Abn logo
Oct 23 2020 @ 06:08AM

వైసీపీ నేతలకే సచివాలయ పనులు..!

Kaakateeya

అనధికారిక కాంట్రాక్టర్లుగా చెలామణి

నిర్మాణాల్లో వారిదే పెత్తనం

డబ్బులు డ్రా చేయడం వరకే ప్రత్యేక అధికారి పాత్ర 

పలు గ్రామాల్లో ఇసుక కొరతతో ఆగిన పనులు

పనుల్లో లోపిస్తున్న ప్రమాణాలు

జిల్లాలో 631 సచివాలయాల నిర్మాణాలకు శ్రీకారం

రూ.252.40 కోట్ల ఉపాధి నిధులు మంజూరు


ఉపాధి నిధులతో సచివాలయ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. నిబంధనల ప్రకారం పంచాయతీ ప్రత్యేక అధికారి పనులు చేయాలి. అనధికారికంగా అధికార పార్టీ వైసీపీ నాయకులే కాంట్రాక్టర్లుగా మారారు. కొందరు బినామీ కాంట్రాక్టర్లకు అప్పగించారు. డబ్బులు డ్రా చేసి ఇవ్వడం వరకే ప్రత్యేక అధికారుల పాత్రగా మారింది. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు.. ఇసుక కొరతతో పలు గ్రామాల్లో పునాదులతోనే పనులు ఆగిపోయాయి. డిసెంబరు ఆఖరు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. ఇప్పటికి 56 భవనాలే పూర్తయ్యాయి. జిల్లాలో ఉపాధి నిధులు రూ.252.40 కోట్లతో 631 సచివాలయాల నిర్మాణాలు చేపట్టారు. పనుల తీరుపై ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయి పరిశీలన కథనం. 


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 807 గ్రామ పంచాయతీలు ఉంటే 2 వేల నుంచి 4 వేల జనాభాకు ఒకటి చొప్పన 633 సచివాలయాలు ఏర్పాటు చేశారు. 11 మంది సచివాలయ సిబ్బంది, సర్పంచ్‌, పనుల కోసం వచ్చే ప్రజలకు అనుకూలంగా జీ+1 తరహాలో 2620 చదరపు అడుగుల విస్తీర్ణంలో నూతన భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఉపాధి హామీ పథకం కన్వర్జేషన్‌ నిధులు ఒక్కో భవనానికి రూ.40 లక్షలు చొప్పన కేటాయించారు. 631 సచివాలయాల నిర్మాణాలకు రూ.252.40 కోట్లు మంజూరు చేశారు. 412 భవనాల నిర్మాణాలను పంచాయతీరాజ్‌ (పీఆర్‌)కు, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎ్‌స)కు 219 కేటాయించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు డిసెంబరు ఆఖరు నాటికి పూర్తి చేయాలి. పీఆర్‌ ఇంజనీర్ల పర్యవేక్షణలో చేపట్టిన 412 భవనాల్లో ఇప్పటి వరకు 56 భవనాలు పూర్తిస్థాయిలో నిర్మాణాలు జరిగితే 138 చివరి దశలో ఉన్నాయి. 218 భవనాలు వివిధ దశల్లో ఉన్నాయి. పలు గ్రామాల్లో పునాదులు కూడా దాటలేదు. ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్ల పర్యవేక్షణలో చేపట్టిన 219 భవనాల నిర్మాణాల పురోగతి మందగించింది. 


వైసీపీ నాయకులే కాంట్రాక్టర్లు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ పనులు కాంట్రాక్టర్లకు ఇవ్వరాదు. పంచాయతీ ప్రత్యేక అధికారే పనులను చేయాలి. అయితే ముప్పాతిక శాతం గ్రామాల్లో ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన అధికార వైసీపీ నాయకులే అనధికారిక కాంట్రాక్టర్లుగా మారి పనులు చేస్తున్నారు. వారిలో కొందరు పర్సెంటేజీలకు ఆశపడి బినామీ కాంట్రాక్టర్లకు అప్పగించినట్లు విశ్వసనీయ సమాచారం. పనుల పురోగతికి అనుగుణంగా ఇంజనీర్లు ఎం-బుక్‌ రికార్డు చేసి బిల్లులు పెడితే.. ప్రత్యేక అధికారి ఖాతాలో జమ అవుతుంది. డబ్బు డ్రా చేసి పనులు చేస్తున్న బినామీ కాంట్రాక్టర్లకు ఇవ్వడం స్పెషల్‌ ఆఫీసర్ల పాత్రగా మారింది. అయితే.. వారే పనులు చేస్తున్నట్లు రికార్డుల్లో ఉంది.


పనులు చేసే నాయకులకు అధికార పార్టీ అండ, స్థానిక ప్రజాప్రతినిధుల మద్దతు ఉండడంతో నిర్మాణాల్లో ప్రమాణాలు విస్మరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఐఎ్‌సఐ స్టాండర్డ్‌ కలిగిన 53 గ్రేడ్‌ సిమెంట్‌ వాడాలని ఉన్నా.. పలుచోట్ల సాధారణ సిమెంట్‌ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. గోడలకు ప్లాస్టింగ్‌లో సిమెంట్‌ పొదుపుగా వాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పది కాలాలు గ్రామీణ ప్రజల సేవలో తరించాల్సిన ఈ భవనాల నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పక్కాగా పాటించాలని పలువురు పేర్కొంటున్నారు. 


