Abn logo
Sep 17 2021 @ 00:03AM

సచివాలయ భవన నిర్మాణంపై ఆందోళన

అల్లవరం, సెప్టెంబరు 16: కొమరగిరిపట్నం గ్రామంలో దశాబ్దాలుగా గ్రామదేవత తీర్థం, వారపుసంత నిర్వహించే ప్రదేశంలో చేపట్టే సచివాలయ భవన నిర్మాణాన్ని గ్రామస్థులు అడ్డుకునే ప్రయత్నంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సచివాలయ భవన నిర్మాణం వల్ల మార్కెట్‌ నిర్వహణకు స్థలం లేక ఇబ్బందులు తలెత్తుతాయంటూ వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, గ్రామస్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పథకం ప్రకారం పోలీసులు గురువారం తెల్లవారుజామునే వైసీపీ నేత పిండి మాచరయ్యను అదుపులోకి  తీసుకున్నారు.  అల్లవరం, ఉప్పలగుప్తం, అంబాజీపేట ఎస్‌ఐలు బి.ప్రభాకరరావు, జి.వెంకటేశ్వరరావు, చైతన్యకుమార్‌తో పాటు పోలీసు సిబ్బంది అక్కడకు చేరుకుని సచివాలయ భవన నిర్మాణ పనులు జరిగేలా  రక్షణ కల్పించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు పార్టీలతో సంబంధం లేకుండా అధిక సంఖ్యలో అక్కడకు చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు.  ఈ క్రమంలో జనసేనకు చెందిన కటికిరెడ్డి బాబి, నల్లా రాము, సంగీతం తాతాజీ, పెన్నాటి నాగబాబు, పిండి దొర, ఆకుల నాగశ్రీను, కుంచే నాగార్జునలతో పాటు పన్నెండు మందిని అదుపులోకి తీసుకుని అల్లవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.  మహిళలను సైతం మహిళా పోలీసులు అక్కడి నుంచి నెట్టి  వేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తహశీల్దార్‌ ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రసాద్‌, పరిపాలనాధికారి ఎంవీ సత్యనారాయణ, సర్పంచ్‌ రాకాపు విజయలక్ష్మి తదితరులు పరిస్థితిని సమీక్షించారు. రూ.40లక్షల ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో పంచాయతీరాజ్‌ డీఈఈ రాజ్‌కుమార్‌, ఏఈ జి.సంపన్‌, తహశీల్దార్ల సమక్షంలో సర్పంచ్‌ రాకాపు విజయలక్ష్మి కొబ్బరికాయ కొట్టి సచివాలయం-3 భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం అక్కడకు చేరుకున్న జనసేన నాయకులు శెట్టిబత్తుల రాజబాబు, సందాడి శ్రీనుబాబు, చిక్కాల సతీష్‌, చిక్కం భీముడు  మాట్లాడుతూ భవనాన్ని కచేరీ చావిడి స్థలంలో నిర్మించాలని డిమాండ్‌ చేశారు.