Abn logo
Sep 30 2020 @ 01:47AM

సంస్కృతం కొందరికే అమృతం

Kaakateeya

సంస్కృతం యూరోప్‌ నుంచి, కొన్ని ప్రాకృత భాషల నుంచి పదాలను ఎలా అరువు తెచ్చుకుందో ద్రవిడ భాషలు కూడా సంస్కృతం నుంచి అలాగే అరువు తెచ్చుకున్నాయి. సంస్కృతంతో ఎంతో సారూప్యం కలిగిన ఆంగ్ల భాషను దానికి పోటీగా, శత్రువుగా కొందరు సంస్కృత భాషాభిమానులు భావిస్తున్నప్పుడు... తమ భాషలతో ఎలాంటి సారూప్యం లేని సంస్కృతాన్ని కొన్ని భాషలవారు వ్యతిరేకించడంలో తప్పేముంది? 


‘మృత సంజీవనిపైనా అక్కసు’ పేరుతో డా.పి. భాస్కర యోగి ఈ నెల 24న రాసిన వ్యాసం చూసిన తర్వాత స్పందించకుండా ఉండలేకపోతున్నాను. ‘‘మోదీని వ్యతిరేకించే కుత్సిత యత్నంలో ఈ దేశ ప్రాచీనతను అవహేళన చేయడం అజ్ఞానానికి పరాకాష్ఠ’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో మోదీని వ్యతిరేకించడమంటేనే కుత్సిత యత్నమా అనే రాజకీయ చర్చను పక్కనపెడదాం. భాషాపరమైన చర్చకు పరిమితమవుదాం. మన ప్రాచీనత అంటే సంస్కృతమేనా? అసలు సంస్కృతం అనే పదానికి అర్థం ఏమిటి? సంస్కృతం అంటే సంస్కరించబడినది అని అర్థం. (సహజమైన తెలుగులో ఈ ‘బడు’ అనే కర్మణి ప్రయోగం లేదు. అది సంస్కృతాధిపత్యం వల్ల మన మీద రుద్ద‘బడి’నదే) మాది ‘సంస్కృత’ భాష అనడంలోనే ఒక ఆధిపత్య భావన ఉన్నదని, అంతకుముందున్న భాషలు సంస్కారం లేనివిగా అవహేళన చేసే ఒక ప్రయత్నం ఉన్నదని కొందరి అభిప్రాయం. పలువురు భాషా శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం సంస్కృతం ఒక ఇండో ఆర్యన్‌ భాష. ఇండో ఆర్యన్‌ భాషలు ఇండో యూరోపియన్‌ భాషా కుటుంబంలో ఒక భాగం. ఆంగ్లం సహా పలు యూరోపియన్‌ భాషలతో సంస్కృతానికి దగ్గర పోలికలు ఉన్నాయి. పితృ – paternal, మాతృ – maternal, దంత – dental ఇలా ఎన్నో పదాలు చెప్పవచ్చు.

ఆంగ్ల క్యాలెండర్‌లోని నెలల పేర్లు కూడా సంస్కృత సంఖ్యలను పోలి ఉంటాయి. సెప్టెంబర్‌ – సప్త, అక్టోబర్‌ – అష్ట, నవంబర్‌ – నవ, డిసెంబర్‌ – దశ (ఆ కాలంలో సంవత్సరం జనవరితో కాకుండా మార్చితో మొదలయ్యేది. ఆ ప్రకారం లెక్కించి చూడండి). పదాల్లోనే కాకుండా వ్యాకరణపరంగా కూడా ఈ పోలికలు కనిపిస్తాయి. కర్మణి ప్రయోగం, ఉపసర్గలు, ఒక భాషాభాగాన్ని మరో భాషాభాగంగా మలచుకునే పద్ధతి... వీటన్నింటిలో సంస్కృతానికి, ఆంగ్లానికి సారూప్యం ఉన్నది. కేవలం 2,800 మూల పదాలున్న ఆంగ్లం మనకు గొప్ప భాష అయిందా? అని రచయిత ప్రశ్నించారు. గ్రీకు, లాటిన్‌ వంటి పలు భాషా పదాలతో సంస్కృత పదాలకు పోలికలు ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి. ఆంగ్లంతోపాటు సంస్కృతం కూడా అనేక భాషల నుంచి పదాలను స్వీకరించింది. అలాంటప్పుడు సంస్కృతంలో అన్ని పదాలనూ లెక్కించి, ఆంగ్లంలో మాత్రం మూల పదాలనే లెక్కిస్తాననడం అదేం న్యాయం? అన్ని భారతీయ భాషలకూ సంస్కృతం 70 శాతం పదాలను అందించిందనేది తప్పుడు వాదన. ద్రవిడ భాషల మూలాల్లోకి వెళ్లి చూస్తే వాటికి సంస్కృతంతో పోలికలేవీ కనిపించవు. కానీ రానురాను వాటిపై సంస్కృత ప్రభావం పెరిగింది. ఇప్పుడు ఆంగ్ల ప్రభావం కూడా పెరిగింది. నేటి తెలుగు భాషలో సంస్కృత పదాలు ఎన్ని ఉన్నాయో, అంతకుమించి ఆంగ్ల పదాలున్నాయి. అసలు నేడు ఆంగ్ల పదాలు లేకుండా తెలుగు భాషే కాదు, ఏ భారతీయ భాషా పరిపూర్ణం కాజాలదు. భావ వ్యక్తీకరణకు సరిపోదు.

