Abn logo
Aug 7 2020 @ 00:40AM

స్వచ్ఛతపై నజర్‌

పారిశుధ్యం, పరిశుభ్రతపై 

8 నుంచి వారోత్సవాలు 


(ఆంధ్రజ్యోతి రంగారెడ్డి అర్బన్‌) : ‘గంధగీ ముక్త భారత్‌ (జీఎంబీ) కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పారిశుధ్యంపై అవగాహన కల్పించనుంది. పారిశుధ్యం, పరిశుభ్రత పట్ల ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడమే లక్ష్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఈనెల 8 నుంచి వారంరోజులపాటు పారిద్ధ్యం.. పరిశుభ్రతపై వారో త్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రణాళికలో భాగంగా పారిశుధ్యం, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యమివ్వనున్నారు. ‘మురికి రహిత నా గ్రామం’ అనే అంశంపై విద్యార్థులకు ఆన్‌లైన్‌లో చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలను నిర్వహిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహిస్తారు. 


2019-20లోనే ఓడీఎఫ్‌ జిల్లా..

స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 2019-20 సంవత్సరంలో 47,095 మరుగుదొడ్లను నిర్మించారు. 2011 జనాభా ప్రకారం పూర్తి స్థాయిలో మరుగుదొడ్లను నిర్మించి... జిల్లాను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాగా ప్రకటించారు. 


పెండింగ్‌లో 5,840 నిర్మాణాలు.. 

జిల్లాలో పెరిగిన కుటుంబాలకు అనుగుణంగా మళ్లీ కొత్తగా గత ఏడాది 7,623 వ్యక్తిగత మరుగుదొడ్లను మంజూరు చేసింది. ఇప్పటి వరకు 1783 మరుగుదొడ్లను పూర్తి చేశారు. ఇంకా పూర్తి చేయాల్సిన మరుగుదొడ్లు 5,840 ఉన్నాయి. వీటన్నిటిని ఈనెల 14 లోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. గడువులోగా పూర్తిచేస్తే. పంద్రాగస్టున ఓడీఎఫ్‌ జిల్లాగా స్వాత్రంత్య దినోత్సవం రోజున జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌ ప్రకటించనున్నారు. 


వారం రోజుల ప్రణాళిక ఇదే..

  • ఆగస్టు8న సర్పంచ్‌లతో కలెక్టర్‌ ఈ-నైట్‌ సమావేశం
  • 9న గ్రామాల్లో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఏరివేత
  • 10న పంచాయతీ, ప్రభుత్వ భవనాలకు సున్నం వేయడం, బహిరంగ మలమూత్ర రహిత గ్రామాల ఏర్పాటుపై చైతన్య కార్యక్రమం
  • 11న స్వచ్ఛ భారత్‌మిషన్‌ అందించిన ఐదు వేర్వేరు చిత్రాలను పంచాయతీల్లో గోడలపై గీయడం
  • 12న గ్రామాల్లో హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు శ్రమదానం 
  • 13న ‘మురికి రహిత నా గ్రామం’ అనే అంశంపై 6, 7, 8 తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో చిత్రలేఖనం, 9,10 తరగతి విద్యార్థులకు వ్యాసరచన పోటీల నిర్వహణ
  • 14న ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో పారిశుధ్యం పరిశుభ్రత కార్యక్రమాలు
  • 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అన్ని గ్రామాలను ఓడీఎఫ్‌గా ప్రకటిస్తారు. 

Advertisement
Advertisement