Abn logo
Jan 21 2021 @ 01:15AM

అమరావతిలో సత్యమేవ జయతే

నిజాలు దాగుతాయా? జాతి సిగలో జాబిలమ్మలా అమరావతిని రాజధానిగా గత ప్రభుత్వం తీర్చిదిద్దితే నేటి ప్రభుత్వం కక్షగట్టి తప్పుడు ప్రచారాలు చేసింది. రాజధాని పేరుతో టీడీపీ నాయకులు లక్షకోట్ల అవినీతికి పాల్పడ్డారని, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ చేసి వేల కోట్లు దోచుకున్నారని పుస్తకాలు అచ్చువేసి మరీ తప్పుడు ప్రచారం చేశారు. రాజధానిలో ఇన్‌సైడర్‌ పేరుతో ప్రజలను మభ్య పెట్టే కుట్రలో ప్రభుత్వం విఫలమయ్యింది. రాజధాని భూముల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ లేదని రాష్ట్ర హైకోర్టు మంగళవారం నాడు స్పష్టం చేసింది. ‘The concept of offence of insider trading is not made applicable to purchase of any immovable properties like lands of private individuals when the same is only confine to purchase of security bonds under the SEBI Act the same cannot be purchase of land. The material produce before the court by the producers is in the form of paper publications completely belies the publication’ అని హైకోర్టు తీర్పు పేర్కొంది. 


ముఖ్యమంత్రి జగన్‌ తన అధికారాన్ని ఉపయోగించి, ప్రతిపక్షనేత చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని అనేకసార్లు రుజువయ్యింది. ప్రభుత్వ దుష్ప్రచారమంతా కేవలం కట్టుకథలేనని హైకోర్టు తీర్పుతో తేలిపోయింది. కిలారి రాజేశ్‌ అనే వ్యక్తికి రాజధాని ప్రాంతంలో 40 సెంట్ల పొలముంటే, ప్రభుత్వం ఆయనపై అక్రమంగా కేసు పెట్టింది. ప్రభుత్వ తీరుకి నిరసనగా రాజేశ్‌ కోర్టుని ఆశ్రయించాడు. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తదితరులపై నిరాధార ఆరోపణలకు ముఖ్యమంత్రే బాధ్యుడని, ప్రభుత్వం చేసిన దుష్ప్రచారానికి ఎలాంటి ఆధారాలు లేవని హైకోర్టు స్పష్టం చేసింది. భూముల క్రయవిక్రయాల్లో తమకు నష్టం జరిగిందని, కొనుగోలుదారులు, అమ్మకందారులు ఎక్కడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయలేదు. పాలకులకు అనుకూలుడు అయిన ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు, ఐపీసీ చట్టాల్లోకి రాదని హైకోర్టు కుండబద్దలు కొట్టినట్లు చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వ ప్రతినిధులు, అధికార పక్షం వారు ఏం సమాధానం చెబుతారు?


సంబంధంలేని వ్యక్తులతో రాజకీయ క్రీడ ఆడుతున్న ప్రభుత్వం అమరావతిని ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ పేరుతో సర్వనాశనం చేసింది. విశాఖలో పాలకులు సాగిస్తున్న భూబాగోతాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అక్కడి భూములను అమ్ముకోవడానికే ప్రభుత్వం అమరావతి లక్ష్యంగా దుష్ప్రచారానికి తెగబడింది. 2014 జూన్ 2 ప్రమాణస్వీకారం నుంచి సెప్టెంబర్‌ 4న అమరావతి పేరు రాజధానిగా ప్రకటించే వరకు నాలుగు నెలల్లో 128 ఎకరాలు మాత్రమే రిజిస్ట్రేషన్‌ జరిగింది. వాటిలో కూడా వంద ఎకరాలు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కొనుగోలు చేశారు. మిగిలిన 28 ఎకరాలు ఇతరులు కొనుగోలు చేశారు. వాస్తవం ఇదైతే మంత్రి బుగ్గన 4,070 ఎకరాలని శాసనసభ సాక్షిగా అబద్ధాలు చెప్పారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సిటింగ్‌ జడ్జితో విచారణ జరిపించమంటే జరిపించలేదు. 


