Abn logo
Aug 2 2021 @ 01:01AM

ఇసుక పక్కదారి!

కపిలేశ్వరపురం శివారు నారాయణలంకలో నిబంధనలకు విరుద్ధంగా బొండు ఇసుక తవ్వకాలు చేస్తున్న దృశ్యం

  • ఇళ్ల స్థలాల మెరక పేరిట భారీ దందా
  • బహిరంగ మార్కెట్లోకి తరలిపోతున్న తువ్వ ఇసుక
  • నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు
  • అడ్డగోలుగా అనుమతులు ఇచ్చిన రెవెన్యూ, హెడ్‌ వర్క్స్‌ అధికారులు
  • వైసీపీ నాయకుల ప్రత్యక్ష ప్రమేయం

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

జగనన్న ఇళ్ల స్థలాల మెరక పేరిట పెద్ద ఎత్తున ఇసుక దందా జరుగుతోంది. అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధుల ప్రమేయంతో ఇసుక కాంట్రాక్టు పొందిన వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ మార్కెట్‌లో విక్రయించి సొమ్ములు చేసుకుంటున్నారు. ఒక ట్రక్కు ఇళ్ల స్థలాల మెరకకు తరలిస్తే 3, 4 ట్రక్కులు పక్కదారి పడుతున్నాయి. కాంట్రాక్టరు తాలుకా వ్యక్తులు ర్యాంపు వద్దే కౌంటర్లు ఏర్పాటుచేసి తువ్వ ఇసుక విక్రయాలు చేస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వన్యప్రాణుల సంచార ప్రాంతమైన ఆ భూముల్లో ఇసుక తవ్వకాలు నిషిద్ధం.  అయినప్పటికీ మైన్స అధికారులకు అందే ముడుపుల్లో భాగంగా అక్కడ ఇష్టారాజ్యంగా  తవ్వుకోవడానికి గోదావరి హెడ్‌వర్క్స్‌ అధికారులు సైతం ఆమోద ముద్రవేశారు. 

మండపేట నియోజకవర్గ పరిధిలోకి  వచ్చే మండల కేంద్రమైన కపిలేశ్వరపురం గ్రామ శివారు నారాయణలంక నుంచి అమలాపురం రూరల్‌ మండలం వన్నెచింతలపూడి, చిందాడగరువు గ్రామాల్లోని జగనన్న కాలనీల ఇళ్ల స్థలాల మెరక కోసం తువ్వ ఇసుక తరలింపునకు మైన్స అధికారులు అనుమతులు ఇచ్చారు. రత్న ఇనఫ్రాస్ట్రక్చర్‌కు చెందిన యజమాని పి.సూర్యనారాయణ పేరిట రెండు సర్వే నంబర్లలో సుమారు 2.40 ఎకరాల భూమిలో తువ్వ ఇసుక తవ్వకాలకు మైన్స అధికారులు అనుమతులు ఇచ్చారు. సర్వే నెం.680/పీలో 80 సెంట్ల భూమిలో 4800 క్యూబిక్‌ మీటర్ల మట్టిని, 686/పీలో 1.62 ఎకరాల భూమిలో 3936 క్యూబిక్‌ మీటర్ల మట్టిని తరలించేందుకు మైన్స శాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ భూముల్లో 0.60 మీటర్ల లోతు మాత్రమే తవ్వాలని ఆదేశాలిచ్చారు. అయితే రెండు మీటర్లు పైబడే తవ్వకాలు చేస్తున్నా మైన్స అధికారులు మౌనం వహించడం వెనుక కారణాలు వారికే ఎరుక. కపిలేశ్వరపురం తహశీల్దార్‌ జూన 26న, గోదావరి హెడ్‌వర్క్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ జూలై 22న ఇచ్చిన సిఫారసులతో మైన్స అధికారులు అనుమతులు మంజూరు చేశారు. వాస్తవానికి నేషనల్‌ గ్రీన ట్రిబ్యునల్‌ ఆదేశాలను సైతం ఉల్లంఘించి హెడ్‌వర్క్స్‌ అధికారులు అనుమతులు మంజూరు చేయడం వెనుక రాజకీయ ఒత్తిళ్లతో పాటు ఇతర ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు అనుమతించిన భూముల్లో ఉన్న ప్రాంతంలో జింకలు సంచరించే ప్రాంతంగా నిర్ణయించారు. ఇక్కడ ఫారెస్ట్‌ అధికారుల పర్యవేక్షణలో ఈ లంక భూములు ఉంటాయి. అయినప్పటికీ అమలాపురం రూరల్‌ మండలంలోని తాండవపల్లి, వన్నెచింతలపూడి, చిందాడగరువు గ్రామాల్లో నవరత్నాలు పథకంలో భాగంగా పేదలందరికీ ఇళ్లు పేరిట ఇసుకను అక్కడికి తరలిస్తున్నారు. అయితే కొన్ని ట్రిప్పులు మాత్రమే ఇళ్ల స్థలాల మెరక కోసం తరలిస్తుండగా, మిగిలినవి లే అవుట్లు కప్పేందుకు, ఇతర అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు తరలించి భారీగా సొమ్ములు చేసుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. లారీ తువ్వ ఇసుక కిరాయితో కలిపి రూ.10వేలకు విక్రయిస్తున్నట్టు స్థానికులు ఆరోపిస్తు న్నారు. వందల సంఖ్యలో ట్రిప్పులు తిరుగుతున్నప్పటికీ ఇళ్ల స్థలాల సైట్‌కి మిగిలిన ట్రిప్పులను పక్కదారి పట్టించడంలో కాంట్రాక్టు నిర్వాహకులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. నారాయణలంక నుంచి వచ్చే రహదారి మార్గాలు ఛిద్రం కావడంతో పాటు వంతెనలు సైతం ఇరుగ్గా ఉండి ప్రమాదాలకు నిలయంగా మారుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీకి చెందిన కీలక నాయకుల ప్రమేయంతో ఇసుక దందా సాగుతున్నప్పటికీ అధికార యంత్రాంగం చోద్యం చూస్తోంది. కపిలేశ్వరపురంలోని భూముల నుంచి అమలాపురం డివిజనలోని ఇళ్ల స్థలాల కోసం తరలించేందుకు అనుమతులు పొందడంలో ఆ పార్టీ నాయకుల మంత్రాంగం వెనుక భారీ స్కామ్‌ ఉన్నట్టు ప్రజలు ఆరోపిస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. టీడీపీ సహా ఇతర పక్షాల నాయకులు సైతం ఈ వ్యవహారంపై ఆరోపణాసా్త్రలు సంధిస్తున్నారు.