సామాన్యులకు సంస్కృతంతో సంబంధం లేదన్నవారు తమ పేర్లలోని పద నిర్మాణం ఏ భాషదో చెప్పాలని ప్రశ్నించిన యోగి గారు తన పేరు ముందు పెట్టుకున్న ‘డా’ ఏ భాషా పదమో చెప్పాలని విన్నపం. మన భాషకు పదాలు ‘అందించిన’ భాష గొప్పదని అనుకుంటే సంస్కృతంతో పాటు తమిళం, కన్నడం, ఆంగ్లం, గ్రీకు, లాటిన్‌ వంటి భాషలన్నింటికీ మనం రుణపడి ఉండాలి. సంస్కృతం యూరోప్‌ నుంచి, కొన్ని ప్రాకృత భాషల నుంచి పదాలను ఎలా అరువు తెచ్చుకుందో ద్రవిడ భాషలు కూడా సంస్కృతం నుంచి అలాగే అరువు తెచ్చుకున్నాయి. (సంస్కృత నాటకాల్లో కథా నాయకులకు, పై స్థాయి పాత్రలకు సంస్కృతంలోను... స్త్రీ పాత్రలకు, కింది స్థాయి పాత్రలకు వివిధ ప్రాకృత భాషల్లోను సంభాషణలు రాసేవారని... ఆ ప్రాకృత భాషలు అంతరించిన తర్వాత ఆ సంభాషణల్ని సంస్కృతంలోకి అనువదించి ఆ అనూదిత భాగాలకు ఛాయ అని పేరు పెట్టారని ప్రముఖ భాషావేత్త డాక్టర్‌ బూదరాజు రాధాకృష్ణ తెలిపారు). సంస్కృతంతో ఎంతో సారూప్యం కలిగిన ఆంగ్ల భాషను దానికి పోటీగా, శత్రువుగా కొందరు సంస్కృత భాషాభిమానులు భావిస్తున్నప్పుడు... తమ భాషలతో ఎలాంటి సారూప్యం లేని సంస్కృతాన్ని కొన్ని భాషలవారు వ్యతిరేకించడంలో తప్పేముంది? ద్రావిడులు తమ భాషలో వచ్చి చేరిన సంస్కృత పదాలను నిరాకరించి తమ అసలు మూలాలను వెదుక్కోవడంలో దోషమేముంది? ద్రవిడ భాషలకు సంబంధించి ఆంగ్లం ఎలా అన్యభాషో, సంస్కృతం కూడా అలాగే అన్యభాష. కాకుంటే ఒకటి ముందు వచ్చింది... మరొకటి వెనక వచ్చింది. ముందొచ్చినవాడిని మనవాడిగా, తర్వాత వచ్చినవాడిని పరాయివాడిగా భావించడం... కొన్నిసార్లు పొరబడటం సహజం. రానురాను భారతీయుల మూల భాషలపై సంస్కృత ప్రభావం పెరగడం వల్ల ‘‘జనని సంస్కృతంబు సకల భాషలకును’’ వంటి అసత్యాలు సైతం ప్రాచుర్యంలోకి వచ్చాయి. 

