Abn logo
Oct 13 2021 @ 23:57PM

కార్పొరేటర్‌ భర్తపై చెప్పుతో దాడి


తమ కూతురిని ఎత్తుకెళ్లారంటూ ఇంటి ఎదుట యువతి తల్లిదండ్రుల ఆందోళన
జిల్లా కేంద్రంలో కలకలం రేపిన ఘటన

ఖిల్లా, అక్టోబరు 13: తమ కూతురికి మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లారంటూ ఓ కార్పొరేటర్‌ భర్తపై యువతి తల్లిదండ్రులు దాడి చేసి.. చెప్పుతో కొట్టిన సంఘటన నిజామాబాద్‌ నగరంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికంగా కలకలం రేపిన ఘటన వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌ నగరంలోని వినాయక్‌నగర్‌కు చెందిన ఓ యువతి జిల్లా కేంద్రంలోని ప్రయివేటు ఆసుపత్రిలో వైద్యురాలిగా పని చేస్తోంది. ఈమెకు అదే కాలనీలో నివాసం ఉంటున్న కార్పొరేటర్‌ హేమలత భర్త ఆకుల శ్రీనివాస్‌తో కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శ్రీనివాస్‌ సదరు యువతికి మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. కొన్నాళ్ల క్రితం బలవంతంగా ఎత్తుకెళ్లి.. రహస్యంగా వేరే కాపురం పెట్టాడు. అయితే అప్పటి నుంచి తమ బిడ్డ ఆచూకీ తెలియడం లేదని యువతి తల్లిదండ్రులు బుధవారం నగరంలోని కార్పొరేటర్‌ ఇంటి ఎదుట ఆందోళన చేశారు. కార్పొరేటర్‌ ఎదుటే ఆమె భర్తపై చెప్పుతో దాడి చేశారు. రాజకీయ అండదండలతో యువతలను వంచన చేస్తున్న కార్పొరేటర్‌ భర్త శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాగా.. ఈ విషయమై నగర నాలుగో టౌన్‌ ఎస్సై సందీప్‌ కుమార్‌ను వివరణ కోరగా.. బాధితులు ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదన్నారు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామని తెలిపారు.