వేధిస్తున్న ఇసుక కొరత

భవన నిర్మాణాలకు సిమెంట్‌, కంకర, ఇటుక ఎంత అవసరమో.. ఇసుక అంతే అవసరం. వర్షాలకు నదులు, వంకలు ఉప్పొంగడంతో ఇసుక రీచ్‌లు మూతపడ్డాయి. పలు రీచ్‌ల్లో లభ్యమయ్యే ఇసుక పూర్తిగా ఇప్పటికే తవ్వేశారని, అక్కడ ఇసుక నిల్వలు లేవని మైనింగ్‌ అధికారులు అంటున్నారు. దీంతో పలు గ్రామాల్లో ఇసుక కొరతతో మధ్యలోనే నిర్మాణాలు ఆగిపోతే.. పలుచోట్ల పునాదుల్లోనే నిలిచిపోయాయి. సమీప వంకల నుంచి ఎద్దల బండ్లపై ఇసుక కొందామంటే బండి రూ.1000లకు పైగా ఉందని, ఎలా పనులు చేయాలని ఓ మండల స్థాయి అధికారి పేర్కొనడం కొసమెరుపు.


వాస్తవాలు కొన్ని

జమ్మలమడుగు మండలం గూడెంచెరువు సచివాలయ నిర్మాణం రూ.40 లక్షలతో చేపట్టారు. స్థానిక అధికార పార్టీ నాయకుడొకరు ఈ పనులు చేస్తున్నారు. బేస్‌మట్టం వేసి వదిలేశారు. రెండు నెలలుగా పనులు జరగడం లేదు. ఇసుక కొరతే ప్రధాన కారణమని తెలుస్తోంది. కొండాపురం మండలం పి.అనంతపురం రీచ్‌ నుంచి ఇసుక అనుమతి ఉంది. రవాణా చార్జీ భారీగా అవుతోంది. స్థానికంగా ఎద్దుల బండిపై తోలే ఇసుక కొందామంటే బండి వెయ్యి రూపాయలు. దీంతో పనులు ఆగిపోయాయి. జరిగిన పనుల్లో నాణ్యతా లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. పొన్నతోట సచివాలయ పనులు పునాదులతో వదిలేశారు. మండలంలో సగం గ్రామాల్లో ఇదే పరిస్థితి.

 

ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురం సచివాలయం నిర్మాణంలోనూ ఇసుక కొరత సమస్యగా మారింది. భవనం పూర్తయినా ప్లాస్టింగ్‌కు ఇసుక లేదు. గోడలకు ప్లాస్టింగ్‌లో సిమెంట్‌ తక్కువగా వాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పనులను అనధికారికంగా అధికార పార్టీ నాయకుడికి ఇస్తే.. ఆయన సబ్‌ కాంట్రాక్టరుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలా చేతులు మారితే నిర్మాణాల్లో నాణ్యత ఏ స్థాయిలో ఉంటుందో ఇట్టే తెలుస్తుంది. 


బి.మఠం మండలం నాగిశెట్టి గ్రామ సచివాలయం పనులు స్థానిక అధికార పార్టీ నాయకుడే చేస్తున్నారని గ్రామస్తులు అంటున్నారు. ఇసుక, కంకర ఉన్నా పనులు మాత్రం మధ్యలోనే ఆగిపోయాయి. ఇంజనీర్లు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. మండలంలో 14 సచివాలయాలకు పనులు నిర్మాణం పూర్తయి ప్లాస్టింగ్‌ దశలో ఉన్నవి 8, వివిధ దశల్లో 6 ఉన్నాయి. 11 వాటికి రూ.6 లక్షల చొప్పున బిల్లులు వచ్చాయి. 


పుల్లంపేట సచివాలయం పనులు ఇసుక కొరతతో బేస్‌మట్టంతోనే ఆగిపోయింది. ఈ పనులు స్థానిక అధికార పార్టీ నాయకుడు చేపట్టారు. 


మండల కేంద్రం చిన్నమండెంలో పిల్లర్ల దశలో ఆగిపోయాయి. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు విస్మరించారనే ఆరోపణలు ఉన్నాయి. బోనమల సచివాలయం పనులు మందకొడిగా సాగుతున్నాయి. రాయచోటి నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులే పనులు చేస్తుండడంతో నాణ్యత పాటించడం లేదని, వారికి అధికార పార్టీ కీలక నేతల అండదండలు ఉండడంతో పర్యవేక్షణ ఇంజనీర్లు కూడా గాంధారి పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 


నాణ్యతలో రాజీపడం - సుబ్బారెడ్డి, ఎస్‌ఈ, పంచాయతీరాజ్‌, కడప

జిల్లాలో 631 సచివాలయాలు ఉపాధి నిధులతో చేపట్టారు. అందులో పీఆర్‌ ఆధ్వర్యంలో 412 భవనాలు చేపట్టాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంచాయతీ ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలోనే పనులు చేస్తున్నారు. ఎక్కడా కాంట్రాక్టర్లకు ఇవ్వలేదు. ఉపాధి హామీ పథకం కన్వర్జేషన్‌ నిధులు ఒక్కో సచివాలయానికి రూ.40 లక్షలు కేటాయించారు. 2021 మార్చి ఆఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాల్లో ఎక్కడా రాజీపడం. ఏ గ్రామంలోనైనా చిన్నలోపం ఉందని సమాచారం ఇస్తే తక్షణమే సరి చేస్తాం. 

Advertisement
Advertisement