Abn logo
Jul 12 2020 @ 06:06AM

వానా కాలం.. జరభద్రం..!

సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశం

అప్రమత్తంగా లేకుంటే ఇబ్బందులే

పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి

ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు


(కొమరాడ): వర్షా కాలం.. వ్యాధులు ప్రబలే కాలం. ఈ సీజన్‌లో అప్రమత్తంగా లేకుంటే ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తు న్నాయి. ఇదే సమయంలో మలేరియా, టైఫాయిడ్‌, డయేరియా, డెంగ్యూ, ఫైలేరియా, చికున్‌గున్యా, స్వైన్‌ఫ్లూ, మెదడువాపు వంటి వ్యాధుల విజృంభించే అవకాశం ఉంది. అయితే వాటి బారిన పడకుండా ముందస్తుగా తీసుకోవలసిన జాగ్రత్తలపై ఇప్పుడు తెలుసుకుందాం.


మలేరియా..

వర్షా కాలంలో వచ్చే జబ్బుల్లో మొదటిది మలేరియా. ఈ వ్యాధికి కారణ మయ్యే ప్లాస్మోడియం పరాన్నజీవి ఎక్కువగా ఆడ ఎనాఫిలిస్‌ దోమ ద్వారా వ్యాపిస్తుంది. పంట కాలువలు, చెరువు కాలువల్లో ఉన్న నీటిలో ఎక్కువగా వృద్ధి చెందుతాయి. దోమ కాటుతో శరీరంలో ప్రవేశించిన ప్లాస్మోడియం పరాన్న జీవి శరీరంలోని ఎర్ర రక్తకణాలపై దాడి చేస్తుంది. దీంతో 10-14 రోజుల్లో రోజు విడిచి రోజు చలితో కూడిన జ్వరం రావడం, తలనొప్పి, ఒంటి నొప్పులు ఉంటాయి. కొన్నిసార్లు వాంతులు కూడా రావచ్చు. ఈ జ్వరం మెదడుకు సోకి సెరిబ్రల్‌ మలేరియాకు దారి తీయవచ్చు. కిడ్నీ, కాలేయాన్ని కూడా దెబ్బ తీస్తుంది. ఇవి రాత్రి పూట కుడతాయి. ఇవి కుట్టిన వెంటనే దద్దుర్లు, నొప్పి వంటి లక్షణాలు ఏర్పడతాయి.


డెంగ్యూ..

 ఎడిస్‌ ఈజిప్ట్‌ దోమ కారణంగా డెంగ్యూ వ్యాధి సోకుతుంది. ఈ దోమ శరీరంపై తెల్లని చారలు ఉంటాయి. ఎక్కువగా పగటి పూట కుట్టే ఈ దోమ వల్ల నొప్పి ఉండదు. పరిశుభ్రమైన నిల్వ ఉన్న నీటిలో ఇది వృద్ధి చెందుతుంది. మూతలేని నీళ్ల ట్యాంకులు, సిమెంట్‌, తారు రోడ్లపై నిల్వ ఉన్న నీటిలో, పూల కుండీలు, టైర్లు, కొబ్బరి బొండాలు, కూలర్లలో నిల్వ ఉన్న నీటిలో దోమలు పెరుగుతాయి. దోమ కుట్టిన తరువాత వారం రోజులకు తీవ్రమైన జ్వరం వచ్చి కళ్లు నొప్పి పెడతాయి. ఎముకులు, కండరాలు కదపలేని నొప్పి వస్తుంది. శరీరం పై ఎర్రటి పొక్కులు వస్తాయి. వాంతులు, వికారం, రక్తంతో కూడిన మల విసర్జన, కడుపు నొప్పి, తదితర లక్షణాలు ఉంటాయి. బీపీ తగ్గడంతో పాటు ప్లేట్‌లెట్స్‌ సంఖ్య తగ్గుతుంది. కొన్ని సార్లు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.


చికెన్‌ గున్యా..

