Abn logo
Apr 22 2021 @ 00:39AM

విపత్తు వేళ పాఠశాల పరీక్షలా?

ప్రధాని మోదీ చొరవతో సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షల్ని రద్దు చేసింది. ఇంటర్ పరీక్షల్ని అంటే పన్నెండో తరగతి పరీక్షల్ని వాయిదా వేసింది. మోదీనే అలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత మనం మాత్రం ఎందుకు విద్యార్థులను కష్టపెట్టాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అదే తరహా నిర్ణయం తీసుకున్నారు. టెన్త్ పరీక్షలు రద్దు చేశారు. ఇంటర్ పరీక్షల్ని వాయిదా వేశారు. అన్ని రాష్ట్రాలు దాదాపుగా అదే పనిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వైకాపా ప్రభుత్వం మాత్రం పరీక్షలు నిర్వహించి తీరుతామని భీష్మించుకొని కూర్చుంది. ఒకటవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతి వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించి, పదవ తరగతి, ఇంటర్ పరీక్షలు మాత్రం నిర్వహించితీరతామని మొండిగా ప్రకటించింది.


ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్నట్లుగా పలు విశ్వవిద్యాలయాలకు చెందిన వైస్ ఛాన్సలర్లు కూడా ముఖ్యమంత్రి జగన్ మెప్పును పొందాలని కరోనా క్లిష్ట పరిస్థితుల్లో యు.జీ, పీజీ పరీక్షలు నిర్వహించడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. కరోనా వల్ల ఈ పర్యాయం విద్యాసంవత్సరం చాలా ఆలస్యంగా ప్రారంభమైంది. అంతేగాక యు.జీ. కోర్సులకు ఆన్‌లైన్ అడ్మిషన్స్ నూతనంగా ప్రవేశపెట్టారు. దీంతో నిన్నమొన్నటి వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగింది. సరిగ్గా ప్రథమ సంవత్సర డిగ్రీ విద్యార్థులు క్లాసులో కూడా కూర్చోలేదు. ఇంతలోనే మే మాసంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం వారు ప్రకటించడంతో విద్యార్థులు, అధ్యాపకులు అవాక్కయ్యారు. పైగా ఈ విద్యాసంవత్సరం నుంచి కామన్ కోర్‌గా నూతన సిలబస్‌ను కూడా ప్రవేశపెట్టారు. నిన్నమొన్నటి వరకు చాలా సబ్జెక్ట్‌లకు పాఠ్యపుస్తకాలు కూడా రాలేదు. విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం, సెమిస్టర్‌కు కాలపరిమితి తక్కువగా ఉండటం చేత కనీసం నూతన సిలబస్ ను కొంత తగ్గించాలనే ప్రయత్నం కూడా విశ్వవిద్యాలయ అధికారులు చేయలేదు. పై కారణాలన్నీ విస్మరించి పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.


పరీక్షలు నిర్వహించడానికి ఎవరికుండే పంతాలు, అవసరాలు వారికి ఉండి ఉండొచ్చు. కానీ కరోనా విలయతాండవం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ వల్ల విద్యార్ధులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు ప్రమాదం బారినపడతారనేది వాస్తవం. పరీక్షల వల్ల కరోనా బారినపడితే ఎవరు బాధ్యత వహిస్తారు? విద్యార్థుల, ఉపాధ్యాయుల ప్రాణాలకు ఎవరు హామీ ఇస్తారు? ఇటీవల జరిగిన స్థానిక, పురపాలక, పరిషత్ ఎన్నికల్లో విధులు నిర్వహించడానికి వెళ్ళిన అనేకమంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. 


శానిటైజేషన్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించి పరీక్షలు నిర్వహిస్తామని విద్యామంత్రి చెబుతున్నా అందుకు పాఠశాలలకు కేటాయిస్తున్న నిధులు అంతంతమాత్రమే. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ఉపాధ్యాయులకు సెలవులు కూడా మంజూరు చేయడం లేదు. గత విద్యాసంవత్సరంలో కూడా కరోనా బారినపడి సుమారు వంద మంది ప్రభుత్వ – ప్రైవేటు ఉపాధ్యాయులు మరణించారు. కరోనాతో మరణించిన వైద్యసిబ్బందికి, శానిటరీ సిబ్బందికి లక్షల్లో ఎక్స్‌గ్రేషియా ఇచ్చిన ప్రభుత్వం ఉపాధ్యాయులను మాత్రం కనీసం పట్టించుకోలేదు. కరోనా లాక్‌డౌన్ వల్ల అనేకమంది ప్రైవేటు – కార్పొరేటు ఉపాధ్యాయులు – అధ్యాపకులు వేలాదిమంది జీవనభృతిని కోల్పోయి రోడ్డున పడ్డారు. అప్పులతో అవస్థలు పడలేక, కుటుంబ భారాన్ని మోయలేక అనేక మంది ఉపాధ్యాయులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అటువంటి సమయంలో జగన్ ప్రభుత్వం వారిపై కనీసం కనికరం చూపలేదు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు వేల రూపాయిల భృతిని ఇటీవల ప్రకటించడం అభినందనీయం. కెసిఆర్ ప్రకటించిన తరువాత కూడా ముఖ్యమంత్రి జగన్ స్పందించకపోవడం రాష్ట్రంలోని ఉపాధ్యాయుల పట్ల ఆయనకున్న గౌరవం ఏపాటిదో స్పష్టమవుతుంది. ఆ గౌరవాన్ని ఉపాధ్యాయులే చేతులారా తగ్గించుకున్నారనేది వాస్తవం. 2019 ఎన్నికలకు ముందు సి.పి.యస్‌ను రద్దు చేస్తామని, పీఆర్సీని సవరిస్తామని, డీఏలు సకాలంలో చెల్లిస్తామని ప్రకటించిన జగన్ అధికారంలోకి వచ్చాక ఆ దిశగా అడుగులు వేయలేదు. లాక్‌డౌన్ సమయంలో ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద డ్యూటీలు వేసి అవమానించారు. ఈ విషయాలను, అవమానాలను ఏమాత్రం పట్టించుకోకుండా కొన్ని ఉపాధ్యాయ సంఘాల వారు ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించినప్పుడు ప్రభుత్వం పక్షాన నిల్చి ఎన్నికలకు తాము కూడా సిద్ధంగా లేమని ప్రకటించడం నిజంగా సిగ్గుచేటు. 


ఏదీ ఏమైనా కరోనా సెకండ్ వేవ్ అత్యంత ప్రభావం చూపిస్తూ, అనేకమంది ప్రాణాలను హరిస్తున్న ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో పరీక్షల నిర్వహణ అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోమారు పునఃసమీక్షించాలి. పంతాలకు, మొండి పట్టదలకు ఇది సమయం కాదు. పరీక్షలను సాధ్యమైనంత వరకు రద్దు చేయడం ఉత్తమం. తప్పనిసరిగా పరీక్షలను నిర్వహించి తీరాలనే తలంపే ప్రభుత్వానికి ఉంటే కరోనా సెకండ్ వేవ్ శాంతించేంత వరకు వాయిదా వేస్తే బాగుంటుంది. విద్యార్థుల – ఉపాధ్యాయుల – అధ్యాపకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకోవాలనీ విద్యార్థులు, విద్యార్ధుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఒక్కటి మాత్రం నిజం పరీక్షల కంటే ప్రాణాలు విలువైనవి.

డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్

Advertisement
Advertisement
Advertisement