాత్మక నిర్ణయం. విమానాల నిర్వహణ, మరమ్మతులకు అంతర్జాతీయ కేంద్రంగా భారత్‌ను రూపొందించేందుకు అవసరమైన సంస్కరణలు ప్రవేశపెట్టడం కూడా స్వావలంబన దిశగా మనం వేస్తున్న అడుగులకు నిదర్శనం.


ప్రభుత్వ రంగంలో అసమర్థత, వృథా, జవాబుదారీ విధానం లేకపోవడం, అవినీతి తాండవించడం మోదీ సర్కార్‌కు నచ్చదు. అందువల్ల ప్రస్తుత సదవకాశాన్ని వినియోగించుకుని మోదీ ప్రభుత్వం పలు పాలనా సంస్కరణలను ప్రవేశపెట్టడం, వ్యూహాత్మక రంగాలకే ప్రభుత్వ రంగ సంస్థలను పరిమితం చేయాలనుకోవడం విప్లవాత్మక నిర్ణయం అని చెప్పక తప్పదు. ఇవాళ ప్రజల్లో ఎవర్ని అడిగినా తాము ఖర్చు పెడుతున్న డబ్బుకు తగ్గ నాణ్యమైన సేవల గురించి ప్రశ్నిస్తారు. అందుకే డిస్కమ్‌ల అసమర్థతను వినియోగదారులపై రుద్దకుండా వారి ప్రయోజనాలకు అనుగుణంగా విద్యుత్ రంగంలో భారీ సంస్కరణలు ప్రవేశపెట్టారు.


భారత దేశంలో రైతులకు ఎప్పుడూ మార్కెట్ అందుబాటులో ఉండకపోవడమే కాక సరైన ధర లభించదు. మోదీ ప్రభుత్వం తాజా సంస్కరణల ద్వారా రైతుకు, మార్కెట్‌కూ ఉన్న అన్ని అడ్డంకులను తొలగించి మంచి ధర లభించిన చోట అమ్మేందుకు అవకాశం కల్పించింది. పరిశ్రమలు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్మేందుకు అవకాశం ఉన్నట్లుగా వ్యవసాయానికి కూడా ఆ అవకాశాలు కల్పించి లైసెన్స్ రాజ్‌కు అడ్డుకట్ట వేసింది. వంటనూనెలు, నూనెగింజలు, పప్పులు, ఉల్లిపాయలు, బంగాళదుంపలను నిత్యావసరం చట్టం అమలు పరిధిలోంచి తప్పించింది. 1991లో ఆర్థిక రంగంలో చేపట్టిన సంస్కరణల వల్ల దేశం ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి ఊపు లభించిందో మోదీ ప్రకటించిన చర్యల వల్ల వ్యవసాయ రంగం విప్లవాత్మక మార్పులకు సన్నద్దమైంది. వ్యవసాయమే కాదు, పాడి పరిశ్రమ, మత్స్య శాఖ, పశు సంవర్థక శాఖ, తేనెటీగల సంరక్షణ, మేకల పెంపకానికి అమితమైన ప్రోత్సాహాన్ని ప్రకటించింది. ఆహార రంగంలోని 2 లక్షల సూక్ష్మ పరిశ్రమలను బలోపేతం చేసేందుకు పథకాన్ని ప్రకటించింది. అన్నిటికన్నా ముఖ్యంగా వ్యవసాయ మౌలిక సదుపాయాలకే రూ.లక్ష కోట్లు కేటాయించడం గతంలో ఏ ప్రభుత్వమూ చేయలేదు.


ఇవాళ వలస కార్మికుల గురించి ప్రతి ఒక్కరూ కన్నీరు కారుస్తున్నారు. కాని మోదీ ప్రభుత్వం ఆ కన్నీరు తుడిచి వారి కడుపులు నింపి, దేశ పునర్నిర్మాణంలో వారికి భవిష్యత్ పాత్ర కల్పించేందుకు బృహత్తర చర్యలు ప్రకటించింది. దేశంలోని 8 కోట్ల వలస కార్మికులకు ఆహార సమస్య లేకుండా అదనపు ఆహార ధాన్యాలు పంపిణీ చేయడమే కాక వారు గ్రామాల్లోకి వెళితే నరేగా క్రింద పనులు చేసేందుకు అవకాశం కల్పించారు. అంటే వారికి ఆహార భద్రత, ఉపాధి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. వారు దేశంలో ఎక్కడున్నా సరే రేషన్ కార్డు ఉపయోగించేందుకు వీలుగా ‘వన్‌ ‌నేషన్- వన్ రేషన్’ పథకాన్ని విస్తృతంగా అమలు చేయాలని నిర్ణయించింది. లాక్‌డౌన్ ప్రకటించిన మూడో రోజే రంగంలోకి దిగి గరీబ్ కల్యాణ్ యోజన పేరిట లక్షా 70 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన ప్రభుత్వం బడుగు జీవులను ఆదుకునేందుకు అవసరమైన ప్రతి చర్యా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నది. విచిత్రమేమంటే మోదీ ప్రభుత్వం ప్రజల కష్టాలను వాస్తవ దృక్పథంతో అర్థం చేసుకుని ఆచరణీయమైన చర్యలు ప్రకటిస్తుంటే కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీళ్లు కారుస్తూ వారితో ఫోటోలు దిగేందుకు పరిమితమయ్యారు. అందుకే వలస కార్మికులతో పాటు వీధుల్లో ప్రత్యక్షమైన రాహుల్ గాంధీ చర్యను ఆర్థిక మంత్రి ‘డ్రామాబాజీ’గా ప్రకటించడం నూటికి నూరుపాళ్లు సరైనది.

వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)

Advertisement
Advertisement
Advertisement