ఈడిస్‌ ఈజిప్ట్‌ అనే దోమ ద్వారానే చికెన్‌గున్యా సోకుతుంది. పగటి పూట కుట్టే ఈ దోమ.. ఈ వ్యాధిగ్రస్థులకు కుట్టిన తరువాత వేరొకరికి కుట్టి వ్యాపిం పజేస్తుంది. ఈ వ్యాధి సోకితే జ్వరం, కీళ్ల నొప్పులు ఉంటాయి. మంచం దిగి అడుగు వేయలేని పరిస్థితి ఉంటుంది.


మెదడువాపు వ్యాధి..

ఈ వ్యాధిని జపనీస్‌ ఎన్‌సెఫలైటీస్‌గా పిలుస్తారు. ఈ వైరస్‌ ఉన్న పందులను కుట్టిన దోమలు మనుషులను కుట్టడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ప్రధానంగా పిల్లలకు ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉంది. తీవ్రమైన తలనొప్పి, మెదడు పొరల్లో వాపు ఉంటుంది. శరీరంలో వణుకు వస్తుంది. కొన్నిసార్లు కోమాలోకి వెళ్లిపోవచ్చు. శరీరంలో ఏదైనా ఒక భాగం చచ్చుబడిపోయే అవకాశం ఉంది.


ఫైలేరియా..

ఆడ క్యూలెక్స్‌ దోమ కాటు ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. ఇది మురుగు, బురద గుంటలు, సెప్టిక్‌ ట్యాంకుల్లో వృద్ధి చెందుతాయి. తాగునీటిలో కూడా పెరిగే అవకాశం ఉంది. లార్వా దశలోని ఫైలేరియా కారక పురుగులు మనుషుల రక్తంలోకి ప్రవేశిస్తాయి. ఈ దోమ కుట్టడంతో ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ పురుగులు లింఫ్‌ నాళాల్లోకి వెళ్లి చనిపోతాయి. దీంతో ఆ నాళం మూసుకుపోయి వాపు వస్తుంది. ఇది కాళ్లకు, చేతులకు రావచ్చు.


స్వైన్‌ ఫ్లూ..

దీనిని ఇన్‌ఫ్లూయేంజా వైరస్‌గా పిలుస్తారు. సాధారణంగా పందుల్లో ఫ్లూ జ్వరాన్ని కలిగించే హెచ్‌-1 ఎఎన్‌-1 వైరస్‌తో ఇది వ్యాపిస్తుంది. ఫ్లూ జ్వరం వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు స్వైన్‌ఫ్లూలో ఉంటాయి. మక్కు కారడం, దగ్గు, గొంతు నొప్పి, తుమ్ములు, కళ్ల వెంట నీరు కారడం, వాంతులు, విరేచనాలు, ఒంటి నొప్పులు, జ్వరం ఉంటాయి. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా ముక్కుకు, నోటికి గుడ్డ అడ్డంగా కట్టుకోవాలి.


డయేరియా..

కలుషితమైన నీరు, ఆహారం వల్ల డయేరియా వచ్చే అవకాశం ఎక్కువ. ఈకోలిఎర్సినియా, సాల్మానిల్లా, తదితర బ్యాక్టీరియాల వల్ల డయేరియా వస్తుంది. వాంతులు, విరేచనాలు ఎక్కువగా అవుతాయి. కడుపు నొప్పి, దాహం వంటి లక్షణాలు ఉంటాయి. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. తాగునీటి పైపులైన్లు లీకేజీ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. భోజనానికి ముందు, మల విసర్జన తరువాత చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.


జాగ్రత్తలు ముఖ్యం

కాచి చల్లార్చిన నీటినే తాగాలి. రక్షిత నీటి పథకం ట్యాంకులు, బోరు బావుల్లో క్లోరినేషన్‌ చేయాలి. ఆహార పదార్థాలపై ఈగలు, దోమలు వాలకుండా మూతలు పెట్టాలి. పరిసర ప్రాంతాల్లో మురుగు నీరు, తాగునీరు రోజుల తరబడి నిల్వ లేకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి. ఏ విధమైన లక్షణాలు కనబడినా వైద్యులను సంప్రదించాలి.

- పి.అనీల్‌, కొమరాడ పీహెచ్‌సీ వైద్యులు

Advertisement
Advertisement
Advertisement