Advertisement
Advertisement
Abn logo
Advertisement

అంపశయ్యపై విద్యార్థి ఉద్యమ నేత

కొవిడ్‌తో వెంటిలేటర్‌పై దబ్బేటి మహేశ్‌

రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర

తెలంగాణ పోరులో 40కి పైగా కేసులు 

దయనీయ స్థితిలో ఎంజీఎంలో అవస్థ


ఓరుగల్లు(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జై తెలంగాణ అని నినదించిన ఆ గొంతు ఇప్పుడు పెగలలేకుంది. ఉద్యమంలో బిగిసిన ఆ పిడికిలి సత్తువ కోల్పోయింది. స్వరాష్ట్రం కోసం కదం తొక్కిన ఆయన నేడు కదల్లేకుండా ఉన్నారు. కరోనాతో తీవ్ర అస్వస్థతకు గురై కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్నారు. మెరుగైన వైద్యం, ఆర్థిక సాయం కోసం అర్థిస్తున్నారు. ఇదీ కాకతీయ విశ్వవిద్యాలయ విద్యార్థి ఉద్యమ నేత దబ్బేటి మహేశ్‌ పరిస్థితి.


మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలానికి చెందిన మహేశ్‌ ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌, పీహెచ్‌డీ చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయంలో పార్ట్‌ టైమ్‌ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్న ఆయన, సమైక్యాంధ్ర పాలకులను నిలదీయడంలో ముందంజలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి ములుగు జిల్లా రాయినిగూడెంలో తలపెట్టిన రచ్చబండ కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా ఉద్యమ సెగను రగిలించారు. మానుకోటలో వైఎస్‌ జగన్‌ పర్యటనను అడ్డుకుని తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను చాటారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న మహేశ్‌ ఇప్పుడు ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉన్నారు. మెరుగైన వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేకపోవడంతో ఎంజీఎం ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. మహేశ్‌కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండేళ్ల కిందట ఆయన సోదరుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. తండ్రి సీతయ్యకు ఇటీవలే బైపాస్‌ సర్జరీ అయింది. దీంతో ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబం మహేశ్‌కు మెరుగైన వైద్యం అందించలేక ఇబ్బందులు పడుతోంది.


పట్టించుకోని ప్రజా ప్రతినిధులు..

మహేశ్‌కు మెరుగైన వైద్యం అందించేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు.. ఎవరూ స్పందించడం లేదని కేయూ విద్యార్థి సంఘాల నేతలు వాపోతున్నారు. ఉద్యమంలో నాటి సర్కారు మహేశ్‌పై 40కిపైగా కేసులను నమోదు చేసిందని గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేలను కలిసి పరిస్థితిని వివరిస్తే.. ఎంజీఎం సూపరింటెండెంట్‌కు ఫోన్‌ చేసి చేతులు దులుపుకొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని కోరుతున్నారు.

Advertisement
Advertisement