Abn logo
Apr 10 2020 @ 10:35AM

ప్రకృతిని కాపాడితేనే...

ఆంధ్రజ్యోతి(10-04-2020)

‘సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఒక వ్యాధి ఎలా విజృంభిస్తుంది?’ అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ‘వడ్లగింజలు’ కథలో చెప్పినట్టు రెట్టింపు, రెట్టింపు అయిపోతూ ఉంటుంది. కరోనా వ్యాధి ప్రతి ఆరు రోజులకు బాధితుల సంఖ్యను, మృతుల సంఖ్యను రెట్టింపు చేస్తోంది. మీరు గమనిస్తే ఆ విషయం అర్థమవుతుంది. రోజూ ఒకటి, రెండు పెరగడం కాదు. ఆరు రోజుల క్రితం వంద ఉంటే ఇప్పుడు రెండు వందలు అవుతుంది. క్రమశిక్షణ పాటించని దేశాల్లో దీని తీవ్రత ఎక్కువ. ప్రభుత్వాలు చెప్పినా ప్రజలు వినరు. క్రమశిక్షణ పాటించరు. అలాంటి దేశాలకు కరోనా విస్తరిస్తోంది. వాటి ద్వారా మనకూ వస్తోంది. మన దగ్గర కూడా క్రమశిక్షణ చాలా తక్కువ. ‘ఎంతమంది పోయినా ఫరవాలేదు, నా ఇష్టం వచ్చిన ధోరణిలోనే ఉంటాను!’ అన్నట్టు ప్రవర్తిస్తారు. మన బుద్ధిలో మార్పు రానంత వరకు ఎన్ని చట్టాలు పెట్టినా ఫలితం ఉండదు. విదేశాల నుంచి వచ్చిన వారిని పద్నాలుగు రోజుల పాటు ఇంటి పట్టునే ఉండమంటే ఉండకుండా తప్పించుకు తిరుగుతున్నారు. కొంతమంది విమానం దిగేముందు జ్వరం మాత్ర వేసుకొని వచ్చారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు! 


ఐసొలేషన్‌ అంటే అంత భయం ఎందుకు? ఇంట్లో ఇద్దరు ఉంటే ఎవరి ఫోన్లలో వాళ్లు బిజీగా ఉంటున్నారు కదా! అది ఏకాంతం కాదా? దేశం కోసం, ధర్మం కోసం, ప్రజాసంక్షేమం కోసం మన నుంచి వ్యాధి ఇతరులకు వ్యాపించకుండా ఉండడం కోసం పద్నాలుగు రోజులు కాలు బయటపెట్టకుండా ఉండలేమా? శ్రీరాముడు  పద్నాలుగేళ్లు అరణ్యంలో ఉన్నాడు. వ్యాధి విస్తరించకుండా ఉండాలంటే మనం ఏకాంతంగా ఉండడానికి సిద్ధపడాలి. ‘ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్‌’ అనేది ఇప్పుడు బాగా వర్తిస్తుంది. ఖర్చులు తగ్గించుకోవడానికి, ఆరోగ్యం బాగా చూసుకోవడానికి, ఏకాంతంగా గడపడానికి, మనుషుల మధ్య అనుబంధం పెరగడానికి కరోనా సహకరించింది అనుకోవాలి. 


వెంట్రుకలో వెయ్యో వంతులేని క్రిమి, కోట్ల జనాభాను శాసిస్తోంది. వేదాంతం ఇక్కడే నేర్చుకోవాలి. ‘నలుగురూ కలవద్దు’ అంటే వింటారా? ప్రతిచోటా ఊరేగింపులు, గుమికూడటమే. ఆలయాలన్నీ మూతపడ్డాయి. ఇన్ని ఆలయాలు, ఇన్ని ఆరాధనలు మనల్ని ఎందుకు కాపాడలేకపోతున్నాయి? ఎందుకంటే మన బుద్ధి మార్చుకోవడం లేదు. మనస్సు మార్చుకోవడం లేదు. మనస్సుకేసి, బుద్ధికేసి చూడడం లేదు. పూజ వల్లనో, వ్రతం వల్లనో, దర్శనం వల్లనో ఏదో అయిపోవాలని ఆశిస్తున్నాం. అలా ఎప్పటికీ జరగదు. ఈ అతి చేయడాన్ని తగ్గించుకుని మన పూజా మందిరంలో దేవుడి దగ్గర ఒక స్తోత్రం చదువుకుంటే సరిపోదా? కరోనాను మించిన దైవం ఉందా? దైవలీల అంటే ఇదే కదా! రాష్ట్రప్రభుత్వం చెప్పినా, కేంద్ర  ప్రభుత్వం చెప్పినా, పర్యావరణ ప్రేమికులు చెప్పినా వినని వాళ్లం ఈరోజు చేతులు వంద సార్లు కడుగుతున్నాం. మూతి ముప్ఫైసార్లు కడుగుతున్నాం. బస్టాండులో బల్లలన్నీ ఎప్పుడైనా తుడిచారా? ఇప్పుడు కడిగేస్తున్నారే! కరోనా దేవతా! నీకు నమస్కారం. దేశంలో చాలా మార్పులు తెచ్చింది కరోనా. ఇప్పుడు అందరికీ భయం వచ్చేసింది. అయితే తగ్గాక కూడా ఇది అలాగే కొనసాగాలి. ప్రకృతికి మానవుడు ఒక శతాబ్దకాలంగా చేస్తున్న హానికి ప్రతిక్రియే ఇటువంటి వ్యాధి. ఇటలీలో వృద్ధులకు వైద్య చికిత్సలు చేయడానికి నిరాకరించారన్న వార్తలు చదివాం. ఒక్కరోగం కారణంగా ప్రపంచం ఎంత అమానుషం అయిపోతుందో ఆలోచించండి. మానవ సంబంధాలు ఇంతే! ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేస్తే ఈ ఘోష తప్పదు. ఇప్పటికైనా ప్రకృతిని కాపాడుకోవడం మీద దృష్టి పెడదాం!


- డా. గరికిపాటి నరసింహారావు

Advertisement