Oct 13 2021 @ 15:07PM

Amitabh Bachchan రిటైర్ అవ్వాలి.. సినిమాలు, షోలు ఆపెయ్యాలి.. సల్మాన్ తండ్రి షాకింగ్ కామెంట్స్!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన అద్భుత నటనతో, వ్యక్తిత్వంతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. బిగ్ బీ తాజాగా తన 79వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు, కోట్లాది మంది అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 80 ఏళ్ల వయసులోనూ ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ అమితాబ్ యంగ్ హీరోస్‌కు పోటీగా నిలుస్తున్నారు. అంతేకాదు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ తండ్రి, ప్రముఖ రచయిత సలీం ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


అమితాబ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సలీం చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. `అమితాబ్ మరింత ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి. సినిమాలకు, ప్రకటనలకు బిగ్ బీ ఇక రిటైర్‌మెంట్ ఇచ్చెయ్యాలి. ఆయన ఇప్పటికే చాలా ఎక్కువగా పనిచేశారు. ఎనలేని స్టార్‌డమ్‌ని సాధించారు. ఇక, ఇప్పుడు ఆయన తన వయస్సుని దృష్టిలో ఉంచుకుని పదవీ విరమణ చేయాలి. ఆయన ఈ జీవితంలో తనకు కావాల్సినదంతా సాధించాడు. ఒక వ్యక్తి తన కోసం కొన్ని సంవత్సరాల జీవితాన్ని కూడా ఉంచుకోవాలి. వృత్తిపరంగా ఆయన అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఇక విశ్రాంతి ప్రకటించి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాల`ని సలీమ్ ఆకాంక్షించారు.  

Bollywoodమరిన్ని...