రాజధాని అమరావతిలో ఏదో జరిగిందనే భ్రమను ప్రజల్లో కలిగించి రాజకీయ లబ్ధి పొందేందుకు అధికారపక్షం ఆరాటపడింది. అందుకే అసెంబ్లీ సాక్షిగా తప్పుడు ప్రకటనలకు సైతం వెనుకాడబోవటమే కాకుండా కమిటీల పేరుతో తప్పుడు నివేదికలు ఇప్పించుకున్నారు. అమరావతిలో భూ అక్రమాలపై సీబీఐ లేదా సీఐడీతో విచారణ జరిపించాలని 2020 డిసెంబర్ 27న మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అదే రోజు అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం 4,069.94 ఎకరాలను బినామీ పేరుతో కొనుగోలు చేసిందని మంత్రివర్గ ఉపసంఘం ఏవిధంగా నిర్ధారణ చేసింది. అంటే మంత్రివర్గానికి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ అంటే ఏమిటో కూడా తెలియలేదనుకోవాలా లేదా కుట్రలో భాగంగా చేశారనుకోవాలా? చంద్రబాబు, లోకేష్‌, ప్రత్తిపాటి, వేమూరి రవికుమార్‌, పరిటాల సునీత, సుధాకర్‌ యాదవ్‌, యనమల, పయ్యావుల, కంభంపాటి, నారాయణ, జీవీఎస్‌ ఆంజనేయులు అమరావతిలో బినామీల పేరుతో భూములను దోచేశారని నివేదిక విడుదల చేసింది. మరో అడుగు ముందుకు వేసి 2020 జనవరి 22న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణలో భాగంగా ప్రత్తిపాటి, నారాయణలపై 2020 జనవరి 23న సీఐడి కేసులు పెట్టింది. రాజధాని అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు సిట్‌ ఏర్పాటు కోసం డాక్టర్‌ కొల్లి రఘురామ రెడ్డి నేతృత్వంలో బాబూజీ, వెంకట అప్పలనాయుడు, శ్రీనివాసరెడ్డి, జయరామరాజు, విజయభాస్కర్‌, గిరిధర్‌, కెన్నడి, శ్రీనివాసన్‌, రాజశేఖర్‌ రెడ్డి సభ్యులుగా 2020 ఫిబ్రవరి 21న కొత్తరకం నాటకానికి తెరలేపింది. మరో అడుగు ముందుకు వేసి అమరావతిలో అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు పార్లమెంటులో సీబీఐ విచారణకు పట్టుబట్టాలని గత సెప్టెంబర్‌ 14న వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఒక దొరను దొంగగా చూపించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం చేసిన విన్యాసాలు హైకోర్టు తీర్పుతో పటాపంచలయ్యాయి. రాజధానిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ జరిగిందని, అందుకు సాక్ష్యాధారాలు మా వద్ద ఉన్నాయన్న పెద్ద మనుషులు నేడు ఎందుకు మొహం చాటేస్తున్నారు? 


చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్ర పుటల్లో నిలిచిపోతుందనే దుగ్ధతో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ పేరుతో అమరావతిని నిలిపివేశారనే భావం ప్రజల్లో బలంగా ఉంది. గతంలో సైబరాబాద్‌ రూపకర్తగా అభివృద్ధికి చిరునామాగా ఉన్న చంద్రబాబు మీద నమ్మకంతో 29 గ్రామాల్లో 28,538 మంది రైతుల నుంచి భూసమీకరణ పద్ధతిలో రికార్డు స్థాయిలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా విలువైన 34 వేల ఎకరాలను సమీకరించారు. ఇందుకు జగన్ అసెంబ్లీ సాక్షిగా ఆమోదం తెలిపారు. ఆయనకు అమరావతి ప్రాంతం రాజధానిగా ఇష్టం లేకపోతే ఆనాడే ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకించి ఉంటే రాజధాని రైతులు ఆయన భావనను అర్థం చేసుకునే వారు. అలా కాకుండా నాడు సమర్ధించి నేడు వ్యతిరేకించడం ఏమిటి? 


ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ అని పదే పదే రాజధానిపై బురద చల్లి రాజధానిని తరలించుకోవాలని అనేక కుట్రలు చేశారు. ఒకే కులానికి చెందిదన్నారు, ముంపు వస్తుందన్నారు, వ్యయంతో కూడుకుందన్నారు, శ్మశానంతో పోల్చారు, నిర్మాణాలకు పనికిరాదన్నారు, ఐఐటీ నివేదికలను ఫోర్జరీలు చేశారు. అయితే ఒక్క ఆరోపణకు ఆధారాలను కూడా ప్రజల ముందు ఉంచలేకపోయారు. రాజధాని ప్రాంతంలో జరిగిన భూమి కొనుగోలు అత్యంత పారదర్శకంగా జరిగింది. విజయవాడ – గుంటూరు మధ్య రాజధాని రాబోతుంది. 2014 జూన్ 8 నుంచి అనేక దినపత్రికల్లో వార్తలు వస్తూనే ఉన్నాయి. 2014 జూలై 2న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో రాశారు. ఆఖరికి జగన్‌ పత్రిక సాక్షిలో 2014 జూలై 23న కొత్త రాజధానికి సరైన ప్రాంతం గుంటూరు – విజయవాడ మధ్యలోనే అని ప్రచురించారు. మరి దాపరికం ఎక్కడుంది? నేడు హైకోర్టు అదే చెప్పింది. భూమి కొనుగోళ్లకు ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ వర్తించదని హైకోర్టు తీర్పు స్పష్టం చేసింది. 


జగన్‌ కక్షపూరిత విధానానికి 400 రోజుల నుంచి రాజధాని రైతులు ఉద్యమిస్తున్నారు. అమరావతి ఆక్రందన జగన్‌కు వినపడటం లేదా? మహిళల ఆక్రందనలు, రైతుల కన్నీళ్లతో అమరావతి తడిచి ముద్దవుతోంది. రాష్ట్ర భవిష్యత్‌ కోసం భూమి ఇచ్చిన రైతు నేడు గుండె కోతకు గురవుతున్నాడు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతున్న రైతులపై ఉక్కు పాదం మోపుతూ వారి హక్కులను కాలరాస్తున్నారు. 16 సార్లు రాజధానిపై ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు పెట్టినా అధికారగణంలో మార్పు రావడం లేదు. జగన్‌ రెడ్డి పెట్టిన క్షోభకు గురై 110 మంది రైతులు తనువు చాలించారు. ఉద్యమాన్ని అణగదొక్కాలని 2661 మంది రైతులు, కూలీలపై క్రిమినల్‌ కేసులు పెట్టారు. ఏడుగురు దళిత రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి 18 రోజులు జైల్లో ఉంచారు. ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెడతారా అని కోర్టు చివాట్లు పెట్టినా మళ్లీ 21 మందిపై అట్రాసిటీ కేసులు పెట్టారు. పొలం పనులు చేసుకుంటున్న రైతుల వద్ద పొలం చుట్టూ పోలీసులను కాపలా పెడుతున్నారు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లుగా ధర్మాన్ని రక్షించడానికి ఆ భగవంతుడు ఏదో ఏదో ఒక రూపంలో వస్తాడని అన్ని మత గ్రంథాలు బోధిస్తున్నాయి. అయితే నేటి పరిస్థితుల్లో ప్రజలే ధర్మాన్ని కాపాడాల్సి ఉంటుంది.

ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ (మాజీ మంత్రి)

Advertisement
Advertisement
Advertisement