Abn logo
May 8 2020 @ 03:12AM

సత్యనిష్ఠ

గాంధీజీ గోఖలేను తన రాజకీయ గురువుగా పేర్కొనేవారు. రాజకీయ రణరంగంలో సైతం సత్యనిష్ఠను కోల్పోని గోఖలే ధీరోదాత్తతే దీనికి కారణం.


ఎల్బీ కమిషన్ ఎదుట సాక్ష్యమివ్వడానికి గోపాలకృష్ణ గోఖలే లండన్ వెళ్ళిన సందర్భంలో పూనా నుంచి కొందరు స్నేహితులాయనకు లేఖలు రాశారట. ప్లేగ్ వ్యాధి నిరోధ కార్యక్రమంలో పని చేస్తున్న కొందరు బ్రిటిష్ సైనికులు అత్యాచారాలకు పాల్పడ్డారని, ప్రజలు ఉద్రిక్తులైవున్నారని వారు ఆ లేఖలలో ఉటంకించారట. గోఖలే బ్రిటిష్‌వారి చర్యలను నిరసిస్తూ వెంటనే కొన్ని ప్రకటనలు చేశారట. ఆయన ఇండియా తిరిగి వచ్చిన తరువాత విచారించగా బ్రిటిష్ సైనికులపై వచ్చిన ఆరోపణలన్నీ అసత్యాలని తేలింది. వాటిని రుజువు చేయడానికి, ఆయనకు మొదట లేఖలు రాసిన వారొక్కరూ ముందుకు రాలేదు. దీనితో గోఖలే అప్పటి బొంబాయి ప్రభుత్వానికి, తాను నిరసించిన బ్రిటిష్ సైనికులకు క్షమాపణ చెప్పుకున్నారు. గోఖలే నిరాధారమైన ఆరోపణలు చేసినందున బ్రిటిష్ వారొక వంక, సిగ్గు విడిచి క్షమాపణ చెప్పుకున్నందుకు తోటి భారతీయులు మరొక వంక ఆయనను తూర్పార పట్టడం జరిగిందట.


ఈ సంఘటన గోఖలే జీవితంలో ఒక ముఖ్య ఘట్టం. ఆయన సమకాలికులైన ప్రతిపక్షులు ఈ ఉదంతాన్ని ఏ విధంగా వ్యాఖ్యానించినా, అది ఆయన మానసికౌన్నత్యానికి, నైతిక ధైర్యానికి తార్కాణంగానే భారతదేశం స్వీకరించింది. ఆయన ఉదాత్త స్వభావాన్ని ప్రస్తుతించింది.


గోఖలే మాతృదేశ భక్తి అకుంఠితమైనది. కనుకనే ఆయన బ్రిటిష్ సైనికులపై ఆరోపణల నిజానిజాలు తెలిసేవరకు ఆగకుండా తొందరపడి నిరసించడం జరిగింది. అయితే దేశభక్తికి తీవ్రతలో ఏ మాత్రం తీసిపోని సత్యనిరతి సైతం ఆయన స్వభావంలో ఉన్నది. అందుచేతనే తన పొరపాటును గ్రహించిన వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పుకొనడానికి ఆయన వెనుకాడలేదు.


గాంధీజీ గోఖలేను తన రాజకీయ గురువుగా పేర్కొనేవారు. రాజకీయరణ రంగంలో సైతం సత్యనిష్ఠను కోల్పొని గోఖలే ధీరోదాత్తతే దీనికి కారణం. కావడానికి ఆయన మితవాదే. అయినా మాతృదేశ విముక్తే ఆయన లక్ష్యమనడంలో సందేహం లేదు. దాన్ని సాధించడానికి అనుసరించదగిన మార్గాలేవి అనే విషయమై ఆయనకు, ఆనాటి ఇతర నాయకులకు అభిప్రాయ భేదాలుండి ఉండవచ్చు. అయినా ఆయన మరణానంతరం గాంధీజీ నాయకత్వాన మహోధృతంగా, అహింసాయుతంగా సాగిన సత్యాగ్రహ సమరాలపై గోఖలే ప్రభావం లీలామాత్రంగానైనా పడకపోలేదు.

1966 మే 8 ‘ఆంధ్రజ్యోతి’ సంపాదకీయం ‘శ్రీ గోఖలే శతజయంతి’ నుంచి

Advertisement
Advertisement
Advertisement