న్యూఢిల్లీ: హై ఎండ్ శాంసంగ్ గెలాక్సీ నోట్ స్మార్ట్ఫోన్లు ఇక కనిపించవా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా హై ఎండ్ స్మార్ట్ఫోన్లకు డిమాండ్ గణనీయంగా తగ్గడంతో వచ్చే ఏడాది నుంచి వీటి ఉత్పత్తిని నిలిపివేయాలని శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కో లిమిటెడ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. శాంసంగ్లోని రెండు ప్రీమియం స్మార్ట్ఫోన్లలో ఒకటైన గెలాక్సీ నోట్, గెలాక్సీ ఎస్ ఫోన్లకు వినియోగదారుల నుంచి డిమాండ్ దారుణంగా పడిపోవడంతో ఈ ఫోన్లను ఉత్పత్తి నుంచి తప్పించాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా వచ్చే ఏడాది గెలాక్సీ నోట్ ఫోన్లకు కొత్త వెర్షన్లు అభివృద్ధి చేయకూడదని కంపెనీ అంతర్గతంగా నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే, స్టైలస్‌తో వచ్చే గెలాక్సీ ఎస్ 21, శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ తర్వాతి వెర్షన్‌ను మాత్రం వేర్వేరుగా విక్రయించనున్నట్టు తెలుస్తోంది. అయితే, శాంసంగ్ మాత్రం ఈ వార్తలపై స్పందించేందుకు నిరాకరించింది.