ఇక మృత భాష విషయం. మృత అనే పదానికి మోర్టల్‌ అనే ఆంగ్ల పదంతో పోలిక ఉంది. సంస్కృతం మృత భాష కాదు, అమృత భాష (ఇమ్మోర్టల్‌) అని కొందరు అంటుంటారు. కానీ మృత భాష అంటే ఆ భాష మరణించిందని అర్థం కాదు. భాషా శాస్త్రవేత్తల నిర్వచనం ప్రకారం మాతృభాషగా ఒక భాషను మాట్లాడేవారెవ్వరూ లేకపోతే అది మృతభాష అవుతుంది. సంస్కృతం మాతృభాషగా కలిగినవారెవరూ లేకపోవడం వల్ల దానిని మృత భాషగా నిర్వచిస్తున్నారు. మన ప్రాచీన సాహిత్యం లోను, మన సంస్కృతిలోను, మన పేర్లలోను, జీవన విధానంలోను అది సజీవంగానే ఉంది, ఉంటుంది. కానీ సంస్కృతం పట్ల కొందరిలో తీవ్ర వ్యతిరేకత ఉండడానికి చారిత్రక కారణాలున్నాయనేది కూడా సత్యం. ఆ కారణాల లోతుల్లోకి వెళ్లకుండా సంస్కృతాన్ని వారు ప్రేమించి తీరాల్సిందేనని నిర్దేశించలేం. మొఘలుల అత్యాచారాలకు బలై తరాలు గడిచినా వాటిని గుర్తుచేసుకునే కొందరికి తాజ్‌మహల్‌ అందంగా కనిపించదు. దానిని కూల్చివేయాలనో, శివాలయంగా మార్చివేయాలనో వారు భావిస్తారు. అలాగే ‘‘జిహ్వాయా వూపాప్నుయాచ్ఛేదం’’ వంటి అమానుషమైన ధర్మాలు, శంబుక వధ లాంటి ఘట్టాలున్న సాహిత్యం ఏ భాషలో ఉన్నాయో ఆ భాషను తమ అణచివేతకు మూలంగా కొందరు భావిస్తారు.


ఆ భాష ఆధిపత్యం తగ్గి ఇతర భాషీయుల పాలన మొదలైన తర్వాత తమ జీవితంలో వచ్చిన సానుకూల మార్పులతోపాటు, ఆ కొత్త భాషల్ని కూడా కొందరు ప్రేమిస్తారు. లేదంటే సంస్కృతం కంటే వెనక్కి వెళ్లి తమ అసలు మూలాల్ని వెదుక్కుంటారు. అందునా ఆంగ్లేయుల్ని భారతదేశం నుంచి తరిమేసిన తర్వాత ఆంగ్లం మనకు ఒక ఉపకరణమే తప్ప ముప్పు కాదు. కానీ సంస్కృతంలో అలాంటి ముప్పు కొందరికి నేటికీ కనిపిస్తోంది. వారి భయంలో సహేతుకత ఉంది. సంస్కృతానికి యూరోపియన్‌ భాషలతో పోలికలు ఉన్నాయి. ఆర్యులు మనపై దండెత్తి వచ్చినవారనే వాదనలు కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. సింధు లోయ నాగరికత ప్రాంతంలో సేకరించిన జన్యు నమూనాలు ఉత్తర భారతీయులతో కాకుండా దక్షిణ భారతీయుల జన్యువులతో సరిపోలాయని తేల్చిన కొన్ని తాజా పరిశోధనలు ఇలాంటి వాదనలకు ఊతమిస్తున్నాయి. కొందరు భారతీయులు ముస్లింలను, ఆంగ్లేయుల్ని తిరస్కరించడం కోసం సంస్కృతంలో తమ ప్రాచీనతను, అస్తిత్వాన్ని వెదుక్కుంటే... మరికొందరు సంస్కృతాన్ని, దాని ఆధిపత్యాన్ని తిరస్కరించడం కోసం దానికంటే ముందున్న తమ ప్రాచీనతను, అస్తిత్వాన్ని వెదుక్కుంటారు. కొందరు సంస్కృతానంతర ఆధునికతలో తమ అస్తిత్వాన్ని కొత్తగా ఆవిష్కరించుకుంటారు. వారి నుంచి మృత అనే పదానికి ఉదారమైన నిర్వచనాన్ని ఆశించడం సరికాదు. 

భరద్వాజ

Advertisement
Advertisement
Advertisement